సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులకు కేంద్ర నిధులు అందడం లేదు. దీనికి సంబంధించి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్లుగా నిధుల విడుదలను నిలిపివేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపితేనే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది.
దీనితో గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సిన రూ.775 కోట్లు ఆగిపోయాయి. అంతేకాదు ఇలా నిలిచిన నిధులను తదుపరి ఏడాది ఇచ్చే (క్యారీ ఫార్వర్డ్) అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని.. అంటే భారమంతా రాష్ట్రంపై పడినట్టేనని అధికారులు చెప్తున్నారు. కేంద్ర నిధులు విడుదలకాక రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులను సర్దుబాటు చేయాల్సి రావడంతో విద్యార్థులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందంటున్నారు.
నేరుగా ఇచ్చేందుకే కేంద్రం పట్టు..
ఎస్సీవర్గాల వారికి నేరుగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మూడేళ్ల కింద నిబంధన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం అందించే సాయం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం కాకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్రం.. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
ఒకవేళ నిర్దేశిత ఫార్మాట్‌లో వివరాలను అందజేసినా.. ఉపకార వేతన దరఖాస్తులు స్వీకరించిన వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ఆ ఫార్మాట్‌లో వివరాల సమర్పణకు, ఇతర నిబంధనలకు రాష్ట్రం అంగీకరించకపోవడం, వివరాలు పంపకపోవడంతో కేంద్రం నిధుల విడుదలను ఆపేసింది. మూడేళ్లలో ఇప్పటివరకు రూ.775 కోట్లు ఇలా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థి ఖాతాలో జమచేస్తుండగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల ఖాతాలో జమ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పొంగులేటి కొత్త పార్టీ.. పేరు అదేనా?
Comments
Please login to add a commentAdd a comment