ధూమపానం అలవాటు లేని వారిలోనూ వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్
పరిశ్రమలు, వాహనాల వినియోగంతో పెరిగిన వాయుకాలుష్యం
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దశాబ్దం ముందుగానే భారత్‌లో దీని ప్రభావం
1990లో 6.62 శాతం.. 2019 నాటికి 7.7 శాతానికి పెరుగుదల
ముంబై టాటా మెమోరియల్ ఆస్పత్రి అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: మానవ మనుగడకు ఆధారమైన వాయువు పరుగులు పెడుతున్న ప్రస్తుత పారిశ్రామిక యుగంలో స్వచ్ఛతను కోల్పోతోంది. ఆయుష్షును పెంచాల్సిన స్థితి నుంచి ఆయువు తీసే దశకు చేరింది. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ధూమపానమే ఇందుకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. కానీ జీవితంలో ఎన్నడూ ధూమపానం చేయని వ్యక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో దీని బారిన పడుతున్నారని, దీనికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన నిపుణులు, పరిశోధకులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై చేపట్టిన అధ్యయనాన్ని ఇటీవల లాన్సెట్ ఈ–క్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. ఆ అధ్యయనం ప్రకారం పాశ్యాత్య దేశాల కంటే పదేళ్ల ముందే భారత్‌లో ధూమపానం అలవాటు లేని వారిపై ఈ జబ్బు ప్రభావం చూపుతోంది. ఏపీలో ఏటా 70 వేలకు పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి.
2025 నాటికి గణనీయంగా పెరుగుదల
దేశంలో వ్యాధి సంభవించే రేటు 1990లో ఒక లక్ష జనాభాకు 6.62 శాతం ఉండగా 2019 నాటికి 7.7 శాతానికి చేరింది. 2025 నాటికి పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా ఈ వ్యాధి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు ప్రజల జీవనం వాయుకాలుష్య కారకాల మధ్యే సాగడంతో దేశంలో కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.
కాలుష్య దేశంగా భారత్
అధ్యయనంలో వైద్య నిపుణులు 2022లో ప్రపంచ వాయు నాణ్యత నివేదికను ఉటంకించారు.
⇒ ఈ నివేదిక ప్రకారం క్యూబిక్ మీటర్‌కు సగటున 53.3 మైక్రోగ్రాముల పీఎం 2.5 సాంద్రతతో భారత్ ఎనిమిదో అత్యంత వాయు కాలుష్య దేశంగా నిలిచింది.
⇒ 2023లో మూడవ అత్యంత వాయు కాలుష్య దేశంగా ఆవిర్భవించింది.
⇒ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 భారత్‌లోనే ఉన్నట్లు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో స్పష్టం చేసింది.
ఇంటా, బయట జాగ్రత్తలు పాటించాలి
ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాల్లో కాలుష్యం ఒకటి. పొల్యూషన్‌ను ఇండోర్, అవుట్‌డోర్ అని రెండు విధాలుగా పరిగణించాలి. అవుట్ డోర్ పొల్యూషన్‌కు ఎక్కువగా పురుషులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాహనాల నుంచి వెలువడే డీజిల్, పెట్రోల్ అన్‌బార్న్ ఉద్గారాలు గాలిలో కలుస్తుంటాయి, వీటితో పాటు సల్ఫర్ డయాక్సైడ్, ఇతర ఉద్గారాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుంచి వెలువడే దుమ్ము, ధూళి గాలిలో ఉంటాయి. వీటిని పీల్చడం ఆరోగ్యానికి హానికరం.
ప్రస్తుత రోజుల్లో వాహనాల రద్దీ బాగా పెరిగింది. జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు, ఇతర కారణాలతో ఎక్కువ సేపు నిల్చోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో మాస్క్ వాడటం తప్పనిసరి. అదే విధంగా వీలైనంత వరకూ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇక ఇంట్లో వంటింటి నుంచి వెలువడే పొగ నుంచి మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వంటింటిలోకి గాలీ, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా ఎయిర్ ఎక్స్‌ట్రాక్టర్‌లను అమర్చుకోవడం ఉత్తమం.
– డాక్టర్ రఘు, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment