దాని వల్ల పెళ్లికి ప్రాబ్లమా?
సందేహం
నా వయసు 23. నాకు పీరియడ్స్ టైమ్‌లో బాగా కడుపునొప్పి ఉంటుంది. దానికి కారణమేంటో మీ శీర్షిక ద్వారా తెలుసుకున్నాను. కానీ నాకు రెండు రోజులకు మించి బ్లీడింగ్ అవ్వదు. అప్పుడు కూడా అంతంత మాత్రమే. మా ఫ్రెండ్స్‌కేమో అయిదు రోజులు అవుతుందట. దానివల్ల నాకు పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఈ మధ్య చాలా భయంగా ఉంటోంది. ఎందుకంటే, మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాబట్టి నా అనుమానానికి సమాధానం చెప్పండి ప్లీజ్.
- రాధిక, వరంగల్
ఆడవారిలో ఊఏ, ఔఏ, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, థైరాయిడ్ వంటి అనేక రకాల హార్మోన్లు సక్రమంగా విడుదలవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని బట్టి మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు దాదాపు 50ఝ నుంచి 80ఝ వరకు బ్లీడింగ్ అవుతుంది. కొందరిలో అధిక బరువు, పాలిసిస్టిక్ ఓవరీస్, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి, గర్భాశయం, అండాశయాల సైజు చిన్నగా ఉండటం వంటి ఎన్నో సమస్యల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బ్లీడింగ్ కొద్దిగానే అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇవే సమస్యలు ఉన్నప్పటికీ... కొందరిలో అధికంగానూ బ్లీడింగ్ అవ్వొచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల గర్భాశయంలోని పొర సరిగా పెరగకపోవడం వల్ల కూడా బ్లీడింగ్ కొద్దిగా అవ్వొచ్చు. కొంతమందిలో రెండు రోజులే అయినా, బ్లీడింగ్ బాగా అయ్యి ఆగిపోతుంది. దానివల్ల ఇబ్బంది లేదు. మీరు బరువు ఎంత ఉన్నారో రాయలేదు. బరువు మరీ తక్కువ ఉండడం వల్ల కూడా కొందరిలో బ్లీడింగ్ తక్కువ అవ్వొచ్చు. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇఆ్క, హార్మోన్ల పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకొని చికిత్స తీసుకోవచ్చు.
అధిక బరువు ఉంటే పరిమిత ఆహారం, వ్యాయామాలు చేసి తగ్గడం వల్ల ఉపయోగం ఉంటుంది. పైన చెప్పిన సమస్యలు ఉండడం వల్ల బ్లీడింగ్ కొద్దిగా అవుతుంటే... పెళ్లైన తర్వాత సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బంది అవ్వొచ్చు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా సమస్యకు తగ్గ చికిత్స తీసుకుంటే, తర్వాత ఇబ్బంది ఉండకపోవచ్చు.
నా వయసు 33. పెళ్లై సంవత్సరం అయింది (లేట్ మ్యారేజ్). మావారు నాకన్నా ఒక్క సంవత్సరం పెద్దవారు. కొన్ని కుటుంబ ఆర్థిక కారణాల వల్ల నాకు పెళ్లి ఆలస్యంగా జరిగింది. నాలుగు నెలల క్రితం పీరియడ్ ఆలస్యంకావడంతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ అని వచ్చింది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అన్నారు. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ ఈ మధ్య కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. తరచూ వేడి చేస్తోంది. దాంతో అబార్షన్ అవుతుందేమోనని భయంగా ఉంది. ముప్ఫై దాటితే ప్రెగ్నెన్సీ కష్టమంటారు. అలాంటిది నేను ఈ వయసుకు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. నా నొప్పికి గల కారణాలను చెప్పగలరు.
- స్వప్న, ఒంగోలు
మీరు డాక్టర్ దగ్గర ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ చేయించుకున్న తర్వాత నెలనెలా చెకప్‌కు వెళ్లినట్టు లేరు. సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర నెలనెలా చెకప్ చేయించుకోవాలి. మొదటి గర్భంలో అనేక కారణాల వల్ల 10-15 శాతం మందిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అబార్షన్ అయ్యే వారిలో 30 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అంతే కానీ తప్పనిసరిగా సమస్యలు ఉంటాయని ఏమీ లేదు.
మొదటి రెండు నెలలలో స్కానింగ్ చేయించుకుంటే, గర్భాశయంలో పిండం ఏర్పడిందా లేదా, దానిలో గుండె కొట్టుకోవడం (హార్ట్ బీట్) మొదలైందా లేదా అనే విషయాలు తెలుస్తాయి. తర్వాత మూడో నెల చివరిలో.. అంటే 12 వారాల సమయంలో గర్భంలోని పిండంలో చిన్న చిన్న చేతులు, కాళ్లు, తల, శరీరం ఏర్పడి శిశువు ఆకృతి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎన్‌టీ స్కాన్ చేయించుకుంటే, శిశువులో కొన్ని శారీరక లోపాలు, జన్యులోపాలు ఉంటే, వాటిని గుర్తించే వీలుంటుంది.
మొదటి నాలుగు నెలలలో మూత్రంలో, యోనిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల కడుపు నొప్పి రావచ్చు. కడుపులో ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్ ఏర్పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు, అండాశయాలలో పెద్ద పెద్ద సిస్ట్‌లు పెరగటం వంటి ఎన్నో సమస్యల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. మీరు అబార్షన్ అవుతుందేమోనని భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఎలా? మీరు ముందు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ చేయించుకుంటే.. సమస్య ఏమిటో తెలుసుకొని దానికి తగిన చికిత్సను డాక్టర్లు అందిస్తారు.