ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు నేనొక భయానికి లోనవుతున్నాను. మనశ్శాంతి కోల్పోతున్నాను. మా బంధువుల్లో ఒకరికి గర్భంలోనే బిడ్డ చనిపోయింది. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే భయానికి గురవుతున్నాను. ‘స్టిల్‌బర్త్’కు ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ముందస్తు నివారణ మార్గాలు ఉంటే దయచేసి చెప్పండి. – బి. సంగీత, జగిత్యాల
ఏడోనెల వచ్చిన తర్వాత నుంచి కడుపులోని బిడ్డ చనిపోవడాన్ని లేదా కాన్పు సమయంలో చనిపోవడాన్ని స్టిల్ బర్త్ అంటారు. స్టిల్‌బర్త్‌కి... కొన్ని తెలిసిన, ఎన్నో తెలియని కారణాలు ఉంటాయి. తల్లిలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్స్, జ్వరం, తీవ్ర రక్తహీనత, షుగర్, బీపీ ఎక్కువగా ఉండటం, కిడ్నీ, లివర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు, అదుపులో లేని థైరాయిడ్, రక్తం గూడుకట్టడంలో సమస్యలు, తల్లి నుంచి బిడ్డకి రక్త సరఫరాలో సమస్యలు వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల స్టిల్‌బర్త్ అవ్వవచ్చు. అలాగే బిడ్డలో జన్యుపరమైన సమస్యలు, అవయవాల్లో లోపాలు, బిడ్డ సరిగా పెరగకపోవడం, బిడ్డలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్స్, గర్భంలో మాయ విడిపడిపోవడం (Abruption), కార్డ్ ప్రొలాప్స్ (బిడ్డ కంటే ముందు బొడ్డుతాడు బయటికి రావడం), బొడ్డుతాడు ముడిపడటం, మెడ చుట్టూ బిగుసుకుపోవడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోయి బిడ్డకు ఊపిరాడకపోవడం, కాన్పు సమయంలో బిడ్డపై ఒత్తిడి, ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల స్టిల్ బర్త్ జరుగుతుంది. తల్లిలో అధిక బరువు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి లక్షణాలు ఉంటే కూడా స్టిల్‌బర్త్ జరగవచ్చు.
కొందరిలో అంతా బాగుండి కూడా.. తెలియని కారణాల వల్ల ఉన్నట్లుండి బిడ్డ కడుపులోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. గర్భం దాల్చినప్పటి నుంచి డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లు చేయించుకోవడం, అవసరమైన రక్త పరీక్షలు, బీపీ, స్కానింగ్‌లు చేయించుకుంటూ డాక్టర్ రాసిన మందులు వేసుకుంటూ వారి సలహాలను పాటించడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఎడమవైపుకి తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల బిడ్డకు రక్తసరఫరా బాగా ఉంటుంది. ఏడోనెల తర్వాత బిడ్డ కదలికలు గమనించుకుంటూ ఉండాలి. అవి బాగా తగ్గినట్లు అనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు దానికి తగ్గ చికిత్స, సూచనలు తప్పకుండా పాటించడం మంచిది. ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు, సూచనలు, చెకప్‌లు చేయించుకున్నా కొందరిలో ఉన్నట్లుండి స్టిల్‌బర్త్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి ముందస్తు పరీక్షలు ఏమీ ఉండవు. దీనికోసం భయపడి ఆందోళన చెందడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. గర్భంతో ఉన్నప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా, సంతోషంగా గడపడం ముఖ్యం.
Menstrual Hygiene అనే మాట చాలాసార్లు విన్నాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. న్యాప్‌కిన్స్ అవసరం లేకుండా పీరియడ్స్‌ను మేనేజ్ చేయడానికి పంజాబ్‌లో అండర్‌వేర్‌లు వచ్చాయని చదివాను. వీటివల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా? – డి.శైలు, టెక్కలి
పీరియడ్స్ సమయంలో శారీరక శుభ్రత, జననేంద్రియాల శుభ్రత చాలా ముఖ్యం. దీన్నే Menstrual Hygiene అంటారు. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బయటకు వచ్చి చాలాసేపు జననేంద్రియాల దగ్గర ఉన్నప్పుడు, ఆ చెమ్మలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఇన్‌ఫెక్షన్ గర్భాశయానికి పాకే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి న్యాప్‌కిన్స్ తరచూ మార్చుకుంటూ ఉండాలి. రోజూ స్నానం చేయాలి. జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవాలి. న్యాప్‌కిన్స్ కాకుండా శుభ్రంగా లేని బట్టలు లేదా ఇంకా ఇతర పద్ధతులు పాటించడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. న్యాప్‌కిన్స్ మార్చిన ప్రతిసారి, అలాగే మలవిసర్జన, మూత్ర విసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో కొద్దిగా నీరసంగా ఉంటుంది కాబట్టి పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో న్యాప్‌కిన్స్ వాడే అవసరం లేకుండా డైరెక్ట్‌గా పీరియడ్ అండర్‌వేర్స్ అని మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇందులో అండర్‌వేర్‌లకి కింది భాగంలో వెదురు నుంచి తయారు చేసిన బట్టను చాలా పొరలుగా దళసరిగా కుట్టడం జరుగుతుంది. ఇది బ్లీడింగ్‌ను పీల్చుకుంటుంది. వివిధ రకాల సైజుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయి. పీరియడ్స్ అండర్‌వేర్స్ కూడా పీల్చుకునే చెమ్మనుబట్టి సైజుల వారీగా దొరుకుతాయి. వీటిని మంచినీటిలో సోపుతో బాగా శుభ్రపరిచి, గాలికి ఆరవేసి, మళ్లీ వాడుకోవచ్చు. ఇవి వందశాతం సురక్షితం అని చెప్పలేము, కాకపోతే మనం వాటిని జాగ్రత్తగా శుభ్రపరిచే విధానాన్నిబట్టి ఉంటుంది. పీరియడ్స్ ఎప్పుడు సరిగా మొదలవుతుందో తెలియక ఆందోళన పడుతున్నవారికి, ప్రతిరోజు అవసరం లేకుండా న్యాప్‌కిన్ పెట్టుకొని పనికి వెళ్లేవారికి ఆ రోజుల్లో వాడటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఉన్నట్లుండి బ్లీడింగ్ మొదలైనా కూడా టెన్షన్, ఇబ్బంది లేకుండా ఉంటుంది.
∙చైల్డ్‌హుడ్ క్యాన్సర్ సర్వైవర్లు భవిష్యత్‌లో గర్భం దాల్చినప్పుడు... గుండెకు సంబంధించిన రుగ్మతలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నా ఫ్రెండ్ ఎక్కడో చదివి చెప్పింది. ఇది ఎంత వరకు నిజం? దీని గురించి వివరంగా తెలియజేయగలరు.– కె.ప్రభ, హైదరాబాద్
చిన్నప్పుడు క్యాన్సర్ వచ్చి చికిత్స తీసుకున్న వాళ్లు భవిష్యత్‌లో గర్భం దాల్చినప్పుడు క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చిందనే దాన్నిబట్టి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్‌కి ఇచ్చే రేడియోథెరపీ వల్ల కొందరిలో గర్భాశయ కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం జరుగుతుంది. దాని వల్ల అబార్షన్లు, బిడ్డ ఎక్కువ బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు జరగటం, సాధారణ కాన్పు అవ్వడానికి ఇబ్బందులు ఉండవచ్చు. క్యాన్సర్‌కి కీమోథెరపీ ఇవ్వడంవల్ల రక్తహీనత, నడుము నొప్పి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కిడ్నీ క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పాంక్రియాస్ క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్న వారికి గర్భం దాల్చిన తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కీమోథెరపీలో వాడే మందులవల్ల గుండెలోని కండరాలు దెబ్బతిని బలహీనపడతాయి. దానివల్ల గర్భం దాల్చిన తర్వాత బలహీనబడిన గుండెపైన భారంపడి, గుండె పనితీరులో లోపాలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఛాతీ, పొట్ట క్యాన్సర్‌లకు ఇచ్చే రేడియోథెరపీ వల్ల కూడా గర్భం దాల్చిన తర్వాత గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్ ,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment