సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రతిపాదించిన పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విదేశీ విద్య పథకం కింద రూ. 5 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ విధానాల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయటానికి ఏర్పరచిన పథకాన్ని ఆమోదించింది. వేద పాఠశాలలకు రూ. 2 లక్షల గ్రాంట్ మంజూరు చేయడానికి అంగీకరించింది. 75 ఏళ్లు నిండిన వేద పండితులకు నెలకు రూ. 2,500 చొప్పున గౌరవ పారితోషికం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. శాస్త్ర పారంగతులు వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 250 చొప్పున స్టైఫండ్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్మార్ధం పూర్తి చేసిన వారికి రూ. 3 లక్షలు, వేద పాఠశాలల నుంచి బయటకు వచ్చే ముందు, క్రమాంతం, గణాంతం చదువుకున్న వారికి రూ. 5 లక్షల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆమోదం లభించింది.
కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సబ్సిడీ..
బ్రాహ్మణుల్లో రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలన్నా లేదా వ్యాపారం చేసుకోవాలన్నా రూ. 1 లక్ష ప్రాజెక్టు అయితే 80 శాతం సబ్సిడీ, రూ. 12 లక్షల లోపు ప్రాజెక్టు అయితే రూ. 5 లక్షలు మించకుండా 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇంతకు ముందు మంజూరైన వాటిలో ఈ నియమం పాటించిన వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం సూచించింది. విదేశీ విద్య పథకం, బ్రాహ్మణ ఉపాధి పథకాల కింద దరఖాస్తు చేయదలచిన వారు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 20న జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో 2018–19 ఏడాదికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
బ్రాహ్మణ పరిషత్ ప్రతిపాదనలకు ఆమోదం
Published Tue, Sep 18 2018 2:22 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment