సుదీర్ఘ ప్రసంగం.. విసుగెత్తిన జనం | Chandrababu Naidu Attends Grama Darshini Programme West Godavari | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ ప్రసంగం.. విసుగెత్తిన జనం

Published Fri, Jul 27 2018 9:37 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Chandrababu Naidu Attends Grama Darshini Programme West Godavari - Sakshi

పశివేదలలో అండర్‌గ్రౌండు డ్రైనేజీ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. చిత్రంలో మంత్రి జవహర్, పితాని తదితరులు

కొవ్వూరు/కొవ్వూరు రూరల్‌ : సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగానికి పశివేదల గ్రామ జనం విసుగెత్తిపోయారు. గురువారం ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు గ్రామానికి వచ్చారు. గ్రామంలో పలువీధుల్లో పర్యటించి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి జవహర్, స్థానిక సర్పంచ్‌ కాశీఅన్నపూర్ణ తప్ప వేదికపైన వేరొకరికి మాట్లాడే అవకాశం కల్పించలేదు. కొవ్వూరులోను మంత్రి జవహర్, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జొన్నలగడ్డ రాధారాణి, కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌లు మాత్రమే ప్రసంగించారు. కొవ్వూరులో ఏకంగా గంటా నలభై నిమిషాలు సీఎం ప్రసంగించడంతో జనం విసుగెత్తిపోయారు. ఇక వినలేక నెమ్మదిగా జారుకున్నారు. పోలీసులు జనాన్ని నిలువరించేందుకు ప్రవేశ ద్వారాల వద్దకట్టడి చేసే ప్రయత్నాలు చేశారు. నాయకులు సైతం జనానికి సర్దిచెప్పి కూర్చోపెట్టాల్సి వచ్చింది.

సీఎం తన ప్రసంగంలో ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా చేకూరే లబ్ధిని వివరించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. పశివేదల గ్రామానికి ప్రత్యేక వరాలేమీ ప్రకటించలేదు. మంత్రి కేఎస్‌ జవహర్‌ గ్రామంలో ఎస్సీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం ఏవిధమైన ప్రకటన చేయకపోవడంతో స్థానికులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. స్థానిక సర్పంచ్‌ బేతిన కాశీఅన్నపూర్ణ సర్పంచ్‌ల పదవీ కాలం పొడిగించాలని కోరినా సీఎం ఏవిధమైన ప్రకటన చేయలేదు. పథకాల వారిగా కాల్‌సెంటర్‌ ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో వచ్చిన మార్కులను మండల శాఖ అధికారులతో చర్చించారు. గ్రామ వికాసం పుస్తకావిష్కరణ, పవర్‌ ఆఫ్‌ పశివేదల వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. మంత్రి జవహర్‌ మాట్లాడుతూ పశివేదలలో 90 శాతం సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. గ్రామంలో ఇంకా పది కుటుంబాలకే ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. అంతకు ముందు కొవ్వూరు –నందమూరు రోడ్డులోని హెలిప్యాడ్‌ వద్ద సీఎం చంద్రబాబుకు నాయకులు స్వాగతం పలికారు. మంత్రి కెఎస్‌ జవహర్, ఏఎంసీ చైర్మన్‌ వేగి చిన్నా, మున్సిపల్‌ చైర్మన్‌ జొన్నలగడ్డ రాధారాణి, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, ఎంపీపీ వాడవెల్లి రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దుద్దుపూడి రాజా రమేష్, నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, కంఠమణి రామకృష్ణ, బేతిన నారాయణ, యలమాటి సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు.

సీఎంకు సమస్యలపై వినతులు
బూరుగుపల్లి సుబ్బారావు అనే రైతు చాగల్లు చెరకు ఫ్యాక్టరీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరారు. ఊనగట్ల గ్రామంలో గుండాల పుంత రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. నందమూరుకు చెందిన గన్నమని గణేష్‌ అనే దివ్యాంగుడు ఎలక్ట్రికల్‌ ట్రైసైకిల్‌ ఇప్పించాలని కోరారు. అడ్వకేట్‌ కొడవలి బాలాజీ వికలాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తున్నందున పదవీకాలం పొడించాలని సర్పంచ్‌ల ఛాంబర్‌ సభ్యులు సీఎంకి వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు పట్టణానికి..

నగర దర్శిని–నగర వికాసం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సంస్కృత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పట్టణంలో అవుట్‌ పాల్‌ డ్రయిన్‌ నిర్మాణానికి  నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాల వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయిస్తామని ప్రకటించారు. అంతకు ముందు మంత్రి జవహర్‌ మాట్లాడారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రాధారాణి, మంత్రి పితాని సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పెండ్యాల అచ్యుత రామయ్య (అచ్చిబాబు), కలెక్టర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement