ప్రథమ పురుష | Anil Atluri Stories's | Sakshi
Sakshi News home page

ప్రథమ పురుష

Published Sun, Jul 1 2018 12:20 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Anil Atluri Stories's - Sakshi

‘‘ఏమైంది, దానికి?’’ ‘‘గేటు వేస్తుంటే వేలు నలిగింది!’’ ‘‘వేలు నలగడం ఏమిటీ? ఎవరు గేటు వేశారు? ఎక్కడ గేటు వేశారు?’’ ‘‘మనింట్లోనేనండి!’’ ‘‘మనింట్లో గేటు లాగడం ఏమిటి? పైగా పిల్ల లాగడం ఏమిటి?’’ ‘‘అబ్బా స్కూల్‌ బస్‌ దిగింది. దిగి గేటు తీసుకుంది.’’ ‘‘స్కూల్‌ బస్సు దిగితే, నువ్వేం చేస్తున్నావు?’’ ‘‘అప్పుడే వంట ముగించుకుని, స్నానానికి వెళ్ళానండి!’’‘‘పిల్ల స్కూల్‌ నుంచి వస్తుందని తెలుసు కదా? స్నానానికి వెళ్ళడం ఏమిటి?’’ ‘‘టైముందనుకున్నానండి!’’ ‘‘టైముండటం ఏమిటే! స్కూల్‌ వాళ్ళు ఫోన్‌ చేసి చెప్పారా? ఈరోజు బస్సు లేటవుతుందని?’’ ‘‘అలా కాదండి.

పిల్ల వచ్చేలోపు స్నానం ముగించేయ్యొచ్చుకదా అని!’’ ‘‘రోజూ ఎలా చేస్తున్నావు?’’ ‘‘పిల్ల వచ్చింతర్వాత, దానికి అన్నం పెట్టి నేను స్నానానికి వెళ్తున్నానండి.’’ ‘‘మరి ఈ రోజు ఎందుకు ఆగలేకపోయావ్‌?’’ ‘‘చెబుతున్నాను కదండి టైముందికదా అని!’’ ‘‘ఎక్కడిది టైము? రోజూ వచ్చినట్టే వచ్చిందికదా ఈరోజు కూడా? లేటవ్వలేదుగా?’’ ‘‘లేటవ్వలేదండి’’ ‘‘మరి?’’ ‘‘....’’ ‘‘మాట్లాడవే! అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావేంటి!’’ ‘‘అన్నం కలుపుతా’’ ‘‘అన్నం కలపడం ఏమిటి?’’ ‘‘పిల్లకి అన్నం కలపాలి కదా!’’ ‘‘ఔను, ఐతే?’’ ‘‘అన్నంలో పప్పు’’ ‘‘పప్పు ఉడకలేదా?’’ ‘‘అది కాదండి!’’ ‘‘మరేవిటి?’’ ‘‘కూర కలుపుదాం అనుకున్నాను.’’

‘‘కలిపావా?’’ ‘‘లేదండి!’’ ‘‘ఎందుకని?’’ ‘‘...’’ ‘‘మాట్లాడవేం?’’ ‘‘నిన్న మీరు తెస్తానన్నారు తేలేదు.’’ ‘‘ఏం తేలేదు?’’ ‘‘కంది పప్పు!’’ ‘‘సవాలక్ష సమస్యలతో నేను ఆఫీసులో ఏడుస్తా ఉంటే నీకు, నీ పిల్లకి పప్పు తేలేదన్నమాట. ఇప్పుడు పిల్ల వేలు నలగడానికి నేనే కారణం అంటున్నావా?’’ ‘‘అలా కాదండి. రోజూ దానికి పప్పు పెట్టమని మీరే కదా అన్నారు! పప్పు నిండుకుంది!  అందుకని కూర కలుపుదామనుకున్నాను’’ ‘‘కలపాల్సింది! ఎందుకని కలపలేదు?’’ ‘‘కూరలేదు.’’ ‘‘కొంపలో కూరలేదా, కూరల్లేవా?’’ ‘‘కూరలున్నాయండి, బంగాళదుంపల్లేవు!’’‘‘అదేంటి?’’ ‘’’పిల్ల బంగాళాదుంప ఫ్రై అయితేనే తింటోందండి!’’ ‘‘చెప్పవే, చెప్పు.

పప్పు తేలేదు.. బంగాళాదుంప తేలేదు.. ఇంకా?’’ ‘‘....’’ ‘‘ఫోనుందిగా? ఏ బిగ్‌ బాస్కెట్‌కో, అమెజాన్‌కో ఆర్డరివ్వొచ్చుగా’’ ‘‘మీరేగా ఎఫ్‌బిలో మునిగిపోతున్నానని వైఫై కనెక్షన్‌ పీకించేశారు! నా ఫోన్‌కి జీపీఆర్‌ఎస్‌ కూడా లేదు!’’ ‘‘మరి నన్ను చూడు, నా అందం చూడు, నా జడ చూడు, నా ఇది చూడు అని పోస్ట్‌లతో చంపేస్తున్నావ్‌గా! దానికి సొల్లుగాళ్ళంతా లైకులు, హార్టులూ! నాకెలాగుండాలే?’ ‘‘ఏదో టైంపాస్‌కి ఒక పోస్ట్‌ చేస్తే, దానికి ఇన్ని మాటలంటున్నారు!’’ ‘‘టైంపాస్‌ ఏమిటే? పెళ్ళి చేసుకున్నప్పుడే చెప్పా! వుద్యోగం చేసుకునే పిల్లొద్దు. నన్ను, నా పిల్లల్ని చూసుకునే పెళ్ళాం కావాలని! పిల్లని, నన్ను సరిగ్గా చూసుకుంటే నీకు ఇంకెక్కడిదే టైము? నీకు టైమెక్కువయికాదూ, ఈరోజు పిల్ల వేలు నలిగింది?’’ ‘‘అదేమి కాదు!  పచ్చ కామెర్లోడికి అంతా పచ్చగానే కనపడుతుందంట!’’

‘‘ఏమిటే కూసావ్‌?’’ ‘‘మీరు మీ కొలీగ్‌ అన్జెప్పి దాన్ని వాళ్లింటిదాకా రోజూ డ్రాప్‌ చెయ్యడం లేదా? పిల్లి పాలు తాగుతూ... లాగుంది! ఫ్లాట్‌లో పడి ఉంటాను కాబట్టి నాకు ఏం తెలీదనుకోకండి!’’ ‘‘నేను మగాడ్ని! నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా! నా ఇష్టం వచ్చినోళ్ళతో తిరుగుతా.....’’ ‘‘మాటలు జాగ్రత్తగా రానివ్వండి!’’ ‘‘ఏం చేస్తావ్‌? ఏం చేస్తావ్‌? చెప్పు!’’ ‘‘నేనెళ్ళిపోతా!’’ ‘‘ఎక్కడికి వెళ్ళిపోతావ్‌?’’ ‘‘మా ఇంటికి!’’ ‘‘ఇంటికా, కాలేజి లవ్వర్‌ దగ్గిరకా?’’ ‘‘ఎవడండి లవరు? నాకెవ్వరు లేరు!’’ ‘‘లవరూ లేక, ఎవరూ లేక ఎక్కడికెళ్తావే?’’ ‘‘మా పుట్టింటికి పోతా.’’ ‘‘వెళ్తే మళ్ళీ రావు ఈ ఇంటికి!’’ ’’ ఈ బెదిరింపులకే!’’ ‘‘అంటే ఇది వరకు రానిచ్చాననేనా?’’ ∙∙ ‘‘హలో! అవున్రా నేనే.

బావా అని పిలవకు! ఈ రాత్రి నీ చెల్లాయి నా ఇంట్లో గడపడానికి వీల్లేదు! వెంటనే దాన్ని తీసుకెళ్లిపో!’’ ‘‘...’’ ‘‘నేను వినను. బావా లేదు, గీవా లేదు. ఇదే ఆఖరు సారి! దానికి మొగుడంటే  అలుసైపోయింది. నే విన్ను! అంతే! ’’ ∙∙ ‘‘డాడీ... మమ్మీ...’’  ‘‘ఏరమ్మా, ఆయన?’’ ‘‘లోపల పడుకున్నారమ్మా!’’ ‘‘అదేంటి?’’ ‘‘రాత్రి ఫ్రెండ్స్‌ తీసుకొచ్చారింటికి ఆయన్ని!’’ ‘‘రాత్రంతా ఆయనింటికి రాలేదా?’’ ‘‘లేదు, నాన్నగారండి!’’ ‘‘అమ్మా. తాతీ!’’ ‘‘బుజ్జీ... డాడి, తాతి టాకింగ్‌! మనం బయటికి వెళ్ళి ఐస్‌క్రీం తిందాం, ఏం?’’ ‘‘ఏరా! అసలే మీ అక్క దానికి సరిగ్గా తిండిపెట్టడం లేదు! ఇప్పుడు నువ్వు దిగావ్‌! ఐస్‌క్రీం అంటూ! జలుబు చేస్తుంది! ఐస్‌క్రీంలూ చాక్లెట్లు వద్దు!’’ ‘‘అలాగే, బావగారండి.’’

‘‘ఈ నక్క వినయాలకేం గాని! దానికేమన్నా కొనిపెట్టావో చంపేస్తా!’’ ‘‘ఏదో అలసటతో ఆలస్యం అయిందంటండి! సరిగ్గా చూసుకోలేదు! కందిపప్పు జార్‌ నిండుకుంది! పిల్లేమో అన్నీ తినదాయే! మీరే కాస్త అల్లుడుగారికి నచ్చజెప్పండి!’’ ‘‘ఏమిటే నచ్చజెప్పడం! నువ్వు దాన్ని వెనకేసుకొచ్చావు ఇన్నాళ్ళు! ఇప్పుడు అది సంసారం చేసుకోవాలా వద్దా!  కాస్త ఇంగితం ఉండొద్దు! పెళ్ళైపోయింది. తన కుటుంబం.  మంచి, చెడూ చూసుకోవాలా, వద్దా?’’ ‘‘చిన్న పిల్లండి!’’ ‘‘చిన్న పిల్లేంటే! అయిదేళ్ళ పిల్లకి తల్లి! ఇంకా చిన్నపిల్లంటావ్‌! నువ్వు పెంచావుగా దాన్ని! నువ్వు తల్లివేగా? ఇదేనా మీ పెంపకం అని అడిగితే, నా తల ఎక్కడ పెట్టుకోను?’’ ‘‘అదేంటండి అలాగంటారు? మధ్యలో నేనేం చేశాను?’’ ‘‘నువ్వు దానికి కాస్త వంటా, వార్పు నేర్పుంటే బాగుండేది.’’

‘‘మీరేగా దాని జీవితం బాగోవాలంటే బాగా చదవాలని, చదివించారు! అది ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోనిచ్చారు.’’ ‘‘ఔనే, చదివించాను. వంట, గింటా నేర్పొద్దన్నానా?’’ ‘‘దానికి టైమెక్కడిదండి? టెంత్‌కి వచ్చినప్పట్నుంచి ట్యూషన్లు, స్పెషల్‌ క్లాసులు సరిపోయినవిగా! మీరేగా పాపం పిల్ల నలిగిపోతోందే, తరువాత చూద్దాం అని అన్నారు!’’ ‘‘ఔనే, అన్నాను. మరి కాలేజి రోజుల్లో ఏం చేసి తగలడ్డావ్‌?’’ ‘‘ఇప్పుడవన్నీ ఎందుకులేగాని, అల్లుడు గారు మట్టుకు అలా తిట్టొచ్చా? తప్పు కదండి!’’ ‘‘ఏం తప్పు? మనమ్మాయి చేసింది తప్పు.

ఇది మొదటిసారా? పదోసారో, పదిహేనో సారో! ఆయనకి మట్టుకు విసుగు పుట్టదా? ఎన్నోసారి మనకి ఫోను చెయ్యడం? మనం పరిగెత్తుకుంటూ రావడం? ఆయన చెబుతునే ఉన్నాడు! నన్నూ, పిల్లని చూసుకునే భార్య కావాలి, అది చాలని. ఒక అత్తగారు లేదు! ఒక మామగారు లేరు! మరదళ్ళు లేరు! మరుదులు లేరు! వాళ్ళ ఆరడిల్లేవు! ఇద్దరంటే ఇద్దరు! భార్య, భర్త, పిల్ల! జాగ్రత్తగా చూసుకోవద్దు?’’ ‘‘మొగుడూ, పెళ్ళాలన్న తరువాత ఏమీ ఉండకుండా ఎలా ఉంటాయండి?’’ ‘‘అయితే ఏం చెయ్యమంటావ్‌?’’ ‘‘కాస్త నెమ్మదిగా విడమరిచి చెప్పండి, అల్లుడిగారికి.   వింటారాయన.’’ ‘‘ఆ! వింటాడు, నేను విన్నానా?’’.
- అనిల్‌ అట్లూరి


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement