ఈ వయసులోనే... | In this age of high-blood pressure drugs used ..? | Sakshi
Sakshi News home page

ఈ వయసులోనే...

Published Thu, Mar 3 2016 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

ఈ వయసులోనే...

ఈ వయసులోనే...

హై-బీపీ.. మందులు వాడాలా?

హోమియో కౌన్సెలింగ్

నా వయసు 28. పెళ్లయి, మూడేళ్లయింది. ఇంకా సంతానం లేదు. బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ దగ్గరకు వెళితే నాకు డిస్మనోరియా అని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. అదేమైనా ప్రమాదకరమైన జబ్బా? దీనికి హోమియోలో చికిత్స ఉందా?
 - బి.శ్రీదేవి, రాజమండ్రి

 స్త్రీల ఆరోగ్యసమస్యలలో నెలసరి సమస్యలు ముఖ్యమైనవి. ఎక్కువశాతం స్త్రీలు పిరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. దీనిని బహిష్టునొప్పి (డిస్మనోరియా) అంటారు. డిస్మనోరియా అన్ని వయసులలోని వారికీ ఉండే సమస్యే అయినప్పటికీ యుక్తవయస్కులలో ఎక్కువ.

లక్షణాలు: డిస్మనోరియా ముఖ్యంగా మూడు రకాలు. మొదటిరకంలో బహిష్టుకు మూడు నుంచి ఐదురోజుల ముందు నుంచే పొత్తికడుపు, నడుము భాగంలో నొప్పి మొదలవుతుంది. ఇది రుతుస్రావం మొదలయ్యాక మందులు వాడినా, వాడకున్నా తగ్గిపోతుంది. దీనిని కంజెస్టివ్ డిస్మనోరియా అంటారు. రెండవ రకంలో తీవ్రమైన నొప్పి, వాంతులు, శరీరం వణకడం, తలతిరగడం వంటి లక్షణాలు కనపడవచ్చు. దీనిని స్పాస్మోడిక్ డిస్మనోరియా అంటారు. మూడవరకంలో విపరీతంగా నొప్పి, రక్తస్రావంలో పెద్దపెద్ద గడ్డలు ఉంటాయి. దీనిని మెంబ్రేనస్ డిస్మనోరియా అంటారు.
 
కారణాలు: గర్భాశయం చుట్టూ ఉన్న కండరాల్లో సరైన సంకోచ వ్యాకోచాలు జరగకపోవడం, గర్భాశయం ముఖద్వారం చిన్నదిగా లేదా ముడుచుకుని ఉండటం వల్ల స్రావం సాఫీగా జరగక నొప్పి వస్తుంది. కొందరిలో యోని ముఖద్వారం చిన్నదిగా ఉండటం వల్ల స్రావం సరిగ్గా బయటకు రాక చిన్నచిన్న గడ్డల రూపంలో రుతుస్రావం వెలువడి నొప్పి వస్తుంది. గర్భాశయం ఆకృతిలోనూ, పరిమాణంలోనూ  తేడాలవల్ల, గర్భాశయం వెనుకకు తిరిగి ఉండటం వల్ల, గర్భాశయంలో గడ్డలుండటం, చీము చేరడం, అండాశయంలో కంతులు పెరగడం, గర్భనిరోధక ఔషధాల సేవనం, గర్భనిరోధక పద్ధతులను పాటించడం, మానసిక ఆందోళన, హార్మోన్ల అసమతౌల్యతల వల్ల కూడా నొప్పి కలిగే అవకాశాలు ఉంటాయి.
 
హోమియో చికిత్స: పాటిజివ్ హోమియోపతిలో కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
కిడ్నీ కౌన్సెలింగ్
నా వయసు 33 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చింది. డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా?                                    
  - సత్యనారాయణ, విజయవాడ

 మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేగాక... ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి.
 
నా వయసు 25 ఏళ్లు. రెండేళ్లుగా అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. నొప్పి లేకపోవడంతో ఇంతవరకూ పట్టించుకోలేదు. దీని వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?                                               - విశ్వప్రసాద్, కందుకూరు
 సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను  కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి.
 
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
 
లివర్ కౌన్సెలింగ్
 
నా వయసు 65 ఏళ్లు. కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా సమస్యకు  పరిష్కారం చెప్పండి.
 - శ్రీనాధరావు, కమలాపురం

 కీళ్ల నొప్పులలో చాలా రకాలు ఉన్నాయి. ఎముకలూ, దానిపైన రక్షణగా ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) అరగడం వల్ల కీళ్లనొప్పులు, వాపు వస్తాయి. ఈ కండిషన్‌ను ఆర్థరైటిస్ అంటారు. ఈ రకాలలో ఇప్పటికి వందకు పైగా గుర్తించారు. తమ రోగ నిరోధక వ్యవస్థే తమ ఎముకలపై ప్రతికూలంగా వ్యవహరిస్తుంది. ఈ సమస్యను ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ అంటారు. ఒక్కోసారి ఏదైనా ప్రమాదంలో గాయపడినా, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా ఆర్థరైటిస్ రావచ్చు. మీకు ఏదైనా ప్రమాదం జరిగిందా లేక ఏవైనా జబ్బు వచ్చి తగ్గాక ఈ పరిణామం సంభవించిందా అన్న వివరాలు లేవు. ఇక ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్లు నొప్పిగా ఉండటంతో పాటు, ఆ ప్రాంతం ఎర్రబారడం, వేడిగా అనిపించడం, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మీ వయసులో ఉన్నవారికి ఆర్థరైటిస్ మామూలే అయినా ఇప్పుడు అన్ని వయసుల వాళ్లలోనూ (పిల్లల్లోనూ) ఇది కనిపిస్తోంది. మహిళల్లో మరీ ఎక్కువ. (మహిళల్లో 24.3 శాతం ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే పురుషుల్లో ఇది 18.7 శాతం మాత్రమే). ఇక స్థూలకాయం కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలను మరింత పెంచుతుంది. నివారణ: ఆర్థరైటిస్‌ను నివారించడానికి ముందు నుంచే అన్ని కీళ్లూ చురుగ్గా కదిలేలా వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. దీనివల్ల కీళ్లతో పాటు శరీర సంపూర్ణ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. వారంలో మీరు వ్యాయామం చేసిన సమయం కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇక్కడ శరీరం సహకరిస్తున్నంత  వ్యాయామమే చేయాలి తప్ప... దాన్ని తీవ్రమైన శ్రమకు గురిచేసేలా మీ ఎక్సర్‌సైజ్ ఉండకూడదు. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్యకు ఎన్‌ఎస్‌ఏఐడీ, డీఎమ్‌ఏఆర్‌డీ, బయాలాజిక్ రెస్పాన్సెస్ అనే మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు ఒకసారి మీ ఫిజిషియన్‌ను లేదా ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకొని తగిన  చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ ప్రవీణ్ రావు
సీనియర్ ఆర్థోపెడిక్ - జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement