
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు కష్టాలకు త్వరలో చెక్ పడనుంది. ప్రాధాన్యతా క్రమంలో ఫీజుల పంపిణీ విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం సమన్యాయం దిశగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలకు రెండు పద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ లెక్కన టెక్నికల్, నాన్ టెక్నికల్ కేటగిరీలకు వేర్వేరుగా నిధులు విడుదల చేయనుంది. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్లో అధిక భాగం సాంకేతిక కోర్సులు చదువుతున్న వారివే. ఈ క్రమంలో ప్రభుత్వం త్రైమాసికాలవారీగా నిధులు విడుదల చేస్తుండగా... తొలి ప్రాధాన్యత కింద విడుదలైన నిధులను టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు ఇస్తున్నారు. దీంతో జనరల్ కోర్సులు చదివే విద్యార్థులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంఖ్యాపరంగా అధికంగా ఉండే జనరల్ కోర్సుల విద్యార్థులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం తలనొప్పిగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ సమన్యాయ సూత్రాన్ని పాటించాల ని భావించిన ప్రభుత్వం... వేర్వేరు పద్దులు ఏర్పా టు చేసింది. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఈ రెండు పద్దుల విధానం అమల్లోకి రానుంది.
ఏ, బీ కేటగిరీలుగా...
ప్రస్తుతం సంక్షేమ శాఖలకు ఒకే పద్దు కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటిని జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖాధికారులకు విడుదల చేసి అక్కడ్నుంచి విద్యార్థుల ఖాతాలకు నిధులు పంపిణీ చేస్తున్నారు. తాజాగా కొత్త విధానాన్ని అమలు చేయనుండటంతో సంక్షేమ శాఖలకు రెండు పద్దులు ఏర్పాటు కానున్నాయి. ప్రతి శాఖలో జనరల్ కేటగిరీగా ‘ఏ’, వృత్తివిద్య కేటగిరీగా ‘బీ’పేరుతో పద్దులను నిర్వహించనున్నారు. ‘ఏ’కేటగిరీలో ఇంటర్మీడియెట్, జనరల్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్ కోర్సులుంటాయి. కేటగిరీ ‘బీ’లో ఇంజనీరింగ్, ఎంటెక్‌తోపాటు వృత్తివిద్యకు సంబంధించిన కేటగిరీలుంటాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కింద ఏటా దాదాపు 13 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏటా రూ. 2,250 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో దాదాపు ‘ఏ’కేటగిరీకి సంబంధించి 63 శాతం విద్యార్థులుండగా... బడ్జెట్‌లో 44 శాతంమాత్రమే వారికి అవసరమవుతుంది. వృత్తివిద్యా విభాగంలో 37 శాతం విద్యార్థులకు ఏకంగా 56 శాతం బడ్జెట్ వినియోగమవుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో ఫీజులు విడుదల చేస్తుండటంతో ఎక్కువ బడ్జెట్ వృత్తివిద్యా కోర్సులకే ఖర్చవుతోంది. దీంతో జనరల్ కోటాకు తదుపరి విడుదలయ్యే నిధులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో జూనియర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల పంపిణీలో అన్యాయం జరుగుతోందంటూ ఎస్సీ అభివృద్ధిశాఖ వద్ద పలుమార్లు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్ కొత్త విధానానికి సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించగా వాటిని ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో కొత్తగా రెండు పద్దుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
పద్దులు ఇలా...
- ప్రతి శాఖలో జనరల్ కేటగిరీగా ‘ఏ’, వృత్తివిద్య కేటగిరీగా ‘బీ’ పేరుతో పద్దులను నిర్వహించనున్నారు.
- ‘ఏ’ కేటగిరీలో ఇంటర్మీడియట్, జనరల్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్ కోర్సులుంటాయి.
- కేటగిరీ ‘బీ’లో ఇంజనీరింగ్, ఎంటెక్‌తోపాటు వృత్తివిద్యకు సంబంధించిన కేటగిరీలుంటాయి.
- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కింద ఏటా దాదాపు 13 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment