సర్జరీకి డయాబెటిస్ ఆటంకమా?
మా అమ్మగారి వయసు 66 ఏళ్లు. ఆమె షుగర్ లెవెల్స్ భోజనం తర్వాత 227 ఎంజీ/డీఎల్ ఉన్నాయి. ఆమెకు గాల్‌బ్లాడర్ తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించాల్సి ఉంది. ఆమెకు ఈ శస్త్రచికిత్స చేయించడం సురక్షితమేనా? సలహా ఇవ్వండి.
- నాగేందర్, కోదాడ
శస్త్రచికిత్స చేయించేముందర ఆమె రక్తంలోని చక్కెరపాళ్లు పూర్తిగా అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అలా జరగకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఇన్ఫెక్షన్లు, శస్త్రచికిత్స కోసం చేసిన గాటు మానకపోవడం లేదా మానడంలో ఆలస్యం, ఆమె కోలుకోడానికి ఎక్కువ సమయం పట్టడం లాంటి ఇబ్బందులు రావచ్చు. ఒకవేళ ఆమెకు శస్త్రచికిత్స కొద్దిరోజుల వ్యవధిలోనే జరగాల్సి ఉంటే, ఆమెను హాస్పిటల్‌లో చేర్చండి. అక్కడ శస్త్రచికిత్సకు ముందుగా గ్లైసిమిక్ కంట్రోల్ చేస్తారు. ఒకవేళ ఈ శస్త్రచికిత్స చేయడం తక్షణమే అవసరం లేకపోతే ఆమె చక్కెరపాళ్లు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు ఏం చేయాలన్న విషయాన్ని మీకు దగ్గరలోని ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి తెలుసుకోండి. ఆమె హెచ్‌బీఏ1సీ పరీక్ష ఫలితాలను బట్టి, ఇక ఆమెలోని చక్కెపాళ్లను పరిగణనలోకి తీసుకొని, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సకు ముందు, శస్త్రచికిత్స చేసే సమయంలోనూ, ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఆమెకు ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు. ఆ తర్వాత అంతా సక్రమంగా ఉంటే మళ్లీ నోటి ద్వారానే తీసుకునే షుగర్ మందులు ఇచ్చేలా డాక్టర్లు చూస్తారు.
నా వయసు 28. నేను గృహిణిని. ఒకసారి నా ఇన్సులిన్ పాళ్లు పరీక్షించినప్పుడు అది 79.12 అని వచ్చింది. నేను ఒక ఏడాది పాటు గ్లైసిఫేజ్ ఎస్‌యూఆర్ అనే మందు తీసుకున్నాను. నా విషయంలో ఆందోళన పడాల్సినదేమైనా ఉందా?
- రాగిణి, విజయవాడ
కేవలం ఇన్సులిన్ లెవెల్ పరీక్ష చేయించడంలో ఎలాంటి ఉపయోగమూ లేదు. ఇది మీకు ఎందుకు చేశారో రాయలేదు. మీకు స్థూలకాయం ఉందా? లేక పీరియడ్స్ సక్రమంగా రావడంలేదా, లేక శరీరంపై విపరీతంగా వెంట్రుకలు వస్తున్నాయా అనే విషయాలను ప్రస్తావించలేదు. పైగా మీరు రాసిన ఇన్సులిన్ పాళ్లు భోజనానికి ముందా లేక ఆ తర్వాతా అన్న విషయం కూడా లేఖలో లేదు. నిజానికి ఈ పరీక్షను ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్షతో పాటు నిర్వహించి హోమా-ఐఆర్ అనే ఒక నిష్పత్తి విలువను తెలుసుకుంటారు. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అన్న విషయాన్ని తెలుసుకొని, దాన్ని బట్టి మీకు ఉన్న డయాబెటిస్ రిస్క్‌ను అంచనా వేస్తారు. ఒకవేళ మీకు హిర్సుటిజమ్ గానీ, లేదా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంగానీ ఉంటే, పై పరీక్షతో పాటు మరికొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోండి.
డయాబెటిస్ కౌన్సెలింగ్
Published Wed, Jul 1 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement