ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. నాకు రక్తహీనత సమస్య ఉంది. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం?
– బి.ఎల్, నర్సరావుపేట
రక్తహీనత అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తక్కువ ఉండటం. మనం తినే ఆహారం జీర్ణమై, దాని నుంచి విడుదలయ్యే పదార్థాలను, ఆక్సిజన్‌ను ఈ హిమోగ్లోబిన్, రక్తంలోని అన్ని కణాలకు, అవయవాలకు చేరవేస్తుంది. దాని వల్ల శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు సరిగా జరుగుతాయి. గర్భిణీలలో తల్లి నుంచి కడుపులోని శిశువుకు రక్తం ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా అవుతాయి. గర్భిణీలలో రక్తహీనత ఉన్నప్పుడు బిడ్డకు ఆక్సిజన్, పోషక పదార్థాల సరఫరా తగ్గే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల తల్లిలో ఇన్‌ఫెక్షన్స్, నెలలు నిండకుండా కాన్పులు, కాన్పు తర్వాత కూడా సమస్యలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ సమస్యలు రక్తహీనత తీవ్రతనుబట్టి ఉంటాయి. రక్తహీనత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పైన చెప్పిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేవలం రక్తహీనత వల్ల అబార్షన్లు అవ్వవు. రక్తహీనత బాగా తీవ్రంగా ఉన్నవారిలో ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ వంటి బయటికి కనిపించని ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కలిసినప్పుడు వీరిలో కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత కొద్దిగా ఉండేవాళ్లు దాని తీవ్రతను బట్టి ఐరన్ ట్యాబ్లెట్స్, పౌష్టికాహారంతో పాటు అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన స్కిన్ కేర్ టిప్స్ తెలియజేయగలరు. మా బంధువుల అమ్మాయి ఒకరికి అనీమియా సమస్య ఉందని విన్నాను. ఇది గర్భిణీలకు ఎందుకు వస్తుంది?
– పి. రేఖ, రామన్నపేట
వేసవి కాలం ప్రెగ్నెన్సీ సమయంలో.. ఎండల వల్ల శరీరంలో నీరు తగ్గడం, ఎక్కువగా చెమట పట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో శరీరంలో చెమ్మ తగ్గి చెమట పొక్కులు, దురద, మంట, చిరాకు వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగి జావ వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో తేమ తగ్గకుండా ఉంటుంది. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలాగే గొడుగును తీసుకెళ్లడం కూడా మంచిది. గర్భిణీలలో రక్తంలో నీటి శాతం పెరగడం, పెరిగే బిడ్డ అవసరాలకు, తల్లి శరీరంలో మార్పులకు సంబంధించి హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. దీనివల్ల గర్భిణీలలో అనీమియా ఎక్కువగా కనిపిస్తుంది. గర్భంలో శిశువు పెరుగుదలకు, తల్లి రక్తం నుంచి బిడ్డ ఆహారం, ఐరన్ వంటివి తీసుకోవడం వల్ల, తల్లిలో రక్తం తగ్గుతుంది. గర్భిణీలలో తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, ఆహారంలో ఉన్న ఐరన్, విటమిన్స్, మినరల్స్ సరిగా రక్తంలోకి చేరకపోవడం వల్ల కూడా వీరిలో అనీమియా వస్తుంది.
గతంలో నాకు చక్కగా నిద్ర పట్టేది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రం నిద్ర పట్టడం చాలా కష్టం అవుతోంది. మా ఫ్రెండ్ ఒకరు ‘ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా’ కావచ్చు అన్నారు. ఇది నిజమేనా? దీని గురించి తెలియజేయగలరు. ‘ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా’ నివారణకు ఏమైనా మందులు ఉన్నాయా? చెప్పగలరు. – యస్. లావణ్య, కొత్తగూడెం
గర్భిణీ సమయంలో అనేక కారణాల వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి ఇబ్బంది ఎదురవుతుంది. దీన్నే ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా అంటారు. గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. వీటిలో హార్మోన్ల మార్పులు, నడుమునొప్పి, అసిడిటీ, అజీర్తి వంటివి వస్తాయి. పొట్ట పెరిగే కొద్దీ ఇబ్బంది, ఆందోళన, భయం, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లవలసి రావడం, కాళ్లనొప్పులు వంటి అనేక కారణాల వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా పట్టకపోవడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు నిద్ర పట్టడానికి మందులు వాడటం మంచిది కాదు. వీరు నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలు పాటించడం శ్రేయస్కరం. రాత్రిపూట తొందరగా భోజనం చేసి, కొంతసేపు అటూఇటూ నడవాలి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి. నీళ్లు ఎక్కువగా పగటి పూట తీసుకొని, రాత్రి తక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిపూట మూత్రం కోసం నిద్ర లేవడం తగ్గుతుంది. కాళ్ల కింద, నడుము కింద, పొట్ట కింద, మోకాళ్ల మధ్యలో దిండు పెట్టుకొని పడుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, మంచి పుస్తకాలు చదవడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొందరికి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
పీరియడ్ బ్లడ్ కలర్‌తో ఆరోగ్య లక్షణాల గురించి తెలుసుకోవచ్చని ఎక్కడో చదివాను. ఏ రంగు ఏ లక్షణాన్ని సూచిస్తుందో తెలియజేయగలరు. – రజిత, హైదరాబాద్
పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అలాగే వారిలోని హార్మోన్ల అసమతుల్యతని బట్టి వారి రక్తస్రావంలో రక్తంలోని రంగు ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్న వారిలో మొదటి రెండు మూడు రోజులు ముదురు ఎరుపులో, కొందరిలో చిన్న ముక్కలుగా ఉంటుంది. తర్వాత రెండు రోజులు బ్లీడింగ్ తగ్గేకొద్దీ రక్తం గడ్డకట్టి కొద్దిగా బ్రౌన్ రంగులో, ఎండోమెట్రియం పొర ఊడిపోతుంది. కొందరిలో ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు రక్తం బ్రౌన్ రంగులోకి మారి, వాసనతో ఉంటుంది. రక్తస్రావంలో బ్లీడింగ్ రంగు రోజురోజుకి మారుతుంది. మొదట నీళ్లలాగా ఎర్రగా రావచ్చు. తర్వాత రోజు ముక్కలు ముక్కలుగా రావచ్చు. ఆ తర్వాత బ్రౌన్ కలర్‌లో వస్తూ కొద్దికొద్దిగా తగ్గిపోవచ్చు. రక్తానికి ఎక్కువ గాలి తగలడం వల్ల అది రంగు మారుతుంది. ఎక్కువసేపు ఉన్నప్పుడు అది నల్లగానూ మారవచ్చు. బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవుతూ, గడ్డలు గడ్డలుగా పోతున్నప్పుడు గర్భాశయం, అండాశయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. రక్తం రంగు కంటే బ్లీడింగ్ ఎంత, ఎన్ని రోజులు అవుతుందనేదే ముఖ్యం. ఇది కూడా కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment