ముందు బరువు తగ్గండి...
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 24 ఏళ్లు. పెళ్లయి మూడేళ్లు అవుతోంది. ఇంకా గర్భం రాలేదు. నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. నా బరువు 87 కిలోలు. పీరియడ్స్ క్రమబద్ధం కావడం కోసం, గర్భం దాల్చడం కోసం కొన్ని నెలలుగా చాలామంది డాక్టర్లను సంప్రదించాను. వారు పీసీఓఎస్ ఉందని అన్నారు. ఎన్నో రకాల మందులు వాడాను. కాని ప్రయోజనం లేదు. నా విషయంలో తగిన సలహా ఇవ్వండి.
- నాగమణి, వరంగల్
పీసీఓఎస్ అనేది హార్మోన్ల అసమతౌల్యత వల్ల వచ్చే కండిషన్. మహిళలల్లో దాదాపు 10 - 15 శాతం మందిలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఇది జన్యుపరంగా, వంశపారంపర్యంగా కూడా కుటుంబంలో కనిపిస్తుంటుంది. ఈ కండిషన్ ఉన్నవారిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటాయి. (అండం పెరుగుదల ఉండదు). కొన్ని మందులు వాడటం ద్వారా రుతుక్రమాన్ని సరిదిద్దవచ్చు. అయితే మందులు వాడటం మానేస్తే మళ్లీ రుతుక్రమం దెబ్బతింటుంది.
చాలామందిలో ఈ పరిస్థితిని శాశ్వతంగా నయం చేయడం అంతగా కుదరకపోవచ్చు. సంతాన సాఫల్యం కలిగించే విషయంలో అండాల పెరుగుదల కోసం కొన్ని ట్యాబ్లెట్లు, హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావచ్చు. అయితే ఇలాంటి చికిత్సలకు ముందుగా మీరు బరువు తగ్గడం అవసరం. ఇప్పుడు మీ బరువులో కనీసం 10 శాతమైనా తగ్గాలి. ఇలా బరువును నియంత్రించుకొని తగిన మందులు వాడేవారిలో కనీసం 65 నుంచి 75 శాతం మంది గర్భం దాల్చుతారు. మిగతా వారిలో లాపరోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ లేదా ఐవీఎఫ్‌తో ప్రయోజనం ఉండవచ్చు. మీరు ముందుగా కనీసం తొమ్మిది కిలోల బరువు తగ్గి... ఆ తర్వాత ఫెర్టిలిటీ చికిత్స తీసుకోండి. సానుకూల ఫలితాలు కనిపించవచ్చు.
నా వయసు 32 ఏళ్లు. నాకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. పిల్లలకోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల నేను వీర్య పరీక్ష చేయించుకుంటే అందులో శుక్రకణాలు లేవని తెలిసింది. మాకు తగిన సలహా ఇవ్వడండి.
- నాగేశ్వరరావు, విశాఖపట్నం
పురుషుల వీర్యంలో శుక్రకణాలు లేని కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. దీనికి శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా లేకపోవడం లేదా ఉత్పత్తి అయిన శుక్రకణాలు ప్రయాణం చేసే దారిలో ఏదైనా అడ్డంకి ఉండటం కారణాలు కావచ్చు. అయితే మీలాంటి కేసుల్లో మరల మరల ఇదే పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత మీరు కొన్ని వైద్య పరీక్షలు... అంటే హార్మోనల్ అల్ట్రాసౌండ్, క్యారియోటైపింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. మీ కండిషన్‌కు తగిన కారణాన్ని నిర్ధారణ చేసుకోవాలి. హార్మోనల్ సప్లిమెంట్స్ ద్వారా శుక్రకణాల సంఖ్య పెంచవచ్చు. అప్పటికీ సాధ్యంకాకపోతే ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) విత్ టెస్టిక్యులార్ స్పెర్మ్ యాస్పిరేషన్‌తో చికిత్స చేయవచ్చు. అంటే ఈ ప్రొసీజర్‌లో నేరుగా టెస్టిస్ నుంచి శుక్రకణాలు సేకరిస్తారు. అయితే అన్ని కేసుల్లో ఇలా శుక్రకణాల సేకరణ సాధ్యం కాకపోవచ్చు. అదీ సాధ్యం కాకపోయినా మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి.
- డాక్టర్ ప్రీతీ రెడ్డి
కన్సల్టెంట్ ఇన్‌ఫెర్టిలిటీ, బర్త్ రైట్ బై రెయిన్‌బో, బంజారాహిల్స్, హైదరాబాద్