బీసీల పోరుగర్జన మహాసభలో అభివాదం చేస్తున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
దిల్‌సుఖ్‌నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాడానికి స్కాలర్ షిప్‌లు, ఫీజులు ఇవ్వాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గొర్లను, బర్లను ఇస్తూ బీసీలను మళ్లీ కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ‘పాలమూరు నుంచి పట్నం వరకు’పేరిట డిసెంబర్ రెండో తేదీన చేపట్టిన బీసీల పోరుయాత్ర గురువారం ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది.
ఈ సందర్భంగా కొత్తపేటలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో నిర్వహించిన బీసీల పోరుగర్జన మహాసభలో ఆయన మాట్లాడారు. గత మూడున్నరేళ్లుగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని, స్కాలర్‌షిప్‌లు, మెస్‌చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచడం లేదని విచారం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో నాసిరకం భోజనం పెడుతున్నారని, ఆసరా పింఛన్‌దారులకు రూ.2016 రూపాయలు ఇస్తుండగా, హాస్టల్ విద్యార్థులకేమో రూ.1,500 ఇస్తున్నారని అన్నారు.
బీసీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్ర అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బైరు రవికృష్ణ గౌడ్, బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు స్వామిగౌడ్, పాలకూరి కిరణ్, ఎస్.దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment