అందులో హానికారక బ్యాక్టీరియాలు గుర్తింపు
ఇటీవల బొంబై మిఠాయి, గోబీ, చికెన్ పకోడాపై ఆంక్షలు
శివాజీనగర: ఆరోగ్యానికి హానికరమంటూ రాష్ట్రంలో రంగులు వాడి చేసే గోబి మంచూరియా, బొంబై మిఠాయి, చికెన్ కబాబ్‌లను సర్కారు నిషేధించడం తెలిసిందే. పానీపూరిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని, త్వరలో చర్యలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ జాబితాలో అరబ్ దేశాల వంటకమైన చికెన్ షావర్మా కూడా చేరనుంది. ఆహార భద్రత, వైద్య అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన పలు షావర్మా నమూనాలలో అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియా, ఈస్ట్‌లు బయటపడ్డాయి. కాబట్టి వాటి విక్రయాలను నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
17 నమూనాలను పరీక్షించగా
కొంతకాలంగా బెంగళూరు, మంగళూరు వంటి నగరాలలో షావర్మా షాపులు వెలిశాయి. చికెన్‌ను పెద్ద గోపురం మాదిరిగా ఏర్పాటు చేసి వేడి చేసి ముక్కలుగా కత్తిరించి, చపాతీలో చుట్టి ఇస్తారు. దీనిని సేవించి అస్వస్థతకు గురైన కేసులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్లలో శాంపిల్స్‌ను సేకరించగా, 8 శాంపిల్స్‌లో బ్యాక్టీరియా, ఈస్ట్‌లు బయటపడ్డాయి. దీంతో షావర్మా అసురక్షితం అని నిర్ధారించారు.
ఆహారాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచితే బ్యాక్టీరియాలు, ఈస్ట్‌లు ఏర్పడతాయి. కేరళలో షావర్మా తిని పలువురు చనిపోయారు కూడా. షావర్మ వ్యాపారులు తప్పనిసరిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో నమోదు చేసుకోవాలని నిబంధన ఉంది. షాపులో ఆ రిజిస్ట్రేషన్ పత్రం పెట్టకపోతే అమ్మకాన్ని బ్యాన్ చేస్తామని హెచ్చరించినట్లు ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment