సాక్షి, ముంబై: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాత్రి వరకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, నాయకులు ఎన్నికల ప్రచారం చేయడంతోపాటు సోమవారం ఎన్నికల ప్రచారపర్వం ముగిసేంత వరకు స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నేతలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతోపాటు అనేక మంది మంత్రులు ప్రచారాల్లో పాల్గొన్నారు. 16, 17 తేదీల్లో పదుల సంఖ్యలో నిర్వహించిన సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ సారి కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శనివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ప్రకటించినప్పటికీ ఆయన సోదరుడు మృతి చెందడంతో ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ముంబై, నాసిక్, పశ్చిమ మహారాష్ట్రలోని సోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలతోపాటు మరఠ్వాడాలో లాతూర్, జాల్నా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన నాందేడ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, విదర్భలోని నాగ్‌పూర్‌తోపాటు తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్, గడ్చిరోలి తదితర ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ప్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలతోపాటు ముఖ్యంగా ఎన్నికల ప్రచార పాటల తెలుగు పాటలే కావడంతో అనేక మంది తెలుగు ఓటర్లను ఆకట్టుకునేలా చేశాయని చెప్పవచ్చు.
హామీల వర్షం..
తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నాయకులందరూ హామీల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం తోపాటు తెలుగు వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. వీరి సభలకు తెలుగు ప్రజలు హాజరుకావడంతో తెలుగు నాయకులు కూడా తమ పార్టీలే గెలుస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారంటీలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామంటూ హామీ ఇవ్వడంతోపాటు మహారాష్ట్ర వికాస్ అఘాడీ అభ్యర్థులకు ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. ‘ఇక్కడ మీ నియోజకవర్గంలో మీ అభ్యర్థి. హైదరాబాద్‌లో నేను..’ ఇలా ఒక్క ఓటుకు ఇద్దరు సేవలకులం అంటూ రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కాంగ్రెస్ తెలిపే అబద్ధపు మాటలను నమ్మొద్దంటూ బీజేపీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేశారు. తెలుగు ప్రజలతోపాటు అందరికీ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలుగు వారి సమస్యలు పరిష్కారమయ్యేనా?
మహారాష్ట్ర లో నివసించే తెలుగు ప్రజలకు పలు సమస్యలున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు నాయకులు ఇచి్చన హామీలు ప్రతిసారి ఎన్నికల్లో ఇచ్చే హామీల్లాగే మిగిలిపోతాయా? లేదా తమ సమస్యలు ఈ ఎన్నికల తర్వాత పరిష్కారమవుతాయా? అనే విషయంపై తెలుగు ప్రజల్లో చర్చల్లో ప్రారంభమయ్యాయి. అయితే అనేక మంది ఈ సారి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు భవనం, తెలుగు పీఠం గురించి పెద్ద రాజకీయ నాయకులెవరూ ప్రచారంలో మాట్లాడకపోయినప్పటికీ మీ సమస్యలేమైనా సరే అన్ని తీరుస్తామంటూ హామీలు గుప్పించారు. ఇక ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వర్లీ అసెంబ్లీ శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే మాత్రం ముంబై కరీంనగర్‌ల మధ్య రైళ్లు, తెలుగు భవనం గురించి ప్రస్తావించారు. రైళ్ల సమస్యలు తీరుస్తామని తెలుగు భవనం నిర్మాణం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment