
ముంబై: నేటికీ మన దేశంలో రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సందేహించే అమ్మాయిలు ఎక్కువగానే ఉన్నారు. నెలసరి సమయంలో ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారే తప్ప ఆ బాధను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. పీరియడ్స్‌లో అటు గృహిణులకు, ఇటు ఉద్యోగినులకు గానీ ప్రత్యేకంగా సెలవులేమీ దొరకవు. నొప్పి భరిస్తూనే ఇంట్లో పనులు చక్కదిద్దుకోవాలి, ఆఫీసులో వర్క్ చేస్తూనే ఉండాలి. చాలా మంది మగవాళ్లు సైతం.. నెలసరి సమయంలో ఇంట్లోని ఆడవాళ్లు కష్టపడుతూ పనిచేసుకుంటుంటే చూస్తారే తప్ప సాయం చేయడానికి ముందుకురారు. ఇది చాలా తప్పు అంటున్నాడు హిందీ బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం.
లాక్‌డౌన్ కాలంలో షూటింగ్ లేకపోవడంతో ఇంటికే పరిమితం కావడం వల్ల చాలా మంది సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ చానెళ్లు మొదలుపెట్టి, వ్లోగ్స్ చేయడం ఆరంభించారు. వారిలో ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ జంట దీపికా కక్కర్- షోయబ్ కూడా ఉన్నారు. కలిసి నటిస్తున్న సమయంలో స్నేహితులుగా మారిన వీరు 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో కపుల్ గోల్స్ సెట్ చేస్తూ గతంలో అనేకసార్లు అభిమానుల మనసు దోచుకున్నారు. ఇక తాజాగా తన వ్లోగ్‌లో పీరియడ్స్ గురించి ప్రస్తావించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు షోయబ్.(చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక)
నెలసరిలో ఉన్న భార్య దీపిక కోసం వంట చేసి, ఆమెకు వడ్డించిన అతడు.. తన అభిమానులు కూడా ఇలాగే రుతుక్రమ సమయంలో ఇంట్లో వాళ్లకు సాయం చేయాలని అభ్యర్థించాడు. అలాగే పీరియడ్స్ గురించి మాట్లాడితే తప్పేమీ కాదన్నాడు. శరీరంలో సహజసిద్ధంగా కలిగే మార్పుల గురించి, తద్వారా కలిగే ఇబ్బందుల గురించి చర్చిస్తేనే విశ్రాంతి తీసుకునే వెసలుబాటు ఉంటుందని లేడీ ఫ్యాన్స్‌కు సైతం సలహా ఇచ్చాడు. ఇక ఆస్క్ మీ ఎనీథింగ్ క్వశ్చన్ అవర్‌లో భాగంగా.. తన భార్య నవ్వు నకిలీది అంటూ కామెంట్ చేసిన నెటిజన్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు షోయబ్. ‘‘నా దీపిక నవ్వుకు నువ్వు దిష్టిపెట్టకు. ఎందుకంటే తన స్మైల్‌కే నేను పడిచచ్చిపోతాను. మా గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. ఏది పడితే అది మాట్లాడకు సరేనా!’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment