పరిశోధన పత్రాల ప్రచురణ ఫ్రీ!  | Research Scholars platform stage rubatosis publication | Sakshi
Sakshi News home page

పరిశోధన పత్రాల ప్రచురణ ఫ్రీ! 

Published Sat, Mar 30 2019 12:46 AM | Last Updated on Sat, Mar 30 2019 12:46 AM

Research Scholars platform stage rubatosis publication - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రీసెర్చ్‌ స్కాలర్స్‌ పరిశోధన పత్రాలను ప్రచురణ చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. విద్యార్థి దశలో అంత మొత్తం వెచ్చించడం కష్టమే! విద్యార్థిగా ఆ కష్టాలను అనుభవించారు కాబట్టే విష్ణువర్ధన్‌ రెడ్డి, సయ్యద్‌ సల్మాన్‌లు.. తమ లాగా ఇతర విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ఆలోచించారు. రూబటోసిస్‌ పబ్లికేషన్‌ పేరిట పరిశోధన పత్రాలను ఉచితంగా ప్రచురించే ఆన్‌లైన్‌ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరిన్ని వివరాలు ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా 2018లో రూబటోసిస్‌ ఇన్నోవేషన్‌ను ప్రారంభించాం. వైద్యు లు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్‌ స్కాలర్స్, ఫ్రొఫెసర్లు, స్టూడెంట్స్‌ ఎవరైనా సరే ఉచితంగా పరిశోధన పత్రాలు, సర్వే గుర్తింపులు, రివ్యూలు, ఆర్టికల్స్, కేస్‌ నివేదికలను ప్రచురణ చేసుకునే వీలు కల్పించడమే రూబటోసిస్‌ పబ్లికేషన్‌ ప్రత్యేకత. 

50 జర్నల్స్‌ ప్రచురణ.. 
మెడికల్, ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో 50 వరకు జర్నల్స్‌ పబ్లిష్‌ అయ్యాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బుక్‌ నంబర్‌ (ఐఎస్‌బీఎన్‌), ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సీరియల్‌ నంబర్‌ (ఐఎస్‌ఎస్‌ఎన్‌), క్రాస్‌రెఫ్‌ మెంబర్‌షిప్‌ అనుమతి పొందినవే. త్వరలోనే పబ్‌మెడ్, మెడ్‌లైన్, థామస్‌ రూటర్‌ అనుమతి కూడా తీసుకోనున్నాం. ప్రతి ఒక్క ప్రచురణ ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో పబ్లిష్‌ అవుతుంది గనక ఎప్పుడైనా, ఎక్కడైనా మన ఆర్టికల్స్‌ను చదువుకోవచ్చు, డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. 

రివ్యూ చేశాకే పబ్లిష్‌.. 
జర్నల్స్‌ పబ్లిష్‌ చేయబోయే ముందు నాణ్యత పరీక్షల నిమిత్తం 2 రకాలుగా రివ్యూలు చేపిస్తాం. ఒక్క జర్నల్‌ రివ్యూ కోసం 12–13 ప్రొఫెసర్లతో ఒప్పందం చేసుకున్నాం. టర్నిటిన్, ఐథెంటికేట్‌ సాఫ్ట్‌వేర్‌లతో కంటెంట్‌ను చెక్‌ చేస్తాం. దీంతో కంటెంట్‌ను కాపీ చేశారా? ఏ రచయిత నుంచి తీసుకున్నారు? వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి. త్వరలోనే అకౌంటింగ్, మానవ వనరులు, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, సర్జికల్స్‌ విభాగాల్లో మరొక 50 జర్నల్స్‌ను ప్రచురణ చేయనున్నాం. 

సమావేశాలతో ఆదాయం.. 
కంపెనీ ఆదాయ వనరుల కోసం లైవ్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుంటాం. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 2 సమావేశాలు నిర్వహించాం. నలుగురు వక్తలు, ఇద్దరు చైర్‌పర్సన్స్, 40 మంది డెలిగేట్స్‌ పాల్గొనే వేదికను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం రూ.50 వేలు చార్జీ చేస్తుంటాం. విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకొని అక్కడ కూడా కాన్ఫరెన్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది కాలంలో ఇండియాలో 10, విదేశాల్లో 10 సమావేశాలను లక్షి్యంచాం. ఒక్కదానికి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. 

రూ. 30 లక్షల సమీకరణ.. 
ఒక అంశానికి సంబంధించి అన్ని పాఠ్యాంశాలను సమగ్రంగా పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు పుస్తకాలను కూడా ప్రచురిస్తుంటాం. ఇప్పటివరకు ఫార్మాసూటికల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఓరల్‌ అండ్‌ మ్యాక్సోఫేసియల్‌ సర్జరీ, ఎక్స్‌పరిమెంటల్‌ సిన్‌ ఫార్మాసూటికల్‌ కెమిస్ట్రీ, డ్రగ్‌ డెలివరీ సిస్టమ్‌ పుస్తకాలను ప్రచురించాం. త్వరలోనే మరొక 10 పుస్తకాలు మార్కెట్లోకి రానున్నాయి. ప్రస్తుతం మా కంపెనీలో 42 మంది ఉద్యోగులున్నారు. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రూ.30 లక్షల నిధులను సమీకరించనున్నామని విష్ణు వర్ధన్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement