ఉద్దేశించిన లక్ష్యం నెరవేరడం లేదు! | Ashok Dhanawat Write on Ambedkar Overseas Vidyanidhi Scholarship | Sakshi
Sakshi News home page

ఉద్దేశించిన లక్ష్యం నెరవేరడం లేదు!

Published Tue, Oct 4 2022 2:21 PM | Last Updated on Tue, Oct 4 2022 2:25 PM

Ashok Dhanawat Write on Ambedkar Overseas Vidyanidhi Scholarship - Sakshi

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దళిత – గిరిజన విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించడానికి ఇచ్చే ‘అంబేడ్కర్‌ విదేశీ ఉపకార వేతనం’లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఈ పథకాన్ని 2013లో మొదలు పెట్టారు. అయితే ఉమ్మడి రాష్టంలో విదేశీ విద్యకు పది లక్షల రూపాయలు; వారి వీసా, విమాన ఖర్చులు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ స్కాలర్‌షిప్‌ను రూ. 20 లక్షలకు పెంచారు. అయితే ఆ పెంచిన ఉపకార వేతనం కూడా విద్యార్థులకు ఏమాత్రం సరి పోవడం లేదు. అలాగే ఈ ఉపకార వేతనం పొందటానికి విధించిన కొన్ని షరతులూ వెనుకబడిన దళిత, గిరిజన పిల్లలకు ఇబ్బంది కరంగా ఉన్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం ‘అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి స్కాలర్‌షిప్‌’ ఇచ్చే ప్రక్రియలో అనేక లోటుపాటులు ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్‌ మంజూరు అయినవారికి కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.  ఈ డబ్బు కనీసం విశ్వవిద్యాలయాల ట్యూషన్‌ ఫీజు కట్టడానికి కూడా చాలదు. విదేశాల్లో పీజీ పూర్తి చేయాలంటే రూ. 50 లక్షల నుండి కోటి వరకూ ఖర్చవుతుంది. పిల్లిని పెంచడానికి కావలసిన పాల కోసం ఆవును కొన్నట్లు... పేద దళిత, ఆదివాసీ విద్యార్థులు రూ. 20 లక్షల స్కాలర్‌ షిప్‌ మంజూరైన కారణంగా... తమ తాహతుకు మించి బ్యాంకుల నుండి పూర్తి ఖర్చులకు సరిపడా డబ్బు లోన్‌ తీసుకుని తమ విదేశీ విద్యాభ్యాసాన్ని పూర్తిచేయవలసి వస్తున్నది. అప్పుల పాలయిన విద్యార్థులు వాటిని తీర్చడానికి ఏదో ఒక చోట పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తూ విద్యార్జనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. 

ఈ పథకంలో మరికొన్ని లోపాలూ ఉన్నాయి. కేవలం ప్రపంచంలోని 10 దేశాలలో చదివితేనే ఈ ప్రభుత్వ పథకానికి దళిత – గిరిజన విద్యార్థులు అర్హులు. వేరే దేశాల్లో మంచి యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినా ఈ స్కాలర్‌షిప్‌ పొందేందుకు అవకాశం లేదు. ఇందువల్ల ఈ పథకం నిజంగా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో అణగారిన వర్గాల విద్యార్థులకు మేలు చేయటం లేదు. అలాగే ఈ పథకం కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలంటే వారి డిగ్రీ, పీజీ కోర్సులలో 60 శాతం మార్కులు ఉండాలి. అయితే మన దేశంలో ఏ ప్రభుత్వ యూనివర్సిటీలలో అయినా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావాలి అంటే కేవలం 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. మరి చదువుకునే విద్యార్థులకు 60 శాతం మార్కుల నిబంధన ఎందుకో అర్థం కాదు. (క్లిక్ చేయండి: భారతీయ గ్రామాల్లో ఇంగ్లిష్‌ విప్లవం)

ఇంతే కాకుండా జీఆర్‌ఈ, ఇంగ్లిష్‌ సామర్థ్య పరీక్షలు...  వారు వెళ్లే యూనివర్సిటీకి అవసరం లేకున్నా ఈ స్కీం నుంచి విద్యార్థులు లబ్ధి పొందాలి అంటే కచ్చితంగా ఈ పరీక్షలు రాయాలనే నిబంధన ఉంది. గ్రామీణ ప్రాంతాలు, వెనకబడిన అటవీ ప్రాంతాల నుండి వచ్చే దళిత, గిరిజన విద్యార్థులకు ఈ పరీక్షల్లో స్కోర్‌ సాధించడం చాలా కష్టం. ఈ నిబంధన కారణంగా అనేక దళిత–గిరిజన విద్యార్థులు లబ్ధి పొందలేక పోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉపకార వేతనం మంజూరు విషయంలో వాస్తవాలకు అనుగుణంగా స్కీమ్‌కు మార్పు చేర్పులు చేయాలని సంబంధిత విద్యార్థిలోకం కోరుకుంటోంది. (క్లిక్ చేయండి: పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?)

- అశోక్‌ ధనావత్‌ 
విద్యార్థి, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్, ది హేగ్, నెదర్లాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement