పాజ్‌టివ్‌గా..! | think possitive | Sakshi
Sakshi News home page

పాజ్‌టివ్‌గా..!

Published Wed, Apr 20 2016 11:02 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

పాజ్‌టివ్‌గా..! - Sakshi

పాజ్‌టివ్‌గా..!

పాజ్ అంటే కాస్తంత గ్యాప్. అంతేగానీ అది ఫుల్ స్టాప్ కాదు. మళ్లీ మరింత ఫలవంతమైన జీవితానికి ముందుగా వచ్చే ఆ గ్యాప్‌నకు ముందు టైమ్‌ను పెరీమెనోపాజ్ అంటారు. నిజానికి మెనోపాజ్ కూడా ఫుల్‌స్టాప్ కాదు. మరింత ఫలవంతమైన కాలానికి ముందు వచ్చే కొన్ని  కుదుపుల్ని అధిగమించడమే! అది ఎలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

అడ్వటైజింగ్ ప్రొఫెషనల్ నేత్రా షా కి 37 ఏళ్లు. అప్పటివరకు చలాకీగా, ఆడుతూ పాడుతూ పని చేస్తూ, చుట్టూ ఉన్న వాళ్లతో ఛలోక్తులు విసురుతూ ఎంతో సరదాగా ఉండే నేత్రా షా ఈ మధ్య ఎందుకనో బాగా డీలాపడిపోయింది. పిరియడ్స్ సరిగా రాకపోవడం, బరువు పెరగడంతోబాటు లైంగిక జీవనంలో కూడా స్తబ్ధత ఏర్పడింది. ఈ మార్పులన్నీ కూడా మానసిక ఒత్తిడి లేదా పనిభారం పెరగడం వల్లనే కాబోలు, కొద్దిరోజుల్లోనే సర్దుకుంటాయిలే అనుకుని సరిపెట్టుకుంది. అయితే ఆమె అనుకున్నట్లు సర్దుకోకపోగా, రానురానూ మరింత మందకొడిగా తయారైంది. దాంతో గైనకాలజిస్టును కలిసింది. కొన్ని ప్రశ్నలు, మరికొన్ని పరీక్షల అనంతరం డాక్టర్ చెప్పిన విషయమేమిటంటే, ఆమె పెరి మెనోపాజ్‌లో అడుగుపెట్టడం వల్లే ఈ మార్పులనీ, మందులు వాడటం కన్నా జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం వల్లే మేలు కలుగుతుందనీ హితబోధ చేసింది. డాక్టర్ చెప్పినట్లే చేయడంతో త్వరలోనే నేత్రాకు పరిస్థితులన్నీ అదుపులోకొచ్చాయి.

మెనోపాజ్ ముందు దశలో ఇలా ఉంటుంది: పెరి మెనోపాజ్ గురించి గైనకాలజిస్ట్ డాక్టర్ సుమన్ బిజిలాని ఏమంటారంటే రుతుక్రమం అంతరించే దశ (మెనోపాజ్)కు కొద్ది సంవత్సరాలకు ముందే సహజంగా శరీరం ఆ దశకు చేరుకోవడానికి కావలసిన మార్పులు జరగడం మొదలవుతుంది. ఈ క్రమంలో స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం మెనోపాజ్‌కు అవసరమైన మార్పులను సంతరించుకోవడం మొదలవుతుంది. ఈ మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటాయి. కొందరికి ఈ దశ సౌకర్యంగా అనిపిస్తే, మరికొందరికి దుర్భరంగా అనిపించవచ్చు.

రుతుచక్రంలో మార్పులు చోటు రావడమనేది అందరిలోనూ కామన్‌గా ఉండే అంశం. తొందర తొందరగా మూడ్స్ మారిపోతుండడం, లైంగిక జీవనం పట్ల విముఖత పెరగడం లేదా కొందరిలో కొత్తకోరికలు మొగ్గతొడగటం జరగవచ్చు. నిద్రలోనూ, జీర్ణక్రియలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే అతినిద్ర లేదా నిద్రలేమి, ఆకలి పెరగడం లేదా మందగించడం, బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, నిస్త్రాణ, నిస్సత్తువ వంటి లక్షణాలు ఉంటాయి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం ఎక్కువమందిలో కనిపించే అంశం. పెరిమెనోపాజ్‌ను నిర్ధారించడానికి నిర్దిష్టమైన పరీక్షలు కానీ, పరీక్షాప్రక్రియలు కానీ ఏమీ ఉండకపోయినప్పటికీ, 40లలోకి అడుగుపెడుతుండగానే ప్రతి స్త్రీ తప్పనిసరిగా థైరాయిడ్, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి, విటమిన్ పరీక్షలు, క్యాల్షియం తగిన మోతాదులో ఉందో లేదో నిర్థారించుకునే కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

మెనోపాజ్ దశకు చేరుకోవడానికి రెండునుంచి ఐదేళ్ల ముందుగానే రుతుచక్రంలో మార్పులు అంటే పిరియడ్స్ సరిగా రాకపోవడం లేదా నెలకు రెండుమూడుసార్లు రావడం, అధిక రక్తస్రావం, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం లేదా తగ్గడం, గుండె అమిత వేగంగా కొట్టుకోవడం, జుట్టు ఊడిపోవడం లేదా మాడు కనిపించేంతగా పలచబడటం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయనీ, వీటి ఆధారంగా పెరి మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టినట్లు తెలుసుకోవాలని డాక్టర్ శ్వేతా అగర్వాల్ చెబుతున్నారు.  
 


భారతీయ స్త్రీలలో మెనోపాజ్ వయసు తగ్గిపోతోంది!
భారతీయ స్త్రీలలో మెనోపాజ్ దశకు చేరే సగటు వయసు 47. ఇదే పాశ్చాత్య దేశాలలో అయితే 51. గడిచిన దశాబ్దకాలంలో ఇందుకు సంబంధించిన తీరుతెన్నులను పరిశీలిస్తే... ఆధునికతలో పడి తిండి, నిద్ర వేళల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకోవడం, ఉరకలు పరుగుల జీవన శైలి, ఎక్కువవుతున్న పనిగంటలు, పనిభారం, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మల్టీనేషనల్ కంపెనీలలో పని చేసే కొందరు వర్కింగ్ ఉమెన్ స్మోకింగ్, డ్రింకింగ్  వంటి వాటికి అలవాటు పడుతుండటం కూడా మెనోపాజ్ సగటు వయసు తగ్గిపోవడానికి ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలినట్లు డాక్టర్ బిజ్లానీ చెబుతున్నారు. పీసీఓడీ, ఒత్తిడి, జీవనశైలి మార్పులు కూడా ఇందుకు దారి తీసే అంశాలని డాక్టర్ అగర్వాల్ అంటున్నారు.

 
ఎలా ఎదుర్కోవాలంటే... జీవనశైలిలో తగిన మార్పులు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే వాటిని మానివేయడం, ఆహారంలో తగిన పాళ్లలో క్యాల్షియం, డీ విటమిన్ ఉండేలా చూసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం వంటి వాటి ద్వారానే ఈ దశను సమర్థంగా ఎదుర్కోవచ్చంటారు డాక్టర్ శ్వేత.

 
పెరిమెనోపాజ్ అనేది ఒక దశే కానీ, రుగ్మత కాదు కాబట్టి దీనికి చికిత్స అవసరం లేదని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం, ధ్యానం లేదా యోగా, ఆటపాటలతో శరీరాన్ని, మనస్సును చురుగ్గా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవడం, కుటుంబసభ్యుల సహకారం తీసుకోవడం అవసరం. జీవనక్రమంలో మార్పులు అనేవి సహజమనీ, అవి వాటంతట అవే సర్దుకుపోతాయనే సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవడం అవసరమంటారు అగర్వాల్. అయితే బీపీ, సుగర్, క్యాన్సర్, హృద్రోగం వంటి ప్రమాదకరమైన వ్యాధులు చాపకింద నీరులా వ్యాపించేందుకు అవకాశమున్న వయసు కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలను అధిగమించేందుకు అవకాశముందంటున్నారు గైనకాలజిస్ట్‌లు డాక్టర్ బిజ్లాని, డాక్టర్ అగర్వాల్‌లు.                  

 

 
35 సంవత్సరాలు దాటిన భారతీయ స్త్రీలలో పెరిమెనోపాజ్ లక్షణాలు కనిపించడం వారు మెనోపాజ్ దశలో అడుగుపెట్టనున్నారని చెప్పడానికి శరీరం చేసే సహజసిద్ధమైన హెచ్చరికలు. అయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దీనిని నిర్ణయిస్తాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement