స్టడీ అబ్రాడ్‌: ఈ పొరపాట్లు లేకుంటే కల సాకారమే! | Study Abroad: Students Search for Universities, Scholarships, Fee Structure, Campus | Sakshi
Sakshi News home page

స్టడీ అబ్రాడ్‌: ఈ పొరపాట్లు లేకుంటే కల సాకారమే!

Published Fri, Apr 2 2021 7:32 PM | Last Updated on Fri, Apr 2 2021 7:41 PM

Study Abroad: Students Search for Universities, Scholarships, Fee Structure, Campus - Sakshi

దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల స్వప్నం.. స్టడీ అబ్రాడ్‌. ఈ కలను సాకారం చేసుకోవాలని ఎంతోమంది కష్టపడుతుంటారు. కానీ, విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా,సుదీర్ఘంగా ఉంటుంది. దాంతో విద్యార్థులు అప్లికేషన్‌ దశలోనే పొరపాట్లు చేస్తూ.. ఇబ్బందుల్లో పడుతున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో.. కాస్త అప్రమత్తంగా ఉంటే .. విదేశాల్లో చదువుకోవాలనే తమ కలను నిజం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్‌ పరంగా విద్యార్థులు చేస్తున్న పొరపాట్లు–వాటిని అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం..

రీసెర్చ్‌ లేదు
రీసెర్చ్‌ చేయకపోవడం.. ఇది స్టడీ అబ్రాడ్‌ అభ్యర్థులు చేస్తున్న తప్పిదాల్లో  ముందు వరుసలో ఉంది. చాలామంది అభ్యర్థులు దేశం, విశ్వవిద్యాలయం, కోర్సులు, ఆర్థిక ప్రో త్సాహకాలు(స్కాలర్‌షిప్స్‌), ఫీజులు, ప్రవేశ విధానాలు, క్యాంపస్, లొకేషన్, వాతావరణం, లివింగ్‌ కాస్ట్‌ వంటి అంశా లపై లోతుగా అధ్యయనంచేసి.. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. దాంతో వారి జాబితాలో కేవలం కొన్ని యూనివర్సిటీలు, కోర్సులు మాత్రమే ఉంటున్నాయి. ఫలితంగా స్టడీ అబ్రాడ్‌ కల క్లిష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సమస్త సమాచారం లభ్యమవుతోంది. అభ్యర్థులు సరైన రీసెర్చ్‌తో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. 

సరైన వ్యక్తికి సరైన ప్రశ్న!
విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ కనీసం ఒక అడ్మిషన్‌ కౌన్సెల ర్‌ను నియమిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అవస రమైన సలహాలు, సూచనలు, గైడెన్స్‌ అందించడం వీరి ప్రధాన విధిగా ఉంటుంది. కాబట్టి స్టడీ అబ్రాడ్‌ ఔత్సాహిక అభ్యర్థుల సందేహాల నివృత్తికి నేరుగా వర్సిటీని మెయిల్‌ ద్వారా సంప్రదించొచ్చు. తద్వారా సరైన వ్యక్తి నుంచి సరైన పరిష్కారాన్ని పొందవచ్చు. ఇలా చేయకుండా.. గూగుల్‌లో తోచింది బ్రౌజ్‌ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అంటున్నారు నిపుణులు.

ప్రణాళిక లేమి
భారత్‌లో మాదిరిగా విదేశీ యూనివర్సిటీలు, ఇన్‌స్టి ట్యూట్స్‌.. ఒకే సమయంలో ప్రవేశ ప్రక్రియను ప్రారం భించవు. ప్రతి వర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ తనదైన ప్రత్యేక అడ్మిషన్‌ షెడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అనేక ఇన్‌స్టి ట్యూట్‌లు ఏడాది పొడవునా దరఖాస్తులు ఆహ్వానిస్తే.. మరికొన్ని మూడు గడువుల్లోనే దరఖాస్తులు స్వీకరిస్తు న్నాయి. కాబట్టి అభ్యర్థులు అడ్మిషన్‌కు ఒక సంవత్సరం ముందుగానే మానసికంగా,డాక్యుమెంటేషన్‌ పరంగా సిద్ధం కావడం ప్రారంభించాలి. అడ్మిషన్‌ కౌన్సెలర్లు కేవలం విశ్వ విద్యాలయ అంశాల్లోనే అభ్యర్థులకు సహాయపడగలరు. వీసా సంబంధిత విషయాల్లో వారి నుంచి ఎలాంటి తో డ్పాటు అందదు. కాబట్టి వీసా ప్రక్రియను అభ్యర్థులు సొంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సహనం కోల్పోకుండా.. ఓపిగ్గా ఒక్కో అడుగు వేయాలి. 

సీటు దక్కితే చాలదు
స్టడీ అబ్రాడ్‌ పరంగా విద్యార్థులు విశ్వవిద్యాలయంలో సీటు దక్కితే చాలు..వీసా ప్రక్రియ పూర్తయితే సరిపోతుంది అనే కోణంలో ఆలోచిస్తుంటారు. కానీ, వీటితోపాటు సదరు దేశంలో, వర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత స్డూడెంట్‌ లైఫ్‌ ఎలా ఉండబోతుంది అనే కోణంలోనూ ఆలోచించాలి. తరగ తులు ప్రారంభమైన తర్వాత అందుబాటులో ఉండే ప్రత్యా మ్నాయాలు? డిగ్రీ చేతికొచ్చిన తర్వాత ఏం చేయాలను కుంటున్నారు? తదితర అంశాలపై స్పష్టతతో వ్యవహరిం చాలి. దీనికోసం ముందుగా ఇంటర్న్‌షిప్స్, ఫ్యాకల్టీ, మెంటార్స్, క్లబ్స్‌ వంటి విషయాల్లో తగిన రీసెర్చ్‌ చేయాలి. 

స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌(ఎస్‌ఓపీ)
విదేశీ విద్య దరఖాస్తు ప్రక్రియలో.. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌వోపీ) చాలా కీలకం. ఇందులో అభ్యర్థులు స్వీయ విజ యాలు, లక్ష్యాలను ప్రస్తావించాల్సి ఉంటుంది. అడ్మిషన్‌ ఆఫీసర్స్‌.. ఈ ఎస్‌వోపీ ఆధారంగా అభ్యర్థి యూనివర్సి టీలో ప్రవేశానికి అర్హుడా? కాదా?అనే విషయంపై ఒక నిర్ణ యానికి వస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన విజయాలతోపాటు ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో ప్రవేశం, స్పోర్ట్స్‌ వంటి వాటినీ ఎస్‌వోపీలో పేర్కొనాలి. వీటిని ప్రస్తావించే సమయంలో నిజాయితీగా వ్యవ హరించాలి. ఎస్‌వోపీ రూపకల్పనలో గొప్పలకు పోవడం మంచికాదు. అలాగే సాధించిన విజయాలను తక్కువ చేసుకోవడం చేయరాదు. ఉన్నది ఉన్నట్లు రాయాలి. 

ఫాల్, స్రింగ్‌.. ఏది బెటర్‌
విదేశీ యూనివర్సిటీలు ఫాల్‌ సెషన్,స్ప్రింగ్‌ సెషన్‌ పేరుతో ఏటా రెండుసార్లు అడ్మిషన్స్‌ కల్పిస్తాయి. కానీ, చాలా మంది విద్యార్థులకు ఏ సెషన్‌ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో పూర్తి స్పష్టత ఉండదు. ఈ రెండు సెషన్ల మధ్య తేడాల గురించి విద్యార్థులు తప్ప నిసరిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి ఈ రెండు సెషన్ల విషయంలో బోధన, కోర్సులు, ఇతర ప్రోత్సాహకాల పరంగా అనేక వ్యత్యాసాలు ఉంటాయి.

సెమిస్టర్‌ ప్రారంభం.. ఇలా
ప్రతి ఏటా ఫాల్‌ సెషన్‌ ఆగస్టులో, స్ప్రింగ్‌ సెషన్‌ జనవరిలో ప్రారంభమవుతుంది. వీటికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ సదరు సెషన్‌ ప్రారంభానికి ఆరు నెలల ముందుగానే మొదలవుతుంది. ఫాల్‌ సెషన్‌ అడ్మిషన్ల కోసం జనవరి నుంచి ఏప్రిల్‌ నెల వరకు; స్ప్రింగ్‌ సెషన్‌ అడ్మిషన్లకు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో యూనివర్సిటీలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. వీటికి అదనంగా మరికొన్ని విశ్వవిద్యాలయాలు రోలింగ్‌ అడ్మిషన్ల పేరిట ఏడాది పొడవునా దరఖాస్తు ప్రక్రియ చేపడుతుంటాయి.  వీటి సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు. 

‘ఫాల్‌’కే మొగ్గు
మన దేశం నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఫాల్‌ సెషన్‌ అడ్మిషన్లకు డిమాండ్‌ అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణం.. బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి కాగానే..ఎక్కువ కాలం వేచి ఉండకుండా.. విదేశీ వర్సిటీలో అడుగు పెట్టొచ్చు అనే ఆలోచనే. విదేశీ యూనివర్సిటీలు కూడా ఫాల్‌ సెషన్‌లోనే ఎక్కువ కోర్సులు, సీట్లను అందుబాటులో ఉంచు తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు వారు మెచ్చిన కోర్సులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఇతర ప్రయోజనాలు
వీటితోపాటు మరికొన్ని అంశాలు కూడా విద్యార్థులు ఫాల్‌ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కారణమవుతున్నాయి. వీటిలో ప్రధానంగా పేర్కొనాల్సింది.. యూనివర్సిటీలు అం దించే స్కాలర్‌షిప్స్‌(ఆర్థిక ప్రోత్సాహకాలు). ఫాల్‌ సెషన్‌కు ఇతర సెషన్స్‌తో పోల్చితే వర్సిటీలు స్కాలర్‌షిప్స్‌ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో అకడమిక్‌గా మంచి ప్రొఫైల్‌ ఉన్న విద్యార్థులకు ఫాల్‌ సెషన్‌లో స్కాలర్‌షిప్స్‌ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌
ఫాల్‌ సెషన్‌ విద్యార్థులకు కలిసొస్తున్న మరో అంశం.. టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌. అంటే.. ఒక కోర్సులో చేరిన విద్యార్థి ఆ కోర్సుకు సంబంధించి ప్రొఫెసర్ల వద్ద టీచింగ్‌ అసిస్టెం ట్‌గా సహకారం అందించడం. విద్యార్థులు అదనపు తరగ తులు, మూల్యాంకన, పరీక్షల ఇన్విజిలేషన్‌ తదితర అంశా ల్లో సహకారం అందించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధిలో ఉండే ఈ టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌ అవకాశాలు ఫాల్‌ సెషన్‌లో ఎక్కుగా లభిస్తాయి. కారణం.. ఫాల్‌ సెషన్‌లోనే ఎక్కువ ప్రవేశాలు కల్పించే విధానాన్ని యూనివర్సిటీలు అనుసరి స్తుండటమే. టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌ పొందే విషయంలో.. భారత విద్యార్థులు ఇతర దేశాల విద్యార్థులతో పోల్చితే ముందుంటున్నారు. భారత విద్యార్థుల్లో కష్టపడే తత్వం, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ ఎక్కువగా ఉండటంతో ప్రొఫెసర్లు సైతం మన విద్యార్థులను తమ అసిస్టెంట్స్‌గా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

స్ప్రింగ్‌ ఇలా
డిసెంబర్‌/జనవరిలో ప్రారంభమయ్యే స్ప్రింగ్‌ సెషన్‌లో.. ఫాల్‌ సెషన్‌తో పోల్చితే అందుబాటులో ఉండే కోర్సులు, ఇతర ప్రోత్సాహకాలు కొంచెం తక్కువ. అలాగని విద్యార్థులు స్ప్రింగ్‌ సెషన్‌లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని భావించాల్సిన పనిలేదు. బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత స్టడీ అబ్రాడ్‌ వైపు దృష్టిసారించే వారికి స్ప్రింగ్‌ సెషన్‌ అందుబాటులో ఉంటుంది. కొందరు విద్యార్థులు స్టాండర్ట్‌ టెస్ట్‌ స్కోర్లను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో.. ఆయా టెస్ట్‌లను మరోసారి రాద్దాం అనే వ్యూహంతో అడుగులు వేస్తూ ఫాల్‌ సెషన్‌కు దరఖాస్తు చేసుకోరు. ఇలాంటి విద్యార్థులకు స్ప్రింగ్‌ సెషన్‌లో సానుకూలతలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం సరైన ఆలోచన కాదు. ఫాల్, స్ప్రింగ్‌ సెషన్‌ ఏదైనా.. బెస్ట్‌ ర్యాంకింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు కృషి చేయాలి. ఫాల్‌ సెషన్‌లో తక్కువ ర్యాంకు ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం కంటే.. స్ప్రింగ్‌ సెషన్‌లో బెస్ట్‌ ర్యాంకింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం మేలని గుర్తించాలి. అంతేతప్ప.. స్కాలర్‌షిప్స్, టీచింగ్‌ అసిస్టెన్స్‌ అవకాశాలు తక్కువనే ఆలోచనతో స్ప్రింగ్‌ సెషన్‌ను విస్మరించరాదు. దరఖాస్తు చేసుకుంటున్న యూనివర్సిటీల్లో, ఆసక్తి గల కోర్సుకు స్ప్రింగ్‌ సెషన్‌ అడ్మిషన్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని స్ప్రింగ్‌ సెషన్‌ ఔత్సాహికులు పరిశీలించాలి. 

వ్యత్యాసాలు
ఫాల్‌ సెషన్‌: విద్యార్థుల నుంచి డిమాండ్‌ ఎక్కువ. అంతే స్థాయిలో అందించే కోర్సుల సంఖ్య కూడా ఎక్కువే.
► బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తవుతూనే అబ్రాడ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందాలనుకునే వారికి ఈ సెషన్‌ అనుకూలం.
► స్కాలర్‌షిప్స్, అందుబాటులోని కోర్సుల పరంగా మెరుగైన అవకాశాలు.
స్ప్రింగ్‌ సెషన్‌: తక్కువ డిమాండ్, తక్కువ సంఖ్యలో కోర్సులు. టెస్ట్‌ స్కోర్స్‌ ఉత్తమంగా ఉండి మరో ఏడాది వృథా చేయడం ఎందుకు అనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది.
► స్కాలర్‌షిప్స్‌ అవకాశాలు తక్కువగా ఉంటాయి.
► మొదటి సంవత్సరంలో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశం లేకపోవడం ప్రతికూలత.

ఇవెంతో కీలకం
► ఏ సెషన్‌ అయినా.. విద్యార్థులు కంట్రీ, కాలేజ్, కోర్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నచ్చిన కోర్సు కేవలం  ఒక సెషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటే ఆ సెషన్‌కే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ రెండు సెషన్స్‌లోనూ ఉంటే ప్రొఫైల్‌ను మరింత పటిష్టంగా దరఖాస్తు చేసుకుంటే.. స్కాలర్‌షిప్‌ దక్కే అవకాశాలు మెరుగవుతాయి. రెండో ప్రామాణికం ‘కాలేజ్‌’ను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం విద్యార్థులు బెస్ట్‌ కాలేజ్‌లో సీటు లభించాలంటే.. జీఆర్‌ఈ/ఐఈఎల్‌టీఎస్‌ / జీమ్యాట్‌ తదితర టెస్ట్‌ స్కోర్స్‌ అత్యంత మెరుగ్గా ఉండాలని భావిస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.. కాలేజ్‌లు కేవలం టెస్ట్‌ స్కోర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదు. అభ్యర్థుల ప్రొఫైల్‌కి  కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రొఫైల్‌ మెరుగ్గా ఉండేలా వ్యవహరించాలి. విద్యార్థులకు అత్యున్నత ఆయుధం స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌. ఈ ఎస్‌ఓపీని అత్యంత మెరుగైన రీతిలో తీర్చిదిద్దేలా కసరత్తు చేయాలి. 

► బెస్ట్‌ ర్యాంకింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌/కాలేజ్‌లు ఉన్న దేశాన్ని గమ్యంగా ఎంచుకోవాలి.  చేరాలనుకుంటున్న కోర్సులో అత్యుత్తమ బోధన అందించే కళాశాలలు ఉన్న దేశాలను అన్వేషించి.. వాటి నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫాల్‌ సెషన్‌లో అడ్మిషన్‌ లభించకపోయినా ఫర్వాలేదు.. బెస్ట్‌ కాలేజే లక్ష్యం అనుకొని స్ప్రింగ్‌ సెషన్‌ వైపు మొగ్గు చూపే విద్యార్థులు.. ఈ రెండు సెషన్ల దరఖాస్తు సమయానికి మధ్య ఉండే వ్యవధిని ప్రొఫైల్‌ను మెరుగుపరచుకోవ డానికి వినియోగించుకోవాలి. ఆన్‌లైన్‌ కోర్సులు అభ్యసించడం, రీసెర్చ్‌ ఓరియెంటెడ్‌ ప్రాజెక్ట్‌ వర్క్స్‌ చేయడం, టెక్నికల్‌ పేపర్స్‌ పబ్లిష్‌ చేయడం వంటి వాటికి సమయం కేటాయించాలి. 

స్టడీ అబ్రాడ్‌.. డాక్యుమెంట్స్‌
► అప్లికేషన్, కవరింగ్‌ లెటర్
► అప్లికేషన్‌ ఫీజు
► జీఆర్‌ఈ, టోఫెల్, జీమ్యాట్, ఐఈఎల్‌టీఎస్, ఎస్‌ఏటీ పరీక్షల్లో స్కోరు.
► స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌
► లెటర్‌ ఆఫ్‌ రికమండేషన్‌
► వ్యాసాలు ఠి అకడమిక్‌ సర్టిఫికెట్లు
► ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌
► పాస్‌పోర్ట్‌ ఠి స్పాన్సర్‌ లెటర్స్, స్పాన్సరర్స్‌ ఆదాయపు పన్ను స్టేట్‌మెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement