
గర్భం దాల్చేందుకు ఆ సమస్య ఏమైనా అడ్డంకి అవుతుందా?
ముందు రెగ్యులర్‌గా పీరియడ్స్ రావాలి
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 27 ఏళ్లు. నాకు ఏడాది క్రితం పెళ్లయింది. అప్పట్నుంచి గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే నాకు రెణ్ణెల్లకు ఒకసారి మాత్రమే రుతుస్రావం వస్తోంది. గర్భం దాల్చేందుకు ఈ సమస్య ఏమైనా అడ్డంకి అవుతుందా? - రమ్య, మేదరమెట్ల
గర్భం ధరించాలంటే పీరియడ్స్ సక్రమంగా రావడం చాలా ముఖ్యం. ప్రతిసారీ 25 - 35 రోజులకు ఒకసారి రుతుక్రమం వస్తుందంటే అది సాధారణంగా పరిగణించవచ్చు. ఉదాహరణకు ప్రతి 28 రోజులకు ఒకసారి వచ్చే రుతుక్రమంలో... బహిష్టు అయిన 14వ రోజున కలిస్తే... గర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే రుతుక్రమం సక్రమంగా లేని మహిళల్లో అండం ఎప్పుడు విడుదల అవుతుందో నిర్దిష్టంగా చెప్పడం కష్టం. ఇలా రుతుక్రమం సరిగా రావడం లేదంటే... అలాంటి మహిళల్లో హార్మోన్ల సమతౌల్యత సరిగా లేదని కూడా భావించవచ్చు. గర్భధారణ అవకాశాలు మెరుగుపడాలంటే కచ్చితంగా హార్మోన్ల అసమతౌల్యతను నివారించాల్సిందే. అప్పుడు రుతుక్రమం మెరుగవడంతో పాటు అండం కూడా సక్రమంగా విడుదల అవుతుంది. దాంతో గర్భధారణ అవకాశాలూ మెరగవుతాయి.
నా వయసు 39 ఏళ్లు. నా భర్త వయసు 45 ఏళ్లు. గత పదేళ్లుగా ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూస్తున్నాం. ఆరేళ్ల నుంచి రకరకాల చికిత్సలు తీసుకుంటున్నాం. అంతా నార్మల్‌గానే ఉందంటున్నారు. అయినా నాకు గర్భం రాలేదు. నేను చివరి ప్రయత్నంగా అనుసరించేందుకు ఏదైనా వైద్య ప్రక్రియ అందుబాటులో ఉందా? - స్వప్న, నర్సరావుపేట
సంతాన సాఫల్యం కోసం ఐవీఎఫ్ లాంటి కొన్ని అధునాతన వైద్యచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే 37 ఏళ్లు దాటిన మహిళల్లో గర్భం దాల్చడానికి కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే ఛాన్స్ ఉంది. వయసు పెరుగుతున్నప్పటికీ గర్భం దాల్చేందుకు అవకాశాలు తగ్గుతుంటాయి. అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంది. పైగా క్రోమోజోముల్లో సమస్య వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అయితే ఇలాంటి క్రోమోజోమల్ సమస్యలు ఏవైనా వస్తే... గర్భం దాల్చాక వాటిని పసిగట్టే మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం అంతగా ఉండదు. ఐవీఎఫ్ అనే ప్రక్రియ ద్వారా మీరు సంతాన సాఫల్యాన్ని పొందవచ్చు. అయితే అంతకంటే ముందు మీ దంపతులిద్దరూ కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల వల్ల మీకు సంతానం పొందే అవకాశం ఉందో తెలుస్తుంది. ఒకవేళ సంతాన సాఫల్యం పొందే అవకాశాలు లేకపోయినా దాతల నుంచి అండాలను పొంది కూడా ఐవీఎఫ్ చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. మీరిద్దరూ ఒకసారి సంతాన సాఫల్య నిపుణులను కలవండి.
డాక్టర్ ప్రీతీ రెడ్డి కన్సల్టెంట్ ఇన్‌ఫెర్టిలిటీ, బర్త్ రైట్ బై రెయిన్‌బో, బంజారాహిల్స్, హైదరాబాద్
తిప్పతీగతో ఉపయోగాలెన్నో!
ఆయుర్వేద కౌన్సెలింగ్
ఆయుర్వేద ఔషధాల్లో తరచూ తిప్పతీగ ప్రస్తావన వస్తుంటుంది. దాని ప్రయోజనాలు ఏమిటో వివరించండి. - భావన, హైదరాబాద్
తిప్పతీగ పేరును బట్టే ఇది ‘లత’ అని అర్థమవుతుంది. సన్నటి కాండంతో వేరొక చెట్టు మీదగానీ లేదా దేనినైనా ఆసరా చేసుకుని, చుట్టుకుని పాకే మొక్క. దీని ఆకులు ఇంచుమించు తమలపాకుల ఆకారంలో (గుండె ఆకారంలో) ఉంటాయి. బెరడు నూగు (ధూళి)పూసిన ఆకుపచ్చరంగులో ఉంటుంది. బెరడు అంతా కంతులు కలిగి ఉంటుంది. వేసవిలో పువ్వులు, శీతాకాలంలో పండ్లు ఉంటాయి. ఈ పండ్లు చిన్నగా, ఎర్రగా ఉంటాయి. వృక్షశాస్త్రంలో దీని పేరు ‘టైనోస్పోరా కార్డిఫోలియా’. దీనికి ‘అమృత, గుడూచీ, చక్రాంగీ, మధుపర్ణీ’ అనే పర్యాయపదాలుంటాయి. హిందీలో ‘గిలోయా’ అంటారు. దీని రుచి చేదు, కారంగా ఉంటుంది.
ఔషధ గుణాలు : ఇది వాత, పిత్త, కఫ వికారాలన్నింటినీ తగ్గిస్తుంది. అన్ని రకాల జ్వరాలనూ తగ్గిస్తుంది. ఆకలి పుట్టించి, జీర్ణక్రియను పెంచుతుంది. అమ్మపిత్త (ఎసిడిటీ) వికారాన్ని పోగొడుతుంది. వాంతులు, దప్పికను తగ్గిస్తుంది. రక్తశుద్ధి చేసి చర్మరోగాలను దూరం చేస్తుంది. శరీర భాగాల్లోని మంట, మూత్రంలో మంట, దగ్గు, కీళ్లనొప్పుల వంటి వివిధ బాధలను తగ్గిస్తుంది. రక్తహీనతను పోగొడుతుంది. ‘హీమోగ్లోబిన్’ను పెంచుతుంది. నీరసాన్ని పోగొడుతుంది. మూలశంకను కూడా తగ్గిస్తుంది. మధుమేహ నివారణ, చికిత్సలకు ఉపయోగపడుతుంది.
భావప్రకాశ : ‘దోషత్రయామ తృట్ దాహ మేహ కాసాంశ్చ
పాండుతాం; కామలా కుష్ట వాతాస్ర జ్వరకృమి
వమీన్ హరేత్;.... హృద్రోగవాతనుత్’’
వాడుకునే విధానం : దీని ఆకులు, పువ్వులు, పండ్లు, కాండం, దుంప... అన్నీ ఉపయోగకరమే.
స్వరసం ( పసరు) : పైన చెప్పిన భాగాలలో లభ్యమైనవాటిని పరిశుభ్రంగా నీటితో కడిగి, పచ్చివాటిని దంచి స్వరసం తీయాలి. ఒకటి-రెండు చెంచాల మోతాదులో తేనెతో రెండుపూటలా సేవించాలి.
చూర్ణం : లభించిన భాగాలను బాగా ఎండబెట్టి పొడి చేయాలి. మోతాదు : 3 నుంచి 5 గ్రాములు నీటితో లేక తేనెతో రెండుపూటలా సేవించాలి. చూర్ణాలను తయారు చేసి ఆరు నెలల లోపు వాడుకోవాలి.
కషాయం : లభించిన భాగాలను పచ్చివిగానీ, ఎండువిగానీ లేక చూర్ణాన్ని గానీ ఉపయోగింయచి కషాయం తయారు చేసుకోవాలి (పది గ్రాముల ద్రవ్యానికి సూమారు 120 మిల్లీలీటర్ల నీటిని కలిపి, నాల్గవ వంతు మిగిలేవరకు మరిగించి, వడగట్టుకోవాలి. (మోతాదు: ఐదారు చెంచాలు (3 మి.లీ.) రెండు పూటలా ఖాళీ కడుపున తాగాలి.
సత్వం : దీన్నే సత్తు అంటారు. ఈ ద్రవ్యానికి సంబంధించి తిప్పసత్తు. లభించిన భాగాలన్నింటినీ, పచ్చివాటినీ, పరిశుభ్రంగా కడిగి, బాగా దంచి, నీటిలో 12 గంటల పాటు నానబెట్టి, ఆ తర్వాత, పైన తేలిన నీటిని పారబోసి, అడుగున ఉన్న ముద్దను, నీడలో ఆరబెట్టాలి. అప్పుడు మెత్తగా నూరితే ‘సత్వం’ తయారువుతుంది. ఇది ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. మోతాదు : 1 - 3 గ్రాములు తేనెతోగానీ, నీటితోగాని రెండుపూటలా సేవించాలి.
అమృతారిష్ట (ద్రావకం): ఇది ఆయుర్వేద మందుల షాపులలో లభిస్తుంది. ‘ఆసవ’, ‘అరిష్ట’ రూపంలో మందుల్ని తయారు చేయడం ఇళ్లలో సాధ్యం కాదు. ఫార్మశీలలో తయారు చేయాలి. మోతాదు : 3 లేక 4 చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడు పూటలా తాగాలి.
గమనిక : ఈ లతను ఇళ్లళ్లో, పెరళ్లలో లేదా కుండీలలో పెంచుకోవచ్చు. వ్యాధులను బట్టి దీనితో పాటు ఇతర మూలికల్ని కూడా కలుపుకొని వాడతారు.
డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రి ఆయుర్వేద నిపుణులు
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్