
రుతుస్రావం సమయంలో నొప్పి రావడం కొత్తగా యుక్తవయసులోకి వచ్చిన ఎందరో అమ్మాయిలకు వచ్చే అతి సాధారణ సమస్య. చెప్పుకోడానికి ఇది చాలా సాధారణమే అయినా నొప్పి మాత్రం అసాధారణం. ఆ సమయంలో వారు నరకం చూస్తుంటారు. సాధారణంగా చాలామందిలో తమ 25 ఏటికి వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే ఈ నొప్పి కొంతకాలం పాటు వారినీ, వారి భావోద్వేగాలనూ, కుటుంబ సభ్యులతో వారి సంబంధాలను సైతం ప్రభావితం చేసేంత తీవ్రంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ పెయిన్ గురించి అవగాహన కోసం ఈ కథనం.
సాధారణంగానే ఆడపిల్లలు తమ బాల్యం నుంచి యవ్వనావస్థలోకి వచ్చే సమయంలో చాలా ఎక్కువ ఆందోళనకు గురవుతుంటారు. దానికి కారణాలు చాలానే ఉంటాయి. ప్రకృతిసహజంగా ఆ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కొత్త హార్మోన్లతో వచ్చే ఎన్నెన్నో మార్పులు... అంతకుముందు వారు అనుభవించిన హాయి జీవితం నుంచి... అకస్మాత్తుగా వారిని అయోమయంలోకి నెట్టేస్తాయి. దీనికి తోడు వారిలో కొత్తగా మొదలయ్యే రుతుస్రావం ఒక చికాకు అయితే... కొందరిలో ఆ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తూ వారి టీన్స్ జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. పైగా మన సమాజంలో ఆ సమయంలో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇంకా ఇబ్బందులకు లోనవుతారు. అందుకే చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ విషయంలో చాలా చికాకు పడతారు. పీరియడ్స్ అంటే తమకు ఎంతో ‘కోపం’ అని కోపంగా చెప్తారు. వారి సమస్యను గుర్తించే ఇటీవల కొన్ని ప్రభుత్వాలు వారికి ఆ సమయంలో సెలవులు సైతం మంజూరు చేస్తున్నాయి.
పీరియడ్స్‌లో నొప్పి ఎందరిలో సహజమంటే...
కొత్తగా రజస్వల అయిన దాదాపు 50 శాతం టీనేజర్లు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపులో నొప్పి, ఇతరత్రా ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. వీళ్లలో దాదాపు 5 నుంచి 10 శాతం వరకు... తమకు వచ్చే అత్యంత తీవ్రమైన కడుపునొప్పి కారణంగా వారు స్కూల్/కాలేజీలకు హాజరు కాలేరు.
పీరియడ్స్ సమయంలో వచ్చేనొప్పి సాధారణంగా 15వ ఏట ప్రారంభమై, 25 – 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి తగ్గిపోతుంది. కొందరికి... పెళ్లయ్యి, పిల్లలు పుట్టాక తగ్గిపోతుంది. అందువల్ల ఆ నొప్పి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. కాకపోతే నొప్పి వచ్చిన సమయంలో కొన్ని మందులు వాడితే సరిపోతుంది. కొన్ని కుటుంబాలలో తల్లి, పిల్లలు కూడా ఈ నొప్పితో బాధపడుతుంటారు.
లక్షణాలు
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ కడుపులోనొప్పి... ముందుగా పొత్తికడుపులో మొదలయ్యి, కొన్ని గంటల పాటు బాధిస్తుంది. ఒక్కోసారి అది ఆ మర్నాడే తగ్గుతుంది. ఈ నొప్పి పొత్తికడుపు, పెల్విస్, నడుము భాగాలలో అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ నొప్పి కాళ్లవర కూ వ్యాపిస్తుంది. నొప్పి నెమ్మదిగా ప్రారంభం అయ్యి, క్రమేపీ పెరుగుతుంది. కొందరిలో తలతిరిగిన ట్టు ఉంటుంది. మరికొందరిలో వాంతులు అవుతాయి. ఇంకొందరు బాగా నీరసపడి, ఒక్కోసారి స్పృహకోల్పోతారు కూడా. అరుదుగా కొందరిలో... ఈ నొప్పి ప్రారంభమయ్యి, నాలుగు రోజుల వరకూ బాధిస్తూనే ఉంటుంది.
కారణాలు
ఈ నొప్పికి కారణాల విషయానికి వస్తే... యుటెరస్‌కి రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో ఒక రకమైన రసాయనం విడుదల కావడం వల్ల, రక్తనాళాలు హఠాత్తుగా బిగుసుకుపోతాయి. అందువల్ల ఆయా భాగాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతాయి. ఈ సమయంలో... యూటెరస్, పెల్విక్ మజిల్స్ తాలూకు జీవక్రియల్లోనూ మార్పులు వస్తాయి. అక్కడి మెటబాలిజమ్ (జీవక్రియల్లో)లో వెలువడే వ్యర్థపదార్థాలయిన... కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ వంటివి ఈ కడుపునొప్పికీ, అసౌకర్యానికీ కారణమవుతాయి.
ఉపశమనం ఇలా...
వేడినీటితో కాపడం పెడితే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా ఉపశమనం లభించకపోతే, నొప్పి నివారణ మందులు వేసుకోవాలి. అయితే ఈ మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తీసుకుంటే మంచిది. పారాసిటమాల్, ఆస్పిరిన్, మెఫ్తాల్ వంటి మందులు నొప్పిని చాలావరకు తగ్గిస్తాయి. యాంటీ స్పాస్మోడిక్స్ ప్రయత్నించవచ్చు. ఇవి యూటెరస్ కండరాలను రిలాక్స్ చేస్తాయి. తరచూ ఈ నొప్పితో బాధపడేవారు డాక్టర్ సలహా మేరకు తగిన మందులు దగ్గర ఉంచుకుంటే మంచిది. అయితే ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించాక కూడా నొప్పి వస్తూనే ఉంటే మీ గైనకాలజిస్ట్‌ను / ఫ్యామిలీ ఫిజీషియన్‌ను సంప్రదించాలి.
మేనేజ్‌మెంట్ / చికిత్స
♦ చికిత్స కంటే ముందుగా... వారిలో ఈ నొప్పి రావడానికి గల కారణాలు, చికిత్సల గురించి అర్థమయ్యేలా వివరించాలి. ఉపశమనానికి కొన్ని సులువైన మార్గాలను ఎంచుకోమని సూచించాలి.
♦ తగినంత వ్యాయామం అవసరం..ఏమాత్రం శారీరక కదలికలు లేకుండా ఒకేచోట కూర్చోవటం వల్ల క్రాంప్స్ రావడానికి అవకాశాలెక్కువ. అందుకే శరీరానికి తగినంత వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఆరుబయట ఆడటం కూడా మంచిదే.
♦ పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. వీలైనంతవరకు జంక్‌ఫుడ్ తినకూడదు. అన్ని రకాల పోషకాలూ,తగినంత పీచు ఉండే ఆహారం తీసుకోకపోతే, మలబద్దకం, పీరియడ్స్ సమయంలో క్రాంప్స్ రావడానికి అవకాశం ఎక్కువ.
♦ అధికబరువు కూడా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పికి ఒక కారణం.
♦ వీలైనంతగా విశ్రాంతి తీసుకోండి. రాత్రి కంటినిండా నిద్రపొండి. దాంతో జీవక్రియలు సవ్యంగా జరుగుతాయి. నిరంతరం పాజిటివ్‌గా ఉండాలి. అందువల్ల కొంతవరకు ఈ నొప్పి బారి నుంచి బయటపడవచ్చు. అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడి వల్ల ఎక్కువ బాధపడవలసి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment