తెలుపు అవుతోంది, ప్రమాదమా?
నా వయసు 24. పెళ్లికాలేదు. నాకు ప్రతిరోజూ కొంచెం తెల్లబట్ట అవుతోంది. కేవలం పీరియడ్స్ ముందు మాత్రమే అలా అవుతుంటుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇదేమైనా సమస్యకు సూచనా? ఇలా ఎందుకు అవుతోంది? నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- మను, ఈ-మెయిల్
పెళ్లికాని అమ్మాయిల్లో తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయ ముఖద్వారంలో, యోనిభాగంలో మ్యూకస్‌గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి హార్మోన్ల ప్రభావం వల్ల నీరులాంటి, వాసనలేని స్రావాలు విడుదలవుతుంటాయి. అవి ఎక్కువగా నెలసరికి ముందు, నెలసరి మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో వెలువడుతుంటాయి. దీనివల్ల వాసన, దురద ఉండదు. అంతేగాక ఇది హానికరం కూడా కాదు. ఇక కొందరిలో ఫంగల్, బ్యాక్టీరియల్, ట్రైకోమొనియాసిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వైట్ డిశ్చార్జి అవుతుంది. ఇది పెరుగులాగా, ముక్కలుగా, నురగలా, కొంచెం పచ్చగా ఉండి, దురద, మంట, వాసనతో ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కొంతమందిలో నులిపురుగులున్నా, వైట్‌డిశ్చార్జీ అవుతుంది. మలబద్ధకం వల్ల కూడా వైట్ డిశ్చార్జి సమస్య రావచ్చు. కొంతమందిలో రక్తహీనత వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల కూడా ఇదే సమస్య రావచ్చు. ఈకాలం అమ్మాయిలు బిగుతైన దుస్తులు, జీన్స్, నైలాన్ ప్యాంటీస్ వంటివి ఎక్కువగా ధరిస్తున్నారు. దాంతో జననాంగాలకు గాలిసోకక, ఆ ప్రాంతంలో చెమట ఎక్కువగా పట్టి ఇన్ఫెక్షన్స్‌కు దారితీయవచ్చు. జననాంగాల వద్ద ఉండే రోమాలను రెండువారాలకొకసారి తొలగించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు కొందరు యాంటీసెప్టిక్ లోషన్స్‌తో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేసుకుంటుంటారు. ఇలా యాంటీసెప్టిక్ లోషన్స్‌తో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడం సరికాదు. దానివల్ల యోనిభాగంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (లాక్టోబాసిలై) నశిస్తాయి. ఇవి యోనిలో స్రావాలు సరైన ‘పీహెచ్’ పాళ్లలో ఉండేలా చూసి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంటాయి. మీరు అక్కడ శుభ్రం చేసుకోవడం కోసం మార్కెట్‌లో దొరికే లాక్టోబాసిలైతో కూడిన ‘ఫెమినైన్ వాష్’లను వాడుకోవచ్చు.
ఇక ఆహారంలో తీసుకునే పెరుగులో కూడా లాక్టోబాసిలై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ లాంటివి ఎక్కువగా వాడటం కూడా మంచిదే. లోదుస్తులుగా కాటన్ ప్యాంటీస్ వాడటం వల్ల, వాటికి చెమటను పీల్చుకునే గుణం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అవకాశాలు తగ్గుతాయి. రాత్రివేళ ప్యాంటీస్ ధరించకుండా ఉండటం మంచిది. అవసరమైతే పగటిపూట జననాంగాల వద్ద యాంటీఫంగల్ పౌడర్ చల్లుకోవచ్చు. పుష్కలంగా మంచినీళ్లు తాగడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్,
మోతీనగర్, హైదరాబాద్
గైనకాలజీ కౌన్సెలింగ్
Published Sun, Jul 12 2015 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement