నా వయసు 37 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆయాసంగా ఉంటుంది. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? నా సమస్య ఏమిటన్నది దయచేసి వివరంగా చెప్పండి. – కె. పారిజాత, పాయకరావుపేట
మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమా అని చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమా అనే దాన్ని రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం కొంతమంది మహిళల్లో కనిపించిన దాఖలాలు ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. అయితే అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవేపాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. దాంతో ఆస్తమా పెచ్చరిల్లుతుంది. రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమా కండిషన్‌ను ప్రేరేపిస్తాయి. అందుకే... రుతుక్రమానికి ముందుగా వచ్చే ఆస్తమా విషయంలో దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. చాలామంది రోగులు ల్యూటియల్ దశగా పేర్కొనే అండం ఆవిర్భవించే దశ నుంచి అది ఫలదీకరణ చెందనందువల్ల రుతుసమయంలో పడిపోయే సమయంలో వచ్చే ఆస్తమాకు గాను, మామూలుగా ఆస్తమాకు వాడే మందులనే అత్యధిక మోతాదుల్లో ఇస్తే ఉపశమనం పొందుతారు. ఇక మిగతావారిలో కండలోకి ప్రోజెస్టెరాన్ ఇంజెక్షన్ ఇస్తే... కాస్త మెరుగవుతారు. కాబట్టి మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికే చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకని మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి.
ఇది ఏ రకం టీబీ?
పల్మునాలజీ కౌన్సెలింగ్
మా నాన్నగారికి మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉన్నాయి. మొదట్లో ఆయనకు పల్మునరీ ట్యూబర్క్యులోసిస్ అనే జబ్బు వచ్చింది. అయితే ఆయన చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. – సోమేశ్, కందుకూరు
ఎమ్‌డీఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం. అంటే తొలిదశ మందులకు లొంగని రకానికి చెందిన టీబీ అని చెప్పవచ్చు. మొదట మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి.
ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్‌డ్ అనీ, కల్చర్ బేస్‌డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్‌డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండేశ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండేశ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి.
డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్
పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment