
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకారవేతన దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు ఒకే దరఖాస్తు పత్రాన్ని అందిస్తున్నారు. ఈ పత్రంలో విద్యార్థి పూర్తి వివరాలు ఈపాస్ వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తప్పులు దొర్లితే అధికారులు తిప్పి పంపడం, మళ్లీ విద్యార్థి వాటిని సవరించి పంపే ప్రక్రియలో అధిక సమయం పట్టేస్తుంది. దీంతో విద్యార్థులకు ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇకపై పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తు విధానాన్ని సులభతరం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఒక కోర్సుకు సంబంధించి ఒకేసారి వివరాలు ఎంట్రీ చేస్తే సరిపోయేలా... రెన్యూవల్ విషయంలో మార్కుల సమాచారం మినహా మిగతా వివరాలు తొలి దరఖాస్తుతో లింకు చేసేలా సాంకేతికతను యంత్రాంగం అభివృద్ధిచేస్తోంది.
సెట్‌లతో అనుసంధానం...
ఇంటర్మీడియెట్, జనరల్ డిగ్రీ మినహాయిస్తే మిగతా కోర్సుల్లో ప్రవేశాలకు సెట్(కామన్ ఎంట్రన్స్ టెస్ట్) తప్పనిసరి. ఈక్రమంలో సెట్‌కు దర ఖాస్తు చేసుకున్న వివరాలను ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు ఫారంలో ప్రత్యక్షమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. సెట్ వెబ్‌సైట్‌లతో ఈపాస్ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేసేలా ఎస్సీ అభివృద్ధిశాఖ చర్యలు చేపడుతోంది. సెట్ తాలూకు అంకెను ఈపాస్ వెబ్‌సైట్‌లో ప్రవేశపెడితే విద్యార్థి సమాచారమంతా ప్రత్యక్షమయ్యేలా రూపొ ందిస్తున్నారు. ప్రస్తుతం సెట్ రాసేందుకైనా, ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేశారు. ఆధార్ వివరాలతో పాటు సెట్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేస్తే ఈపాస్ దరఖాస్తు సులభతరం కానుందని భావిస్తున్న ప్రభుత్వం ఈమేరకు సీజీజీ అధికారులతో చర్యలు జరుపుతోంది.
సెప్టెంబరు నెలాఖరు వరకు స్వీకరణ
2018–19 సంవత్సరానికి సంబంధించి ఈపాస్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం రెన్యూవల్ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ ఏడాది పోస్టుగ్రా డ్యుయేషన్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల దరఖాస్తులు కొత్త పద్ధతిలో స్వీకరించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు వెబ్‌సైట్‌ను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment