బెదరక, చెదరక క్యాన్సర్‌ను జయించిన సినీ స్టార్స్‌ | This Movie Actress Against Fight With Cancer | Sakshi
Sakshi News home page

బెదరక, చెదరక క్యాన్సర్‌ను జయించిన సినీ స్టార్స్‌

Feb 4 2025 11:58 AM | Updated on Feb 4 2025 1:21 PM

This Movie Actress Against Fight With Cancer

నేడు వరల్డ్‌ క్యాన్సర్‌ డే

క్యాన్సర్‌ను జయించాలంటే అంత సులువు కాదని చెబుతారు.. కానీ, వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు  కుటుంబం, స్నేహితుల సపోర్ట్‌ ఆపై సరైన వైద్యం ఉంటే తప్పకుండా క్యాన్సర్‌పై విజయం సాధిస్తారు. సినిమా ప్రపంచంలో ఎందరో ఈ జబ్బు బారిన పడిన నటీనటులు పెద్ద పోరాటమే చేసి గెలుపొందారు.  వారు ఉండేది గ్లామర్‌ ఫీల్డ్‌ అయినా.. దాచకుండా తమ పోరాటాన్ని ప్రపంచానికి తెలియచేశారు. వైద్యం చాలా ఆధునికం అయ్యింది. భయం లేదు. గెలుపు ఉంది. క్యాన్సర్‌పై పోరాడాలి. గెలవాలి అంటూ చాలామంది పిలుపునిచ్చారు.

సోనాలి బెంద్రె
‘మనం అస్సలు ఊహించని విషయాలతో జీవితం మన మీద ఒక మలుపును విసురుతుంది’ అని నటి సోనాలి బెంద్రె 2018లో ట్విటర్‌లో రాసింది. అప్పటికే ఆమెకు ‘హైగ్రేడ్‌ క్యాన్సర్‌’ బయటపడింది. ఆమెకు క్యాన్సర్ ఉందన్న విషయం అనుకోకుండా బయటపడింది. తరచుగా పొత్తికడుపులో నొప్పి రావడం, కడుపులో ఇబ్బందిగా ఉండటంతో సొనాలీ బింద్రే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో క్యాన్సర్‌ అని తేలింది. 

అయితే, వెంటనే తన కుటుంబం, మిత్రులు బిలబిలమంటూ  ఏడుస్తూనే తన పక్కన చేరారని ఆమె పేర్కొంది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటంతో డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెడదామని చెప్పడంతో ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంది. తాను ఇప్పుడు క్యాన్సర్‌ను జయించి మళ్లీ సినిమాల్లో బిజీగా ఉంది. క్యాన్సర్‌ బారిన పడినవారు  ఆధునిక పద్ధతులు వాడుకునేందుకు వీలుగా ధైర్యంగా ఉండటంతో పాటు కుంగిపోకుండా చాలా బలంతో పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

కిరణ్‌ ఖేర్‌
2021 ఏప్రిల్‌లో నటి కిరణ్‌ ఖేర్‌ బ్లడ్‌ క్యాన్సర్‌ బారిన పడింది. కాని ఆమె భయపడలేదు. క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి ట్రీట్‌మెంట్‌కు సహకరించాలనుకుంది. భర్త అనుపమ్‌ ఖేర్‌ ‘ఆమెకు ఏమీ కాదు. ఆమె ఆరోగ్యం పొందుతుంది’ అని ధైర్యం చెప్పాడు. ముంబైలో కిరణ్‌ ఖేర్‌కు వైద్యం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆమె తాను పాల్గొంటున్న ఒక టీవీ షోలో జడ్జ్‌గా తిరిగి వచ్చి కూచుని క్యాన్సర్‌ దారి క్యాన్సర్‌దే మన పని మన పనే అన్నట్టుగా స్ఫూర్తినిస్తోంది. ఆమె ఇప్పటికీ చికిత్స పొందుతూనే తనపని తాను చేసుకుంటుంది.

 నఫీసా అలీ
మరో సీనియర్‌ నటి నఫీసా అలీ కూడా చర్మ సంబంధ క్యాన్సర్‌ బారిన పడ్డారు. అయినప్పటికీ ఆమె కుంగిపోక పోరాడింది. కీమో థెరపీ తీసుకుని ఆమె క్యాన్సర్‌ను జయించింది. కీమో థెరపీ చేయించుకుంటూ నవ్వుతూ ఉన్న ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో పెట్టింది. అలాగే శిరోజాలను ముండనం చేసుకున్న ఫొటో కూడా. ఇవన్నీ క్యాన్సర్‌ను అన్ని జబ్బుల్లాగే చూడటానికి స్ఫూర్తినిస్తున్నాయి.

మనిషా కోయిరాలా
ఇక మనిషా కోయిరాలా 2012లో ఒవేరియన్‌ క్యాన్సర్‌ బారిన పడటం పెద్ద సంచలనం అయ్యింది. అభిమానులు తీవ్ర నిరాశలో పడ్డారు. ఆమె కూడా ఇది తనకు అశనిపాతంగా భావించింది. అయినప్పటికీ క్యాన్సర్‌ మీద పోరాడి గెలవాలని నిశ్చయించుకుందామె. న్యూయార్క్‌లో ఉండి వైద్యం తీసుకుంది. సుదీర్ఘకాలం వైద్యం కొనసాగినా బెదరక, చెదరక క్యాన్సర్‌ను జయించింది. తిరిగి సినిమాల్లో నటిస్తూ ఉంది కూడా.

ముంతాజ్‌ 
ఒకప్పటి స్టార్‌ నటి, ‘ఆప్‌ కీ కసమ్‌’, ‘ఆయినా’ సినిమాల హీరోయిన్‌ ముంతాజ్‌ తన 54వ ఏట 2000 సంవత్సరంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడింది. ‘చావు కూడా నన్ను సులువుగా ఓడించలేదు. క్యాన్సర్‌ ఎంత..’ అనే స్ఫూర్తితో పోరాడి గెలిచింది. ఇప్పుడు ఆమె వయసు 74. హాయిగా ఉంది.

హంసా నందిని
మన తెలుగు నటి హంసా నందిని కూడా  క్యాన్సర్‌పై గట్టి పోరాటం చేసి గెలిచింది. 2021లో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిని ఆమె 16 సార్లు కీమోథెరఫి చేయించుకుంది. మిర్చి, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసి ఆందరికీ హంసానందిని చేరువైంది. అయితే, తన చిన్నతనంలోనే ఆమె అమ్మగారు క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆ భయాన్ని కూడా లెక్కచేయకుండా ఆమె పెద్ద పోరాటమే చేసింది.

గౌతమి 
35 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ బారిన పడిన నటి గౌతమి కూడా దాన్ని జయించింది. ప్రస్తుతం ఇదే మహమ్మారిపై ఆమె అనేక కార్యక్రమాలతో మహిళలకు అవగాహన కల్పిస్తుంది. అందుకోసం ‘Life Again Foundation (LAF)’ అనే సంస్థను కూడా ఆమె ఏర్పాటుచేసింది. మొదట రొమ్ములో కణితిని గుర్తించి దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలవడంతో.. అది రొమ్ము క్యాన్సర్‌ అని తేలిందని ఆమె తెలిపింది. క్యాన్సర్‌ వల్ల కొన్నేళ్ల పాటు గడ్డు జీవితాన్ని అనుభవించానని ఆమె గుర్తు చేసుకుంది. అయితే, లంపెక్టమీ, కీమోథెరపీ చికిత్సలతో పాటు  ధైర్యం, ఓపిక, ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగానని చెప్పింది. ఫైనల్‌గా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానని ఆమె తెలిపింది.

మమతా మోహన్‌ దాస్‌
యమదొంగ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ భామ మమతా మోహన్‌ దాస్‌..  ఆమె క్యాన్సర్ బారిన పడి.. ఆ‌ మహమ్మారిని జయించడంతో పాటు మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే క్యాన్సర్‌ వ్యాధిని జయించడం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సమయంలో అవగాహన ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. ఆ సమయంలో తాను కేవలం తల్లిదండ్రుల ఆదరాభిమానాలను మాత్రమే ఆశించానని చెప్పారు. క్యాన్సర్‌ వ్యాధిని జయించే వరకు కేరళ దరిదాపుల్లోకి కూడా రాలేదని గుర్తుచేసుకున్నారు. అయితే, ఈ వ్యాధి నుంచి బయటపడ్డ అంతకుముందు రూపం మళ్లీ రాదని ఆమే పేర్కొన్నారు. పోరాడుతే తప్పకుండా పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తామనే నమ్మకాన్ని గుర్తు పెట్టుకోవలని సూచించారు. ఇలా క్యాన్సర్‌పై పోరాడి గెలిచిన వారిలో  బాలీవుడ్‌ హీరో సంజయ్ దత్,అనురాగ్ బసు ,తాహిరా కశ్యప్ కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement