
ఇప్పుడు వేల మందిలో ఉన్నా ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కి చెందిన సుదీక్షా భాటిని సులభంగా గుర్తుపట్టొచ్చు. అందుకు కారణం ఆమె కళ్ళల్లో తొణికిసలాడే విజయస్వప్నం. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన చాయ్ వాలా కూతురు సుదీక్షా భాటీ. రోజూ పదికో పరకకో టీ అమ్ముకుని బతికే సుదీక్షా భాటీ తండ్రి వార్షికాదాయం కేవలం 72000. కానీ పట్టుదలతో చదివి తన కుటుంబాన్ని పేదరికంలో నుంచి విముక్తి చేయాలనుకుంది ఆయన కూతురు. రేయింబవళ్ళు కష్టపడి చదివి సిబిఎస్‌సి ప్లస్‌టూ పరీక్షల్లో 98శాతం మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. అదే ఆమె కలను సాకారం చేసింది. ఈ విజయంతో చాయ్‌వాలా కూతురు సుదీక్షా భాటీని అమెరికా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చదువుకునేందుకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ సుధీక్షా భాటీని వరించింది. ఒక్కో సెమిస్టర్‌కి 70,428 అమెరికన్ డాలర్లు, నాలుగేళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుకి మొత్తం 3 కోట్ల 83 లక్షల రూపాయల స్కాలర్‌షిప్ సొంతం చేసుకొని అమెరికాలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటైన బాబ్సన్ కాలేజీలో చదువుకునే అత్యున్నతావకాశం సుదీక్షా భాటీ సొంతమైంది. కేవలం చదువులోనే కాదు సామాజిక కార్యకలాపాల్లో సైతం సుదీక్షా భాటీ ముందు వరుసలో ఉంటుంది. ఆడపిల్లల వేధింపులకు వ్యతిరేకంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థలో ఉంటూ ఆడపిల్లలను చదివించాలని ఉద్యమిస్తోన్న సుదీక్షా భాటీ ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది. పేదరికం కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్న సుదీక్ష ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు సాగుతానంటోంది. ‘‘అమెరికాలో చదవాలనే నా కల సాకారమయ్యింది. నా విజయం నాకే కాకుండా నా కుటుంబానికీ, నేను చదువుకున్న పాఠశాలకూ పేరుప్రతిష్టలు సమకూర్చడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. మరింత పట్టుదలతో నా గమ్యం వైపు పయనిస్తాను. నా లక్ష్యసాధనకోసం కఠోరశ్రమ చేయాల్సి ఉంది. చేయగలనన్న నమ్మకం నాకుంది’’ అని సుధీక్షా భాటీ సగర్వంగా ప్రకటించారు.