ఐఫోన్‌తో సహా యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఇక అత్యంత ప్రీమియం యాపిల్ వ్యాచ్‌ల (Apple Watch) సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ వ్యాచ్‌ల విషయంలోనే యాపిల్ ఇప్పుడు యూఎస్‌లో వ్యాజ్యాన్ని (Lawsuit) ఎదుర్కొంటోంది. ఇది వినియోగదారులను విష రసాయనాలకు గురిచేస్తోందని, క్యాన్సర్‌తో (cancer) సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోపించింది.
హానికర రసాయనాలు
వివిధ కంపెనీలకు చెందిన 22 వాచ్ బ్యాండ్‌లపై (వాచ్ బెల్ట్) చేసిన అధ్యయనం ఫలితంగా ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇందులో 15 వాచ్ బ్యాండ్‌ల తయారీకి ఉపయోగించిన పదార్థాల్లో హానికర రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన “ఓషన్”, “నైక్ స్పోర్ట్”, సాధారణ “స్పోర్ట్” వాచ్ బ్యాండ్‌లు అధిక స్థాయిలో పెర్‌ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ పదార్థాలను (PFAS) కలిగి ఉన్నాయని డైలీ మెయిల్ నివేదిక అధ్యయనాన్ని ఉదహరించింది.
ఈ హానికర పదార్థాలను ‘ఎప్పటికీ నిలిచిపోయే రసాయనాలు’గా పేర్కొంటారు. ఎందుకంటే ఈ రసాయనాలు పర్యావరణంలో, మానవ శరీరంలో చాలా ఏళ్లు వాటి దుష్ప్రభావాలను కొనసాగిస్తాయి. వీటితో కలిగే అనారోగ్య దుష్పరిణామాలలో పుట్టుకతో వచ్చే లోపాలు, ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్, అలాగే సంతానోత్పత్తి సమస్యలు ఉన్నాయి.
యాపిల్ వాదన ఇదీ..
కాగా తమ వాచ్ బ్యాండ్‌లు 'ఫ్లోరోఎలాస్టోమర్' అనే సింథటిక్ రబ్బరు నుండి తయారవుతాయాయని, ఇది ఫ్లోరిన్ కలిగి ఉంటుంది కానీ హానికరమైన పెర్‌ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలు మాత్రం ఉండవని యాపిల్ సంస్థ చాలా కాలంగా వాదిస్తోంది. ఈ ఫ్లోరోఎలాస్టోమర్ సురక్షితమైనదని, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిగా పరీక్షించినట్లు కూడా చెబుతోంది.
అయితే యాపిల్ తమ వాచ్‌లకు వినియోగించే ఫ్లోరోఎలాస్టోమర్ ఆధారిత బ్యాండ్‌లు ఆరోగ్య ప్రమాదాలకు దోహదపడే ఇతర పదార్థాలతో పాటు పెర్‌ఫ్లోరోఆల్కైల్, పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను కలిగి ఉన్నాయనే వాస్తవాన్ని దాచిపెట్టిందని వ్యాజ్యంలో ఆరోపించారు.
హృదయ స్పందన రేటు, నడక, నిద్ర వంటి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను అప్రమత్తం చేసే హెల్త్-ట్రాకింగ్ ఉపకరణాలుగా కూడా విస్తృతంగా అమ్ముడుపోతున్న ఈ స్మార్ట్‌వాచ్‌లే క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో తేలడం ఆందోళనకరం.
Comments
Please login to add a commentAdd a comment