భోగాపురం: ఓ పక్క ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు.. మరో పక్క గ్రామదేవత పైడితల్లి అమ్మవారి వనుము.. ఇంకోవైపు జాతీయ రహదారి.. ఇలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ దుకాణం ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. భోగాపురం మండల కేంద్రంలో బట్టికాలువ సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని (లైసెన్స్ జీఎల్‌ఎస్ నంబర్ 30 (ఏ 4 షాపు) నాయుడు వైన్స్) పోలిపల్లి గ్రామానికి మార్చేందుకు సదరు షాపు యజమాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదే గ్రామానికి చేరువలో వైఎస్సార్‌సీపీ నాయకుడుకి చెందిన మద్యం దుకాణం ఉంది. అతడిని ఇబ్బంది పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు నాయుడు వైన్స్‌ను అక్కడే ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు.
అనుకున్నదే తడువుగా పాఠశాల, గ్రామదేవత వనుము, జాతీయ రహదారి మధ్యలో అధికార పార్టీ నాయకుడికి చెందిన స్థలంలో షాపు ఏర్పాటుకి షెడ్ కూడా నిర్మించేశారు. అయితే జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు మాసాల కిందట కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, అబ్కారీశాఖ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సూపరింటిండెంట్, భోగాపురం సీఐ ఇలా ప్రతీ ఒక్కరికీ ఫిర్యాదుతో పాటు షాపు ఏర్పాటు వల్ల ఏర్పడే ఇబ్బందులను వివరించారు. అలాగే ఆ స్థలంలో షాపు పెట్టకుండా నిలుపుదల చేయాలంటూ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ అబ్కారీ శాఖ కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో డిప్యూటీ క మిషనర్ పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం సు ప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం సదరు స్థలంలో షాపు ఏ ర్పాటు చేయడానికి కుదరదంటూ కమిషనర్‌కి ఈ ఏడా ది మార్చి 27న నివేదిక పంపించారు. దీనిపై కమిషనర్ మార్చి 28న విజయవాడలో పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి గ్రామస్తుల అభ్యంతరాన్ని నేరుగా తెలుసుకున్నారు.
అధికారులపై ఒత్తిడి..
అయితే షాపు పెట్టడానికి అవకాశం లేదన్న విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు ఏకంగా మంత్రులతో అబ్కారీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో మార్చి 30న అబ్కారీశాఖ అధికారులు మళ్లీ షెడ్‌ను పరిశీలించి కొలతలు వేశారు. షాపు పెట్టే స్థలం కూడా అధికార పార్టీ వారికి చెందినది కావడంతో అధికారులు నిబంధనలకు పాతర వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అబ్కారీశాఖ సీఐ బహుదూర్ వద్ద ప్రస్తావించగా, మద్యం దుకాణాన్ని భోగాపురం నుంచి పోలిపల్లికి మార్చేందుకు ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఈ ఫైల్ కమిషనర్ వద్ద ఉందన్నారు. మద్యం షాపు పెట్టేందుకు నిర్మాణం చేసిన షెడ్ నిబంధనల ప్రకారం ఉందా? లేదా? అని ప్రశ్నించగా నిబంధనల ప్రకారం ఉంటే షాపు ఎప్పుడో ప్రారంభమయ్యేది కదా అని సమాధానమిచ్చారు. ఏది ఏమైనా ఈ అంశం తమ చేతిలో లేదని కమిషనర్ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment