యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే..? | Antioxidant Rich Foods For Glowing Skin And Prevent Cancer | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్‌గా కనింపించేలా చేసే యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే..? వేటిలో ఉంటాయంటే..!

Published Tue, Oct 1 2024 10:40 AM | Last Updated on Tue, Oct 1 2024 11:24 AM

Antioxidant Rich Foods For Glowing Skin And Prevent Cancer

వయసు పెరగడమన్నది అందరిలోనూ చాలా సహజంగా జరిగిపోతుంటుంది.  చాలాకాలం పాటు యూత్‌ఫుల్‌గా కనిపించడం అందరూ కోరుకునేదే. అంతేగానీ... వయసు పెరగాలని ఎవరూ కోరుకోరు. కొందరు వయసుపరంగా చాలా పెద్దవారైనా... చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తారు. వయసు చెప్పగానే ఆశ్చర్యపోయేంత యౌవనంతో ఉంటారు. ఇలా వయసు తగ్గి యౌవ్వనంతో కనిపించడంతో పాటు, కేన్సర్‌ను కూడా నివారించే ఆహారాన్ని కాదనుకునేవారెవరు? అలా వయసు తక్కువగా ఉన్నట్లు కనిపించేలా చేయడంతోపాటు కేన్సర్‌ను నివారించే పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే ఏమిటి,  వాటితో ఉండే ఇతర ప్రయోజనాలేమిటి అనే విషయాలను తెలుసుకుందాం. వ

యసు పెరగడంతో శారీరకంగా కొన్ని మార్పులు వస్తాయి. ఉదాహరణకు చర్మం కాస్త వదులైపోడం, కళ్ల కింద, నుదుటి మీద గీతల వంటివి. ఇలా వచ్చే మార్పులనే ఏజింగ్‌తో వచ్చే మార్పులంటారు. కొన్ని రకాల ఆహారాలతో ఈ ఏజింగ్‌ ప్రక్రియ వేగవంతవుతుంది.

ఉదాహరణకు ఎక్కువ తీపి ఉండే పదార్థాలూ, బేకరీ ఐటమ్స్‌ వంటి జంక్‌ఫుడ్‌ తీసుకునేవారిలో ఏజింగ్‌ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ఏజింగ్‌కూ, అలాగే  కొందరిలో కేన్సర్‌కు దారితీసే ఫ్రీ–ర్యాడికల్స్‌ అనే పదార్థాలు కారణం. ఈ ఫ్రీ–ర్యాడికల్స్‌ను సమర్థంగా అరికట్టేవే యాంటీఆక్సిడెంట్స్‌. దేహంలో ప్రతినిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. 

ఇవి జరిగేటప్పుడు కొన్ని  కాలుష్య పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీరాడికల్స్‌ అంటారు. అవి కణాలను దెబ్బతీస్తాయి. ఫ్రీ–రాడికల్స్‌ అన్నవి దేహంలోని ఏ కణంపై ప్రభావం చూపితే ఆ కణం జీవిత కాలం తగ్గిపోతుంది. ఆ కణం కూడా గణనీయంగా దెబ్బతింటుంది.

యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే...? 
ఆహారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్‌తో చర్య జరిపి, కణాలపై వాటి ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేవే యాంటీ ఆక్సిడెంట్స్‌. రసాయన పరిభాషలో చెప్పాలంటే ఫ్రీ–ర్యాడికల్స్‌లో ఉండే పదార్థాలు కణాల్లోని రసాయనాలతో ఆక్సిడేషన్‌ చర్య జరపడం ద్వారా కణాన్ని దెబ్బతీస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ అనేవి ఆ ఫ్రీ–ర్యాడికల్స్‌ను అడ్డుకుని ఆహారంలో ఉండే కొన్ని పోషకాలు ఆక్సిడేషన్‌ కానివ్వకుండా ఆపుతాయి. అలా ఫ్రీర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. 

అంటే ర్యాడికల్స్‌ ద్వారా జరిగే ఆక్సిడేషన్‌ను తటస్థీకరణ (న్యూట్రలైజ్‌) చేస్తాయి. అందువల్ల ఫ్రీ–రాడికల్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆగిపోతాయి. దాంతో  ఫ్రీ–రాడికల్స్‌ కణాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదు. మామూలు కణం  కేన్సర్‌ కణంగా మారడమూ ఆగిపోతుంది. అలా ఫ్రీ–రాడికల్స్‌ కారణంగా కణంలో ఆక్సీకరణ జరగకుండా ఆపేస్తాయి కాబట్టే ఆహార పదార్థాల్లోని ఆ పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’ అంటారు.

యాంటీ ఆక్సిడెంట్స్‌తో లాభాలివి.. 

  • యాంటీ ఆక్సిడెంట్స్‌ అనేవి జీవక్రియల  ద్వారా కణంలో జరిగే విధ్వంసాన్ని (సెల్‌ డ్యామేజీని) ఆపేస్తాయి. సెల్‌ డ్యామేజ్‌ తగ్గడం వల్ల కణం చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సెల్‌ డ్యామేజీలు కాలుష్యం వల్ల, పొగతాగడం, అత్యధిక శారీరక శ్రమ, అల్ట్రావయొలెట్‌ కాంతి  వల్ల జరుగుతుంటాయి. ఫలితంగా చర్మం ముడుతలు పడటం వంటి వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. యాంటీఆక్సిడెంట్స్‌ ఫ్రీ–ర్యాడికల్‌ వల్ల జరిగే అనర్థాలను నిరోధించడం వల్ల ఈ దుష్పరిణామాలన్నీ ఆగుతాయి లేదా తగ్గుతాయి. దాంతో చాలా కాలం పాటు వయసు పెరిగినట్లుగానే కనిపించదు. దాంతో చాలాకాలంపాటు యౌవనంగా కనిపిస్తారు. 

  • ఫ్రీ–రాడికల్స్‌ ఒక్కోసారి కణంలోని స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తాయి. అప్పుడా మామూలు కణం కాస్తా... కేన్సర్‌ కణంగా మారిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. 
    పోషకాల్లోని రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్‌... వాటితో  ప్రయోజనాలు

  • బీటా–కెరోటిన్‌ అనే పోషకానికి యాంటీఆక్సిడెంట్‌ గుణం ఉంటుంది. ఇవి పసుప్పచ్చ, నారింజరంగులో ఉండే అన్ని పండ్లు, కూరగాయల్లో, ఆకుకూరల్లో బీటా కెరొటిన్‌ ఉంటుంది. ఇవి మన శరీరంలోని కణాల్లోని పైపొర (సెల్‌ మెంబ్రేన్‌)ను సురక్షితంగా కాపాడతాయి. దాంతో ఆ పొరను ఛేదించి ఏ హానికరమైన కాలుష్యాలూ కణంలోకి చేరలేవు. అందుకే పైన పేర్కొన్న రంగు పండ్లు తింటే క్యాన్సర్‌ నుంచి రక్షణతో పాటు కణం చాలాకాలం పాటు ఆరోగ్యంగా, యౌవనంతో ఉంటుంది. 

  • లైకోపిన్‌ అనే ఫైటో కెమికల్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఎరుపు రంగు పిగ్మెంట్‌ ఉండే ఆహారాల్లో లైకోపిన్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే టొమాటోలో ఇది మరీ ఎక్కువ. పుచ్చకాయలోనూ ఎక్కువే. లైకోపిన్‌  జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటమేగాక... పెద్దపేగు కేన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్‌ కేన్సర్‌ల నివారణకు తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్‌ కేన్సర్‌ను నివారించడంలో లైకోపిన్‌ చాలా సమర్థంగా పనిచేస్తుంది. 

  • అల్లిసిన్‌ అనే చాలా శక్తిమంతమైన ఫైటో కెమికల్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లిసిన్‌ రక్తంలోని కొలెస్టరాల్‌నూ తగ్గిస్తుంది. ఇది వెల్లుల్లి, ఉల్లిలో ఎక్కువగా ఉంటుంది.

  • ఐసోథయనేట్స్, ఐసోఫ్లేవోన్స్‌ యాంటీ ఆక్సిడెంట్లు సోయా ఉత్పాదనల్లో, క్యాబేజీ, కాలిఫ్లవర్‌లలో పుష్కలంగా ఉంటాయి. అవి అనేక రకాల కేన్సర్‌ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. 

  • యాంథోసయనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌ ద్రాక్షలో, బెర్రీ పండ్లలో  ఎక్కువ. గుండె జబ్బులను యాంథోసయనిన్‌ నివారిస్తుంది. 

  • ఫ్లేవనాయిడ్స్‌ అన్నవి చాలా చిక్కటి ముదురు రంగులో ఉండే అన్ని రకాల పండ్లలోనూ, కూరగాయల్లోనూ లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్‌. వాటికి ఫ్రీ–రాడికల్స్‌ను న్యూట్రలైజ్‌ చేసే గుణం చాలా ఎక్కువ. అందుకే వాటిల్లో సహజసిద్ధమైన క్యాన్సర్‌ నిరోధక గుణాలు ఎక్కువ.  

  • పుల్లగా ఉండే నిమ్మజాతి పండ్లలో లభ్యమయ్యే విటమిన్‌–సి కూడా చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. విటమిన్‌–ఈ కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్స్‌. 

  • చివరగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే ఆహారాలను తీసుకుంటే ఒక పక్కన మంచి యౌవ్వనాన్ని చాలాకాలం పాటు కాపాడుకోవడమే కాకుండా... ఎన్నో రకాల కేన్సర్లను సమర్థంగా నివారించినట్టూ అవుతుంది. 

(చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్‌ ఫేమస్‌ వటకం..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement