ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినందున తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. పీఈటీ, సిటీ స్కాన్ తదితర వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తన మధ్యంతర బెయిల్‌ను ఒక వారం పాటు పొడిగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్‌లో వివరించారు.
అరవింద్ కేజ్రీవాల్‌లో కనిపిస్తున్న లక్షణాలు తీవ్రమైన కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్‌ని కూడా సూచిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. దీని తరువాత లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి జూన్ ఒకటి వరకు ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మే 10న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే జూన్ 2న కోర్టుకు లొంగిపోవాలని కూడా ఆదేశించింది.
బిజినెస్ టుడే తెలిపిన వివరాల ప్రకారం ఆప్ నేత అతిషి మీడియాతో మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. కేజ్రీవాల్ ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నసమయంలో అతని బరువు ఏడు కిలోలు మేరకు తగ్గింది. అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది ఆందోళన కలిగించే అంశమని, కస్టడీ నుంచి బయటకు వచ్చాక, వైద్యుల పరిశీలనలో ఉన్నప్పటికీ కేజీవాల్ తిరిగి బరువు పెరగడం లేదని అతిషి తెలిపారు.
ఢిల్లీ సీఎంకు జరిపిన వైద్య పరీక్షల్లో అతని కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలిందని అతిషి చెప్పారు. అధిక కీటోన్ స్థాయిలతో పాటు ఆకస్మికంగా బరువు తగ్గడం అనేది క్యాన్సర్‌తో పాటు కిడ్నీ వ్యాధులకు సంకేతమని ఆమె తెలిపారు. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ పీఈటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారని అతిషి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment