అప్పట్నుంచీ మావారికి దగ్గర అవ్వలేదు
చాకొలెట్ సిస్ట్... వదిలేస్తే ప్రమాదమా!
సందేహం
నా వయసు 44. సంవత్సరం క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. అప్పట్నుంచీ మావారికి దగ్గర అవ్వలేదు. గుండె ఆపరేషన్ అయినవాళ్లు శృంగారంలో పాల్గొనవచ్చా? దానివల్ల ఏమైనా అవుతుందా? డాక్టర్‌ని అడగాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి మీరు చెబుతారా? - ఓ సోదరి
బైపాస్ సర్జరీ అయినా కూడా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండి, ఆయాసం లేకుండా ఉంటే శృంగారంలో పాల్గొన వచ్చు. 2డీ ఎకో, ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్ అన్నీ చేయించుకోవాలి. ఫలితాలు నార్మల్‌గానే ఉంటే శృంగారంలో పాల్గొనవచ్చు. అయితే ఛాతి మీద ఎక్కువ ఒత్తిడి పడ కుండా చూసుకోవాలి. ఆపరేషన్ తర్వాత పని చేసుకుంటున్నప్పుడు ఆయాసం వస్తుందా, వాకింగ్ చేసుకుంటే ఆయాసం వస్తుందా అన్నది చూసుకోవాలి. ఏం లేకపోతే మూడు నెలల తర్వాతి నుంచే పాల్గొనవచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం రెండు మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకుని పాల్గొనడం మంచిది. మీరు రెండు అంతస్తుల మెట్లు ఆయాస పడకుండా ఎక్కగలిగి ఉంటే, ఇరవై నిమిషాల్లో 2.5 మైళ్లు నడవ గలిగితే శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బంది ఉండదు.
నిజానికి కలయిక కూడా ఒక వ్యాయామం లాంటిదే. మీకు ఆపరేషన్ అయ్యి సంవత్సరం దాటింది కాబట్టి మీరు భయపడకుండా పైన చెప్పిన అంశాలు పాటిస్తూ, శృంగార జీవితాన్ని ఆస్వాదించవచ్చు. కాకపోతే ఓసారి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ని సంప్రదించి, మీ గుండె పనితీరు ఎలా ఉంది, ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా లేదా అనేది తప్పక పరీక్ష చేయించుకోవడం మంచిది. వీలయితే మీ సిగ్గు, బిడియం వదిలి మీ డాక్టర్‌ని అడిగేయండి. ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితి పట్ల వారికే పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి.
నా వయసు 29. ఏడాదిన్నర క్రితం పెళ్లయ్యింది. గర్భం వచ్చింది కానీ కుడివైపు ట్యూబులో వచ్చింది. అది పగిలిపోవడంతో ఆపరేషన్ చేసి ట్యూబ్ తీసేశారు. అప్పుడే రెండో ట్యూబునూ పరీక్షించారు. దానిలో వాపు ఉంది, మళ్లీ గర్భం దాల్చినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అది నిజమేనా? అలా రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? గతంలో టీబీ వస్తే మందులు వాడాను. దానివల్లే ఇలా అవుతోందా? - మాధవి, ఉండ్రాజవరం
గర్భం గర్భాశయంలో కాకుండా మిగతా భాగాల్లో... అంటే ట్యూబ్స్, అండాశయాలు, పొత్తి కడుపులో రావ డాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది 95 శాతం ట్యూబ్స్‌లో వస్తుంది. సాధార ణంగా ట్యూబ్స్‌లో ఏర్పడిన పిండం ట్యూబ్ కదలిక ద్వారా గర్భాశయంలోకి వచ్చి, అక్కడ పాతుకుని గర్భం మొదలవు తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, ట్యూబ్స్ పాడవడం వల్ల లేదా పాక్షికంగా మూసుకు పోవడం వల్ల, వాటి పనితీరు మందగిం చడం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి వెళ్లలేక, అక్కడే పాతుకుని పెరగడం మొదలవుతుంది. పిండం ఎదుగుదలకు సరిపడేలా గర్భాశయం సాగినట్టు ట్యూబులు సాగలేవు. కాబట్టి పిండం పెరిగేకొద్దీ ట్యూబు పగిలి, విపరీతమైన నొప్పి రావడంతో పాటు పొత్తి కడుపులో రక్తస్రావం జరుగుతుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. మీకు ఇప్పుడు ఒక్క ట్యూబ్ ఉంది.
అది కూడా సరిగ్గా లేదు. అంటే ఈసారి కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టే. ఇదివరకు టీబీ కూడా వచ్చిందన్నారు. టీబీ ఇన్ఫెక్షన్ వల్ల కొందరిలో టీబీ బ్యాక్టీరియా ట్యూబ్స్‌ని దెబ్బతీస్తుంది. దాంతో టీబీ చికిత్స తీసుకున్నా ట్యూబ్స్ బాగయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. డాక్టర్‌ని మరోసారి సంప్రదించి, ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన మందులు వాడండి. కొంత కాలం తర్వాత మళ్లీ గర్భానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నెల తప్పితే అప్పటి నుంచీ డాక్టర్ పర్యవేక్షణలో ట్రాన్స్ వెజైనల్ స్కానింగ్ క్రమం తప్పకుండా చేయించుకుంటూ గర్భం గర్భాశయంలో వచ్చిందా ట్యూబ్స్‌లో వచ్చిందా అనేది త్వరగా నిర్ధారించుకోవడం మంచిది. ఒకవేళ అదృష్టం బాగుండి గర్భాశయంలో వస్తే మంచిదే. కానీ ట్యూబ్స్‌లో వస్తే మాత్రం వెంటనే తీయించేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే అయితే ఆపరేషన్ అవసరం లేకుండా మెథోట్రెక్సేమియా అనే ఇంజెక్షన్ ద్వారా కరిగించేయడానికి ప్రయత్నం చేయవచ్చు. తర్వాత గర్భం కోసం టెస్ట్ ట్యూబ్ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.
నా వయసు 25. గత కొన్ని నెలలుగా నాకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. నడుము కూడా బాగా లాగేస్తోంది. డాక్టర్ స్కాన్ చేసి, చాకొలెట్ సిస్టులు ఉన్నాయి అన్నారు. మందులు వాడితే సరిపోతుంది అన్నారు. అది నిజమేనా? అసలు చాకొలెట్ సిస్టులంటే ఏంటి? ఎందుకు వస్తాయి? వాటివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా - పి.సుబ్బలక్ష్మి, తణుకు
చాకొలెట్ సిస్టులనేవి అండాశయాల్లో ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి వల్ల ఏర్పడతాయి. గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియమ్ పొర ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ద్వారా కొద్దికొద్దిగా యోని ద్వారా బయటకు వచ్చేస్తుంది. కొద్దిమందిలో మాత్రం అలా రాకుండా గర్భాశయం నుంచి ట్యూబు ద్వారా పొత్తి కడుపులోకి చేరి... అక్కడ అండాశయాల మీద, పేగుల మీద, గర్భాశయం బయట అతుక్కుంటుంది. అలా అతుక్కున్న పొరలో ప్రతినెలా బ్లీడింగ్ అయినట్టే అయ్యి, ఆ రక్తం గడ్డకట్టి ఎండో మెట్రియాసిస్ సమస్య ఏర్పడు తుంది. అండాశయాల మీద అతుక్కున్న పొరలో గడ్డకట్టిన బ్లీడింగ్ రంగు మారి చాకొలెట్‌లాగా మారుతుంది. దీన్నే చాకొ లెట్ సిస్ట్ అంటారు. ఈ సిస్టులు మెల్లమెల్లగా సైజు పెరుగుతూ పోతాయి. ఎండోమెట్రి యాసిస్ వల్ల చాకొలెట్ సిస్టులతో పాటు చుట్టుపక్కలున్న పేగులు, గర్భాశయ ట్యూబులు అన్నీ దగ్గర దగ్గరకు వచ్చి అంటుకుపోవడం జరుగుతుంది.
దీనివల్ల పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి, కలయికలో నొప్పి వంటి సమ స్యలు మొదలవుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి అవి పెరుగుతూ ఉంటాయి. చాకొలెట్ సిస్టులు 2 సెం.మీ. నుంచి 10 సెం.మీ. వరకూ పెరిగే అవకాశాలు ఉంటాయి. 2-3 సెం.మీ. ఉంటే కనుక ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని రకాల హార్మోన్ మందులతో కరిగిపో తాయి. మీరు మీ సిస్టుల సైజు రాయ లేదు. కాబట్టి నేను చెప్పలేను. సైజు చిన్నగా ఉంటే మందులతో ప్రయత్నిం చండి. లేదంటే ఓపెన్ ఆపరేషన్ ద్వారానో, ల్యాపరోస్కోపీ ద్వారానో తొలగించాల్సి ఉంటుంది. అశ్రద్ధ చేస్తే గర్భం దాల్చడంలో ఇబ్బందులు రావచ్చు.
నా వయసు 22. నేను చిన్నప్పట్నుంచీ చాలా బలహీనంగా ఉండేదాన్ని. కొందరు పిల్లలు అలాగే ఉంటారు అని డాక్టర్లు అనడంతో మావాళ్లు నిర్లక్ష్యం చేశారు. కానీ పెద్దయ్యేకొద్దీ ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వస్తూ ఉండటంతో సిటీలోని డాక్టర్‌కి చూపించారు. ఊపిరితిత్తుల్లో నీరు ఉందని చెప్పారు. మందులు వాడాను. కొన్నాళ్లు బానేవుంది, మళ్లీ సమస్య మొదలైంది. అలా మందులు వాడటం, తగ్గడం, మళ్లీ రావడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే బానేవుంది. కాకపోతే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అసలు నేను పెళ్లి చేసుకోవచ్చా, రేపు ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నదే నా భయం. ఒకవేళ మళ్లీ సమస్య మొదలైతే... కలయికలో కానీ, పిల్లలు పుట్టడంలో కానీ, డెలివరీ సమయంలో కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయా? నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? - ప్రత్యూష, టేకుమట్ల, ఆదిలాబాద్
రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం, రక్తహీనత వల్ల బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ రావడం జరుగుతుంది. దానివల్ల న్యుమోనియా, టీబీ వంటి వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి. ఇవి బలహీనంగా ఉన్నా, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోయినా మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కాబట్టి మంచి పోషకాహారం తీసుకుంటూ ఆర్యోగంగా ఉండండి. దానివల్ల వ్యాధి మళ్లీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఓసారి డాక్టర్‌ని కలిసి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది పరీక్ష చేయించుకోండి. దాంతో పాటు టీబీ టెస్ట్, సీబీపీ వంటి పరీక్షలు చేయించుకుని మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవడం మంచిది. సమస్య ఏమీ లేనప్పుడు నిశ్చింతగా పెళ్లి చేసుకుని, మీ సంసార జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ, పండంటి బిడ్డను కనవచ్చు. ఒకవేళ సమస్య మళ్లీ వచ్చినా దానికి తగ్గ చికిత్స తీసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపవచ్చు.
నా వయసు 26. నెలన్నర క్రితం పాప పుట్టింది. అంతకు ముందే బాబు ఉన్నాడు. బాబు పుట్టినప్పుడు పాలు తాగకుండా ఏడ్చే వాడు. డాక్టర్‌కి చెబితే పాలు టెస్ట్ చేశారు. చేదుగా ఉన్నాయని, బ్రెస్ట్‌లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని, తల్లిపాలు వద్దని చెప్పారు. ఇప్పుడు కూడా అదే సమస్య వచ్చింది. పాపకు కూడా పోతపాలే ఇవ్వాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? బిడ్డకు పాలు కూడా ఇవ్వలేక పోతున్నానని చాలా బాధ కలుగుతోంది. అసలు ఇలా జరుగుతుందా? డాక్టర్ చెప్పింది నిజమేనా? దీనికి పరిష్కారం లేదా? - సి.కవిత, గుత్తి
బ్రెస్ట్‌లో ఏదో ఇన్ఫెక్షన్ వల్ల పాలు చేదుగా ఉన్నాయన్నారు. ఇన్ఫెక్షన్ అయితే కొద్దిరోజుల పాటు యాంటి బయొటిక్స్ వాడితే సరిపోతుంది. అంతేకానీ మొత్తానికే పాలు ఇవ్వకుండా ఉండాలని లేదు. తల్లి తినే ఆహారాన్ని బట్టి కూడా పాలకు రుచి ఏర్పడుతుంది. మీరు మరో సారి డాక్టర్‌ని సంప్రదించి రొమ్ములు, పాలు పరీక్ష చేయించుకోండి. కారణాన్ని బట్టి యాంటి బయొటిక్స్ వాడండి. పోషకాహారం తీసుకుంటూ, బిడ్డకు పాలివ్వడానికి ప్రయత్నం చేయవచ్చు. కాకపోతే ఒకటిన్నర నెల నుంచి బిడ్డకు పోతపాలు అలవాటైపోయాయి. కాబట్టి మీ పాలు బాగున్నా వాటిని తాగాలంటే బిడ్డ సుముఖత చూపించకపోవచ్చు. అదే పోతపాలు అలవాటు కాకముందే మొదట్లోనే అయితే బాగుండేది. అదీ కాక ఇన్ని రోజుల తర్వాత పాలు కూడా అంత ఎక్కువగా రాకపోవచ్చు. అండాశయాల మీద అతుక్కున్న పొరలో గడ్డకట్టిన బ్లీడింగ్ రంగు మారి చాకొలెట్‌లాగా మారుతుంది. దీన్నే చాకొ లెట్ సిస్ట్ అంటారు. ఈ సిస్టులు మెల్లమెల్లగా సైజు పెరుగుతూ పోతాయి.
డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్