వరుసగా అబార్షన్స్‌...సంతానం  కలుగుతుందా?  | There are many reasons for infections Leading to miscarriage | Sakshi
Sakshi News home page

వరుసగా అబార్షన్స్‌...సంతానం  కలుగుతుందా? 

Published Thu, Mar 28 2019 2:16 AM | Last Updated on Thu, Mar 28 2019 2:16 AM

There are many reasons for infections Leading to miscarriage - Sakshi

నా వయసు 33 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడుసార్లు అబార్షన్‌ అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? 

మీకు జరిగినట్లు ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌’గా పేర్కొంటారు. 
కారణాలు:
►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని...

►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం)

►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్‌ ఉండటం

►గర్భాశయపు సర్విక్స్‌ బలహీనంగా ఉండటం

►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు 

►కొన్ని ఎండోక్రైన్‌ వ్యాధులు 

►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం 

►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. 

చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే  గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

వేరికోస్‌వెయిన్స్‌తగ్గుతాయా?

నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? 

మీకు ఉన్న సమస్య వేరికోస్‌ వెయిన్స్‌. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్‌ వెయిన్స్‌ అంటారు. ఇందులో శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల  రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు.

ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్‌ వెయిన్స్‌ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్‌ వెయిన్స్‌ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 

కారణాలు:  
►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం

►కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు

►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. 

లక్షణాలు:
​​​​​​​►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం

​​​​​​​►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం

​​​​​​​►చర్మం దళసరిగా మారడం

​​​​​​​►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం 

వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్‌ డాప్లర్‌ అల్ట్రా సౌండ్‌. 

చికిత్స: వేరికోస్‌ వెయిన్స్, వేరికోసిల్‌ వంటి వ్యాధులకు అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబా
ద్‌ 

స్పాండిలోసిస్‌కు పరిష్కారం ఉందా? 

నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్‌ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? 

ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్‌ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అని, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అని పేర్కొంటారు. 

కారణాలు:
►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్‌ ఉంటాయి. ఈ జాయింట్స్‌ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు

►జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల  

►స్పైన్‌ దెబ్బతినడం వల్ల

►​​​​​​​వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. 

లక్షణాలు: సర్వైకల్‌ స్పాండిలోసిస్‌: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. 

లంబార్‌ స్పాండిలోసిస్‌: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. 

నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. 

చికిత్స: రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది.

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement