
ఒక్క మాత్ర వేసుకుంటే చాలు.. మధుమేహం నయమైతే ఎలా ఉంటుందంటారూ? అబ్బో అద్భుతం ఆవిష్కారమైనట్లే కదూ. ఇంకొన్నాళ్లు ఆగితే ఇదే జరగబోతోంది. ఎందుకంటే బరువు తగ్గేందుకు చేసుకునే బేరియాట్రిక్ సర్జరీని తలపించేలా పనిచేసే ఓ కొత్త మాత్రను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. బేరియాట్రిక్ సర్జరీతో బరువు తగ్గడమే కాకుండా కొంతమందిలో మధుమేహం కూడా నయమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలంగా గుర్తిస్తూ వస్తున్నారు. ఎందుకిలా జరుగుతోందన్న విషయం మాత్రం స్పష్టం కాలేదు.
ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న 20 వేల మందిలో 84 శాతం మందికి మధుమేహం అన్నది లేకుండా పోయినట్లు తెలిసింది. ఈ అంశం ఆధారంగా బ్రైగమ్, విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఒక మాత్రను అభివృద్ధి చేశారు. ఇది పేగుల్లోపల కొద్దిసమయంపాటు ఒక పూతను పూస్తుంది. ఫలితంగా ఆహారం తీసుకున్న తరువాత హఠాత్తుగా రక్తంలో చక్కెర శాతం పెరగడం దాదాపుగా ఉండదు. ఎలుకలపై ఇప్పటికే ఈ మాత్ర ప్రభావం బాగా ఉన్నట్లు స్పష్టమైందని, పూత పూయడం ద్వారా ఈ మాత్ర తాత్కాలికంగా బేరియాట్రిక్ సర్జరీ ప్రభావాన్ని సృష్టించిందని యూహాన్ లీ అనే శాస్త్రవేత్త చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment