చదువు'కొనే' టైమొచ్చింది..! | special story to thrift | Sakshi
Sakshi News home page

చదువు'కొనే' టైమొచ్చింది..!

Published Mon, Apr 30 2018 12:01 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

special story to thrift - Sakshi

స్వప్న 9వ తరగతి చదువుతోంది. ఆమె చదువుకు సంబంధించి తండ్రి రమేష్‌కు ఒక అంచనా ఉంది. ఏ తరగతికి వస్తే ఎంతవుతుందన్నది ముందే లెక్కలు వేసుకున్నాడు. దానికి తగ్గట్టే  రకరకాలుగా పొదుపు చేస్తున్నాడు. కాకపోతే ఉన్నట్టుండి రమేష్‌కు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయింది. హైదరాబాద్‌లో ఇంటికి దగ్గర్లో ఉన్న మంచి ప్రయివేటు స్కూల్లో చేర్పించడానికి వెళ్లాడు. ఆ ఫీజులు చూసి మతిపోయింది. తను వేసుకున్న బడ్జెట్‌ తలకిందులయిందని అర్థమైపోయింది. ఇక 9వ తరగతికే ఇలా ఉంటే... టెన్త్, ఇంటర్‌ సంగతో..? ఆ తరవాత ఒకవేళ ఫారిన్‌కు పంపి చదివించాలనుకుంటే అప్పటి పరిస్థితో..?

సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం: చదువంటే ఇపుడు మాటలు కాదు. ఈ పరిస్థితి రమేష్‌ ఒక్కడిదే కూడా కాదు. టౌన్‌ నుంచి సిటీలకు బదిలీ అయిన వారిది మాత్రమే కాదు కూడా. నానాటికీ విద్యా వ్యయాలు పెరుగుతుండటంతో మధ్య తరగతి అందరిదీ దాదాపుగా ఇదే పరిస్థితి. పిల్లల్ని అనుకున్న స్థాయిలో చదివించలేకపోతున్నారు కూడా. ఇక విదేశీ చదువుల సంగతి సరేసరి. కాబట్టి పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకునే వారికి నెలవారీ నామమాత్రపు పొదుపు, మదుపులతో లాభం లేదు. విద్యా రుణాలు ఉన్నప్పటికీ వీటిలో గరిష్ఠ పరిమితి అనేది ఉండనే ఉంది. అంతకుమించి చేసే వ్యయాలకు సొంతంగా నిధులు సర్దుబాటు చేసుకోవాల్సిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అవసరాలను పిల్లలు చిన్న వయసులో ఉండగానే గుర్తించాలి. అందుకు తగ్గ ప్రణాళిక వేసుకోవాలి. ఆ మేరకు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే ఖరీదైన విద్యను సొంతం చేసుకునే ఆర్థిక వనరులు సమకూరుతాయి. అందుకోసం ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం...

ఎంత మేర కావాలి?
పిల్లల చదువు కోసం ఎంత నిధి కావాలన్న కచ్చితమైన అంచనా కష్టమే. అయితే, ఇందుకో మార్గం ఉంది. ప్రస్తుతం ఫలానా విద్యకు ఎంత మేర ఖర్చవుతుందో తెలుసుకుని దాన్ని ద్రవ్యోల్బణం కాలిక్యులేటర్‌తో లెక్కించడమే. లేదా వీలైనన్ని వనరులను పక్కన పెట్టడం చేయాలి. ఉదాహరణకు మీ పాప లేదా బాబు వయసు రెండేళ్లు అనుకోండి. వీరికి 23 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకు డబ్బులు అవసరం అనుకుంటే... మాస్టర్స్‌ డిగ్రీకి ఇప్పుడు సగటున రూ.15 లక్షలు అయితే, వారు ఆ వయసుకు వచ్చే సరికి రూ.62 లక్షలు అవసరం అవుతాయి. 7 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా వేసిన లెక్క ఇది. అందుకే లక్ష్యానికి అవసరమైన మొత్తం ఎంతో ఓ అంచనాకు వస్తే దానికి తగినట్టు ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. 

ఎండోమెంట్‌ ప్లాన్లు కూడా...
ఎండోమెంట్‌ బీమా ప్లాన్లు మరో ఎంపిక. అయితే, ఇవి చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం రూపొందించినవి. పెట్టుబడి అవకాశంతో పాటు తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండేలా బీమా రక్షణనిస్తాయి. చిన్నారుల కోసం ఉద్దేశించిన పథకాలు అయినప్పటికీ వారికి ఇందులో బీమా ఉండదు. వారికి ఆధారమైన తల్లిదండ్రులకు ఇందులో బీమా ఉంటుంది. 

ప్రజాభవిష్యనిధి ఉండనే ఉంది...
15 ఏళ్ల కాలవ్యవధితో కూడిన పీపీఎఫ్‌ కూడా చక్కని సాధనమే. ఇందులో వార్షికంగా రూ.1,50,000 వరకూ పెట్టే పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఇందులో పెట్టుబడులకు, రాబడులకు కూడా పన్ను లేదు. 

వైవిధ్యం తప్పనిసరి...
పిల్లల విద్య కోసం ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలో నిర్ణయించుకున్న తర్వాత వివిధ సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత రిస్క్‌ ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. రాబడులు ఏ స్థాయిలో కోరుకుంటున్నారు..? ఎంత మేర రిస్క్‌ భరించగలరు? ఎంత కాలంలో ఎంత మేర సమకూరాలి? ఇత్యాది అంశాల ఆధారంగా వేటికి ఎంత మేర కేటాయింపులు అన్నవి ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీ పిల్లల ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ కోసం అయితే వివిధ కాల వ్యవధుల్లో గడువు తీరే విధంగా ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కాల వ్యవధిలో సరిపడేంత మొత్తం సమకూరాలంటే వచ్చే రాబడుల ఆధారంగా ప్రతి నెలా ఎంత ఇన్వెస్ట్‌ చేయాలన్నది నిర్ణయమవుతుంది. పక్కా ప్రణాళికతో భవిష్యత్‌ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన వచ్చు. 

మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచివే...
చిన్నారుల ఉన్నత విద్య కోసం చాలా వ్యవధి ఉంటుంది. అందుకోసం అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే పథకాలను ఎంచుకోవాలి. అవి మెరుగైన రాబడులను ఇస్తాయి. 15–20 ఏళ్ల కాలంలో మార్కెట్లలో ఆటుపోట్లను ఎదుర్కొని మరీ మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు ఉంది. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం ఒక మార్గం. సిప్‌ ద్వారా 5–7 ఏళ్ల కాలంలో మోస్తరు రాబడులకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయా పథకాల్లోని పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా రిస్క్‌ తగ్గించుకోవడంతోపాటు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వీలుంటుంది. అయితే తాజాగా అమల్లోకి వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను పరిగణనలోకి తీసుకోవాలి. 

సుకన్య సమృద్ధి యోజన
ఒకరిద్దరు కుమార్తెలున్నవారు వారి వయసు గనక 10 ఏళ్లలోపు ఉంటే ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈక్విటీతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ పథకమిది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కాంపౌండింగ్‌ ప్రయోజనంతో కుమార్తె ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఏటా కనీసం రూ.1,000 గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఏడాదిలో ఎన్ని సార్లయినా ఈ పరిమితికి లోబడి డిపాజిట్లు చేయొచ్చు. ప్రతి నెలా 10వ తేదీలోపు డిపాజిట్‌ చేస్తే దానిపై ఆ నెలకు వడ్డీ లభిస్తుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు చిన్నారుల పేరిటే ఖాతాలు తెరవగలం. దత్తత తీసుకున్న కుమార్తెలయినా పర్వాలేదు. ఖాతా తెరిచాక 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలి. గరిష్ఠంగా ఖాతా తెరిచాక 21 ఏళ్ల పాటు లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండి వివాహం అయ్యేంతవరకు ఖాతా మనుగడలో ఉంటుంది. 18 ఏళ్లు నిండినా లేక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఆ అవసరాల కోసం అప్పటి ఖాతా విలువలో 50 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అర్హత అవుతుంది. ఈ పథకంలో ప్రారంభంలో 9.2 శాతం వడ్డీ రేటు ఉండగా ప్రస్తుతం 8.1 శాతానికి తగ్గింది. అయినప్పటికీ బ్యాంకు వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువే. ప్రతీ త్రైమాసికానికీ ఈ పథకంపై వడ్డీరేటును కేంద్రం సమీక్షిస్తుంటుంది. బాలికల బంగారు భవిత దృష్ట్యా వారి పేరిట పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మిగిలిన పథకాల కంటే దీన్లో కొంచెం అధిక వడ్డీ రేటును కొనసాగించాలన్నది కేంద్రం విధానం. ఇక ఈ పథకంలో చేసే పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలూ ఉన్నాయి. ఏటా రూ.1.5 లక్షల పెట్టుబడులకు సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. పెట్టుబడులపై వచ్చే వడ్డీకి, కాల వ్యవధి తీరాక చేతికందే మొత్తానికి పన్ను లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement