విదేశీ విద్యకు ‘కవరేజీ’ ఉందా!! | Foreign education coverage in insurance | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యకు ‘కవరేజీ’ ఉందా!!

Published Sun, May 14 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

విదేశీ విద్యకు ‘కవరేజీ’ ఉందా!!

విదేశీ విద్యకు ‘కవరేజీ’ ఉందా!!

స్టూడెంట్‌ ట్రావెల్‌ పాలసీ లేకుంటే కష్టం  
స్థానిక హెల్త్‌ పాలసీలకన్నా ఇవే చౌక   
విద్య ముగిసే వరకూ కవరేజీ గడువు


శ్రీకర్‌ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అంతా బాగానే ఉన్నా కొత్త వాతావరణం కావటంతో ఇమడలేకపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స చేయించుకోవటానికి ఆసుపత్రికి వెళ్లాడు. కానీ అక్కడి వ్యయం భరించటం తన వల్ల కాలేదు. చేసేదేమీ లేక తల్లిదండ్రులను సంప్రతించి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అదే శ్రీకర్‌ కనక ట్రావెల్‌ లేదా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుని ఉంటే...! పరిస్థితి మరోలా ఉండేది.

విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేయాలన్న అభిలాష మన దేశ విద్యార్థుల్లో ఏటేటా పెరుగుతూనే ఉంది. నిజానికి పిల్లల్ని విదేశాలకు పంపటం అంత తేలిక్కాదు. విదేశాల్లో విద్య, వసతి రూపేణా ఎదురయ్యే అధిక వ్యయాలను భరించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేస్తారు. ఇంతా చేసి... విదేశీ గడ్డపై అడుగు పెట్టాక ఎదురయ్యే అవాంఛనీయ పరిస్థితులను తట్టుకునేందుకు ముందుగానే సరైన రక్షణ చర్యలు తీసుకోవడాన్ని  మాత్రం మర్చిపోతారు. అందుకే ఇన్ని చేసిన వారు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు.

వైద్య, దంత చికిత్సలు
స్టూడెంట్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే వారు అందులో వైద్య, ప్రమాద కవరేజీ ఉండేలా చూసుకోవాలి. దాంతో విదేశాల్లో అనుకోకుండా ఎదురయ్యే భారీ వైద్య ఖర్చుల నుంచి రక్షణ లభిస్తుంది. దంత చికిత్సల కవరేజీ కూడా చాలా అవసరం. ఎందుకంటే విదేశాల్లో దంత వైద్య ఖర్చులు మన దేశంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ.

డాక్యుమెంట్లు, న్యాయపరమైన ఖర్చులకూ...
ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌లో... న్యాయపరంగా తలెత్తే ఖర్చులు, పాస్‌పోర్ట్, ఇతర విలువైన డాక్యుమెంట్లు చోరీకి గురైతే ఆదుకునే కవరేజీ కూడా ఉండేలా చూసుకోవడం అవసరం. కాంప్రహెన్సివ్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఈ కోవలోకి వస్తాయి. బ్యాగేజీ తనిఖీలు ఆలస్యమైనా పరిహారం ఇస్తాయి. స్టూడెంట్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అన్నది ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌కు భిన్నమైనది. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఓ వ్యక్తి పర్యటనకు మాత్రమే కవరేజీ ఇస్తుంది. పర్యటన పూర్తితో ఇది ముగిసిపోతుంది. కానీ, స్టూడెంట్‌ ట్రావెల్‌ బీమా మాత్రం విదేశాల్లో అకడమిక్‌ కాల వ్యవధి వరకు అమల్లో ఉంటుంది.

పాలసీ వ్యయం
విదేశాల్లో తీసుకునే పాలసీ కంటే మన దేశంలో తీసుకునే స్టూడెంట్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఖర్చు తక్కువ. అయితే, ఈ ప్రీమియం కూడా  ఏ దేశానికి వెళుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో ఉన్నత విద్య పర్యటనకు పాలసీ వ్యయం ఆఫ్రికాతో పోల్చుకుంటే ఎక్కువ. కారణం అమెరికాలో వైద్య వ్యయాలు భారీగా ఉండడమే. కొలంబియా యూనివర్సిటీ 3 లక్షల డాలర్ల హెల్త్‌ కవరేజీని రూ.1,30,000కు అందిస్తోంది.

అదే 5 లక్షల డాలర్ల కవరేజీని స్వదేశంలో రూ.46,851కే పొందే అవకాశం ఉంది. ఇక కెనడా వెళ్లే విద్యార్థులు అక్కడ యూనివర్సిటీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను తీసుకునే సదుపాయం ఉంది. ఇందుకు ఏటా రూ.40,000 వ్యయం అవుతుంది. అయితే, పాలసీ ఎంపికలో ప్రీమియం కీలకం కాదు. వైద్య చికిత్సలు సులభంగా పొందటమే ముఖ్యం. కొన్ని బీమా సంస్థలు అందించే పాలసీలతో నెట్‌వర్క్‌ హాస్పిటళ్లలో నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. యూనివర్సిటీ పాలసీ ఎంచుకుంటే మాత్రం అందులో ఉన్న లాభ, నష్టాల గురించి ముందుగానే విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలి.

పాలసీ తీసుకునే ముందు...
విద్యా సంస్థలు కూడా తమ విద్యార్థులకు ఈ బీమా ఉండాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుంటున్నాయి. దీంతో విదేశాల్లోని కొన్ని కళాశాలలు తమ విద్యార్థులకు స్వయంగా కొన్ని రకాల పాలసీల్ని సూచిస్తున్నాయి. అయితే, కొన్ని విదేశీ కళాశాలలు తా ము సూచించిన సంస్థల నుంచే పాలసీని తీసుకోవాలన్న నిబంధనను అమలు చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. కాకపోతే ఇది అన్నింటికీ వర్తించదు. కొన్ని యూనివర్సిటీలే ఇలా చేస్తున్నాయి. కొన్ని సాధారణ నిబంధనలను సూచిస్తున్నాయి. వాటికి సరిపోయే పాలసీని ఏ సంస్థ నుంచైనా తీసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి బయల్దేరే ముందే స్టూడెంట్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్లిన తర్వాత సాధారణ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు.

కానీ ఈ రెండింటిలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉత్తమం. ఎందుకంటే ఇది ఎన్నో రకాల కవరేజీలను అందించే సమగ్ర పాలసీ. అలాకాక పరాయి దేశంలో సాధారణ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అకడమిక్‌ గడువులోపు స్వదేశానికి వెళ్లి వచ్చే ప్రతిసారీ విడిగా ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తాము అడ్మిషన్‌ పొందిన కళాశాలల నిబంధనల ప్రకారం బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరా, కాదా అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి.

ఉన్నతమైన సేవలు
ఇన్సూరెన్స్‌ కంపెనీని బట్టి పరిహార చెల్లింపుల ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. చాలా వరకు మనదేశంలోని బీమా సంస్థలు విదేశాల్లోని అత్యవసర సేవల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్లెయిమ్‌ కోసం ఏ దేశంలో అయితే ఉన్నారో అక్కడి స్థానిక నంబర్‌ను కాల్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement