విదేశీ విద్యకు వెనుకడుగు | indian students not interested to Foreign education | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యకు వెనుకడుగు

Published Wed, Nov 22 2017 7:53 AM | Last Updated on Wed, Nov 22 2017 7:53 AM

indian students not interested to Foreign education - Sakshi

రాష్ట్రంలో పేద విద్యార్థులకు అమలు చేస్తున్న విదేశీ విద్య పథకానికి విద్యార్థుల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు. విదేశీ విద్య కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు చెల్లిస్తుంది. ఇంతపెద్ద మొత్తంలో చెల్లించే సౌలభ్యం ఉన్నా విద్యార్థులు ఈ పథకాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు మాత్రం లేకుండా నిబంధనలు విధించారు. విద్యార్థుల కుటుంబ వార్షికా దాయం నిబంధన ఈ పథకం అమలులో మొదటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు. 

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విదేశాల్లో  ఎంఎస్, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ చదివే దళిత, గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013వ సంవత్సరంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కేవలం ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇతర వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో బీసీ విద్యార్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకాన్ని, మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ పేరిట పథకాలను 2016వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, కెనడా, సింగపూర్, డెన్మార్క్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల్లో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించింది.

ఆర్థిక ప్రయోజనం ఇలా..
ఈ పథకం ప్రకారం లబ్ధిదారులకు రూ.10 లక్షలతో పాటు విమాన ఛార్జీలు, వీసా ఫీజులు చెల్లిస్తారు. దీనిలో విద్యార్థి విదేశానికి వెళ్లిన తరువాత ముందుగా రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. మొదటి సెమిస్టర్‌ పూర్తి అయిన తరువాత మిగిలిన రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రాష్ట్రంలో సుమారు 300 మంది ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు, 500 మంది బీసీ విద్యార్థులకు, 350 మంది ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.

రెట్టింపు ఖర్చు
ఈ పథకం కింద విద్యార్థికి ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లిస్తున్నా విదేశీ చదువులకు వెళ్లే విద్యార్థులు దానికి రెండింతలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో వారికి రూ. 20 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. ఫీజులు, విమాన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం చెల్లిస్తున్నా, కొన్ని దేశాల్లో విద్యా సంస్థల ఫీజులే అధికంగా ఉండడం, హాస్టల్‌ ఛార్జీల భారం, ఇతర చిల్లరమల్లర ఖర్చులు వెరసి తడిసి మోపెడవుతున్నాయి. జర్మనీ వంటి దేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లినా ఆయా విద్యా సంస్థలకు కోర్సుకు చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంక్‌ బ్యాలెన్స్‌గా చూపాల్సి ఉంటుంది. అంత మొత్తం సామాన్య, మధ్యతరగతి వారు నిల్వ చేయడం మాటల్లో చెప్పినంత తేలిక కాదంటున్నారు. 

అడ్డంకులు ఇలా.. 
ఈ పథకాన్ని అందిపుచ్చుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నో అడ్డంకులు ఎదురౌతున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కోవడం వారికి పెను సవాలుగా మారుతోంది. ఆదాయ సర్టిఫికెట్‌కు వెళితే విదేశీ విద్యకు పంపే వారికి దారిద్య్రరేఖకు దిగువ ఉన్నారని సర్టిఫికెట్‌ ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పేస్తున్నారు. 

అక్కడ వారిని బతిమాలి ఎలాగోలా సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అధికారులు వేసే యక్ష ప్రశ్నలతో చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడం తమ వల్ల అయ్యే పనికాదని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న తరువాత విద్యార్థి, వారి తల్లిదండ్రులు అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోవలసి వస్తోంది. చివరికి పథకానికి ఎంపికైనా నిధులు మంజూరుకు మాత్రం నెలలకు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది.

వేళ్లతో లెక్కించే సంఖ్యలోనే విద్యార్థుల ఎంపిక..
విద్యానిధి పథకం కింద 2014 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే విదేశీ చదువులకు ఎంపికయ్యారు. వీరిలో కేవలం 13 మంది విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది 30 మంది విద్యార్థులకు అవకాశం ఉన్నా ఇప్పటి వరకూ కేవలం ఏడుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది ఒక గిరిజన విద్యార్థి, ముగ్గురు మైనార్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్లగా మరో ఏడుగురి దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి.  2016–17 విద్యాసంవత్సరంలో 29 మంది బీసీ విద్యార్థులు ఈ పథకానికి ఎంపికై విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఏడాది 70 మంది విద్యార్థులు విదేశీ చదువులకు వెళ్లడానికి అవకాశమున్నా ఇప్పటికీ కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు 

తలప్రాణం తోకకొచ్చింది..
మా అమ్మాయిని విదేశీ విద్య చదివించడానికి ఈ పథకాన్ని వినియోగించుకుందామని ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ప్రయత్నించగా ఎక్కడా వీలుకాలేదు. తరువాత మైనార్టీ సంక్షేమ శాఖలో సంప్రదించగా వారి కార్యాలయం నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుకలిగింది. దరఖాస్తు చేసుకుని ఇప్పటికి ఆరు నెలలు గడుస్తోంది. మంజూరు కావడానికి సమయం పడుతుంది అంటున్నారు. అధికారులు తమ సొంత డబ్బు ఉచితంగా ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తు చేయడమే ప్రహసనంగా మారింది.                          
– ఎం.శోభారాణి, విద్యార్థి తల్లి

ఇబ్బందులున్నమాట వాస్తవమే..
ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎదురవుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడానికి రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి 3 – 4 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి  నిధులు మంజూరు చేయడం త్వరగానే జరిగిపోతుంది.
– జి.లక్ష్మీ ప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement