
‘క్లాస్‌లో అన్ని సబ్జెక్టులకూ ఒక్కో పీరియడ్ ఉంటుంది. మన మైండ్‌సెట్ చేంజ్ చేసుకోవడానికి ఒక పీరియడ్ ఉండాలి. ఆ పీరియడ్‌లో అమ్మాయిలకు పీరియడ్స్ గురించి ధైర్యంగా మాట్లాడే భరోసానివ్వాలి’. కేరళలో మొదలైన ‘స్టెయిన్.. ది స్టిగ్మా’ ఉద్యమ లక్ష్యం ఇది! దేశంలోనే అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్న కేరళలో కూడా ఇప్పటికీ రుతుక్రమం గురించి గోప్యత పాటించే పరిస్థితులే ఉన్నాయి. రుతుక్రమంపై అనేక అపోహలున్నాయి. ఆ అపోహలను పోగొట్టి, గోప్యతను ఛేదించడానికి జరిగిన ప్రయత్నమే ‘స్టెయిన్.. ది స్టిగ్మా’ క్యాంపెయిన్.
జోసెఫ్ అన్నంకుట్టి... కేరళలోని రేడియో మిర్చిలో రేడియోజాకీ. అతడికి ఓ రోజు ఎర్నాకుళంలోని థెరిస్సా కాలేజ్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తమ కాలేజ్‌లో ముఖ్యమైన కార్యక్రమానికి అతిథిగా వచ్చి మెన్‌స్ట్రువల్ హైజీన్ (రుతుక్రమంలో పాటించాల్సిన పరిశుభ్రత) గురించి ప్రసంగించాల్సిందిగా కోరారు నిర్వాహకులు. తానేమి వింటున్నాడో అర్థం కాలేదు జోసెఫ్‌కి. ‘సారీ, మీరు చెప్పింది అర్థం కాలేదు, మళ్లీ చెప్పండి’ అని అడిగాడు. అప్పటికే ఆ కాలేజ్‌లో జరిగిన ఇతర కార్యక్రమాలలో రెండుసార్లు అతిథిగా పాల్గొని ప్రసంగించాడు అతడు. అయితే ఈసారి వాళ్లు ఆహ్వానించిన సందర్భం పూర్తిగా వేరే. అందుకే అతడు మొదట కంగారు పడ్డాడు.
అయితే థెరిస్సా కాలేజ్ నిర్వాహకుల ఉద్దేశం వేరు. మెన్‌స్ట్రువల్ పీరియడ్ టాపిక్ ఆడవాళ్ల మధ్య మాత్రమే ఉండాల్సిన విషయం కాదు, అవసరమైతే ఎటువంటి బిడియం లేకుండా మగవారితో కూడా మాట్లాడాల్సిందేనని తెలియ చెప్పడానికే ఈ అవేర్‌నెస్ స్పీచ్ మగవారి చేత ఇప్పించదలచుకున్నారు. జోసెఫ్ కేరళలో అమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపే రేడియో జాకీ కావడంతో అతడిని ఆహ్వానించారు.
ఇంకా అపోహలున్నాయా?!
చదువుకుంటున్న కాలేజ్ అమ్మాయిల్లో కూడా మెన్‌స్ట్రువల్ సైకిల్‌ను ఎలా అర్థం చేసుకోవాలనే అవగాహన తక్కువ. అందుకు ఓ ఉదాహరణ రితిక (పేరు మార్చాం). రితిక క్రమం తప్పకుండా స్కూల్‌కి వచ్చేది. ఎనిమిదవ తరగతి వరకు హాజరు పట్టీలో ఆబ్సెంట్‌లు మూడు నెలలకొకటి కూడా ఉండేవి కాదు. అలాంటిది తొమ్మిదో తరగతి నుంచి సెలవులు ఎక్కువయ్యాయి. స్కూల్ నుంచి ఎప్పుడు మాయమవుతుందో తెలియదు. ఆటల్లో కూడా రితిక చురుకైనదే.
కానీ ఒక్కోసారి ఉదయం అన్ని క్లాసులకూ హాజరయ్యి, గేమ్స్ పీరియడ్‌కు మాత్రం మిస్ అయ్యేది. క్లాస్‌లకు సరిగ్గా రావడం లేదంటూ టీచర్లు మరింత జాగ్రత్తగా హాజరుపట్టీ పరిశీంచారు. అప్పుడు ఆ అమ్మాయి వరుసగా కొద్ది నెలల నుంచి 22 నుంచి 25వ తేదీల్లో గేమ్స్ పీరియడ్‌లో మాయమవుతోందని తెలిసింది. రితిక క్లాస్‌కు ఎందుకు మిస్సయిందో టీచర్లకు తెలియనంత కాలం, అలా మాయమైనందుకు మర్నాడు టీచర్లు కోప్పడేవారు. అయితే ఎంతగా మందలించినా ఆమె నోరు విప్పేది కాదు. కళ్లనీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయేది.
ఈ సంగతి తెలిసిన థెరిస్సా కాలేజ్ నిర్వాహకులు (అందులోనే స్కూలు కూడా), ఇలాంటి రితికలు ఇంకా ఎంతమంది ఉన్నారోనని నిశితంగా అధ్యయనం చేసి ఆశ్చర్యపోయారు. రుతుక్రమం సమయంలో స్కూలుకు వచ్చిన అమ్మాయికి తగలకుండా మిగతా ఆడపిల్లలు కూర్చోవడం వంటి అపోహలు కూడా ఇంకా కొనసాగుతున్నాయని తెలిసి విస్మయానికి లోనయ్యారు. ఈ సోషల్ స్టిగ్మా (సామాజిక అపసవ్యత) నుంచి సమాజాన్ని బయటపడేయాలంటే అమ్మాయిలను చైతన్యవంతం చేయాలి. అందుకు ఓ తొలి అడుగు పడాలి. అది తమ కాలేజ్ నుంచే మొదలవ్వాలి అనుకున్నారు. అప్పుడే ‘స్టెయిన్ ది స్టిగ్మా’ క్యాంపెయిన్ మొదలైంది. ఇదిప్పుడు దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించవలసిన అవసరం ఉంది.
– మను
Comments
Please login to add a commentAdd a comment