AP: మన పొదుపు.. మేలి మలుపు | CM Jagan Govt Support To Womens With thrift society | Sakshi
Sakshi News home page

AP: మన పొదుపు.. మేలి మలుపు

Published Sun, Jul 31 2022 3:24 AM | Last Updated on Sun, Jul 31 2022 8:08 AM

CM Jagan Govt Support To Womens With thrift society - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిక్కచ్చిగా అమలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలనలోనే రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల విషయంలో అద్భుత ఫలితాలు రాబట్టారు. సంఘాల పొదుపు విషయంలో, క్రెడిట్‌ లింకేజీలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, సంఘాల పనితీరుపై నాబార్డు 2021–22 వార్షిక నివేదికను విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాల పొదుపు ఏపీలోనే ఉందని, ఈ విషయంలో ఏపీ పొదుపు సంఘాలు నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయని నివేదిక వెల్లడించింది.

అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో (2020–21) కూడా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల వల్లే, బాబు హయాంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాలు మళ్లీ ఇప్పుడు ఆర్థికంగా గాడిన పడటమే కాకుండా.. దేశంలోనే ఉత్తమ పనితీరును కనపరుస్తున్నాయి. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల పొదుపు సొమ్ము 2021–22 (మార్చి) ఆర్థిక ఏడాదిలో రూ.47,240.48 కోట్లు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లోని సంఘాల పొదుపు రూ.24,060.43 కోట్లు కాగా, మన రాష్ట్రంలోని సంఘాల పొదుపు రూ.11,668.22 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద మన సంఘాల పొదుపే 24.69 శాతం ఉండటం విశేషం. 
 
తగ్గిన పరపతి పెరిగింది.. 

► గత చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరపతి దిగజారిపోయింది. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన రుణ మాఫీ మాయ మాటలు నమ్మి మోసపోయారు. ఓట్లు వేయించుకుని, అధికారం చేపట్టగానే రుణ మాఫీ చేయబోనని చెప్పడంతో దగాకు గురయ్యారు. సంఘాల అప్పులు పెరిగి పోయి.. ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. దీంతో బ్యాంకులు రుణాల మంజూరుకు వెనకాడాయి. 
► 2019 ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట మేరకు.. ఎన్నికల తేదీ నాటికి ఉన్న అప్పులను నాలుగు విడతల్లో తిరిగి ఇస్తానని చెప్పడమే కాకుండా ఇప్పటికే ఆసరా పేరుతో రెండు విడతల్లో సగం అప్పులను తిరిగి సంఘాలకు ఇచ్చేశారు. బాబు ఎగనామం పెట్టిన సున్నా వడ్డీని సీఎం జగన్‌  పునరుద్దరించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి పెరిగింది.  

► చంద్రబాబు హయాంలో అంటే 2018–19లో ఏపీ పొదుపు సంఘాల క్రెడిట్‌ లింకేజీ కేవలం 43.6 శాతం ఉండింది. ఇప్పుడు ఏకంగా 90 శాతం క్రెడిట్‌ లింకేజీతో దేశంలోనే తొలి స్థానంలో మన పొదుపు సంఘాలు నిలిచాయి.  
► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏడాదికి పొదుపు సంఘాల క్రెడిట్‌ లింకేజీ పెరుగుతూనే ఉంది. 2019–20లో 61.9 శాతం, 2020–21లో 69.12 శాతం క్రెడిట్‌ లింకేజీ ఉంది. ఇప్పుడు ఏకంగా 90 శాతానికి చేరుకుని, దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 2021–22 ఆర్థిక ఏడాదిలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకులు రూ.28,497.51 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 

 
సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం 
► సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ (వడ్డీ లేని రుణాలు) రుణాలను అమలు చేస్తోందని నాబార్డు నివేదిక పేర్కొంది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీని రీయింబర్స్‌ చేస్తోందని తెలిపింది. దీంతో పొదుపు సంఘాలు బలోపేతం అవ్వడమే కాకుండా గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని స్పష్టం చేసింది.  
► సంఘాల్లోని మహిళల జీవనోపాధి మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని నివేదిక తెలిపింది. ఆసరా, చేయూత, ఇతర పథకాల కింద ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో వ్యాపారం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాల చేసుకోవడం ద్వారా ప్రభుత్వం వారికి చేదోడుగా నిలుస్తోంది.  
► రాష్ట్రంలో పొదుపు సంఘాల సగటు రుణం మంజూరు ఏటేటా పెరుగుతోంది. చంద్రబాబు హయాంలో సంఘాల సగటు రుణం రూ.3 లక్షల వరకు మాత్రమే ఉండింది. 2021–22లో అది రూ.4.80 లక్షలకు పెరిగింది.  
 
తగ్గిన నిరర్థక ఆస్తులు  
► చంద్రబాబు రుణ మాఫీ చేస్తానని మోసం చేయడంతో స్వయం సహాయక సంఘాలు అప్పట్లో అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా సంఘాల నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. ఇప్పుడు సంఘాల పనితీరు మెరుగు పరిచేలా గత మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి.  
► బాబు హయాంలో 5.86 శాతం మేర నిరర్థక ఆస్తులు ఉండగా, ఇప్పుడు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల రుణాల్లో నిరర్థక ఆస్తులు కేవలం 0.50 శాతమే ఉన్నాయి. కాగా, ప్రైవేట్‌ సెక్టార్‌లోని బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు 0.06 శాతమే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.  
  
కొత్తగా 27,432 సంఘాలు  
పొదుపు చేసే సంఘాల సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. 2020–21 ఆర్థిక ఏడాది నాటికి 10,58,053 పొదుపు సంఘాలు రూ.10,933.04 కోట్ల మేర పొదుపు చేశాయి. 2021–22 నాటికి 10,85,485 సంఘాలు రూ.11,668.22 కోట్లు పొదుపు చేశాయి. అంటే కొత్తగా 27,432 సంఘాలు వచ్చాయి.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement