సిద్ధూకి రూ. 850 కోట్ల లీగల్ నోటీసు
మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్‌కి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి భారీ షాక్ తగిలింది. అల్లోపతి మందులు లేకుండానే తన భార్య 4వ దశ క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకుందన్న వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారం రోజుల్లోగా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లీగల్ నోటీసులిచ్చింది. లేనిపక్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులిచ్చింది. అంతేకాదు సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని కోరింది.
డైట్ కంట్రోల్ వల్ల తన భార్య నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందంటూ సిద్ధూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ, నిమ్మరసం, పచ్చిపసుపు, వేప, తులసి లాంటి పదార్థాలతో కేవలం 40 రోజుల్లోనే తన భార్య వైద్యపరంగా క్యాన్సర్‌ను జయించిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా దీనిపై సివిల్ సొసైటీ తీవ్రంగా మండిపడింది. సిద్ధూ వాదనలు సందేహాస్పదమైనవి, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఇది క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్రమాదకరంగా మారుతుందని సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా పలువురు వైద్య నిపుణులు, ఆంకాలజిస్టులు కూడా సిద్ధూ వ్యాఖ్యల్ని ఖండించారు. సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. కేవలం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ డైట్ ప్లాన్‌ను వైద్యులతో సంప్రదించి అమలు చేశామని ,"చికిత్సలో సులభతరం"గా పరిగణించాలని సోమవారం తెలిపాడు. మరి తాజా నోటీసులపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
Comments
Please login to add a commentAdd a comment