సందేహం: ఆ ప్రభావం బిడ్డపై ఉంటుందా ?
1. నా వయసు 20 సంవత్సరాలు. నెలసరి సమయంలో నాకు నొప్పి వచ్చి జ్వరం వచ్చినట్లు అవుతుంది. రక్తస్రావం అవుతుంది. చాలా నీరసంగా ఉంటుంది. ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుంది? పరీక్షలు ఏమైనా చేయించుకోవాలా? –కె.కె., నంద్యాల
జవాబు: పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఆ సమయంలో ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అనేక రకాల లక్షణాలు రకరకాల తీవ్రతలో కనిపిస్తుంటాయి. ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి విడుదలయ్యే మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. కొంతమందిలో ఆ సమయంలో పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, నడుంనొప్పి, తలనొప్పి వంటి అనేక లక్షణాలు ఉండవచ్చు. సక్రమంగా వాకింగ్, వ్యాయామాలు, యోగ, మెడిటేషన్ వంటివి చెయ్యడం వల్ల చాలామటుకు పైన చెప్పిన లక్షణాల తీవ్రత తక్కువగా అనిపిస్తుంది.
లేకపోతే ఆ రెండు మూడు రోజులకు ప్రతి నెలా నొప్పి నివారణ మాత్రలు, వాంతులకు మాత్రలు వాడి చూడవచ్చు. కొందరిలో గర్భాశయంలో కంతులు, వాపు, ఇన్‌ఫెక్షన్, ఇతర సమస్యలు వంటివి ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి, బ్లీడింగ్, ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. వీటి నిర్ధారణకు పెల్విక్ స్కానింగ్ చెయ్యించుకుని, సమస్య ఏమన్నా ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకొని చూడవచ్చు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఒంట్లో రక్తం తగ్గి రక్తహీనత ఏర్పడి తొందరగా నీరసపడటం, అలసిపోవటం ఉంటుంది. ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) పరీక్ష చెయ్యించుకుని, రక్తహీనత ఉంటే, ఐరన్ మాత్రలు, విటమిన్ మాత్రలు వాడటం వల్ల నీరసం తగ్గుతుంది.
2. నా వయసు 24 సంవత్సరాలు. నాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతుంది. మూడో తరం మేనరికం మాది. మాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. వైజాగ్‌లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐయూఐ టెస్ట్ చేసి నాకు ఓకే అన్నారు. మా ఆయనకి కూడా స్పెర్మ్ కౌంట్ సరిపోయింది అన్నారు. అయినప్పటికీ ఇంకా మాకు పిల్లలు పుట్టడం లేదు. దీనికి కారణం మేకరికమేనా? లేదా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యామ్నాయ పరిష్కారం ఏదైనా ఉందా? దయచేసి తెలియజేయగలరు. –లక్ష్మీ, శ్రీకాకుళం
జవాబు: గర్భం నిలబడాలంటే అండం విడుదల, స్పెర్మ్ కౌంట్ సరిగా ఉండటంతో పాటు, హార్మోన్ల సమతుల్యత, గర్భాశయం సరిగా ఉండటం వంటి ఎన్నో అంశాలు సరిగా ఉండాలి. మీకు అన్నీ పరీక్షలు సరిగా ఉన్నా, గర్భం నిలబడట్లేదు. కొందరిలో ఐయూఐ టెస్ట్‌లో శుక్ర కణాలను నేరుగా గర్భాశయం లోపలి పొరలోకి చిన్న ప్లాస్టిక్ సిరెంజ్ ద్వారా ప్రవేశపెట్టడం... ఇలా చేసినా కూడా శుక్రకణాలు, ట్యూబ్‌లోకి ప్రవేశించి, వాటంతట అవే అండంలోకి ప్రవేశించి, ఫలదీకరణ జరపవలసి ఉంటుంది. తద్వారా పిండం ఏర్పడుతుంది.
కొందరిలో ఈ ఫలదీకరణ ప్రక్రియ, అండం లేక శుక్ర కణం నాణ్యత సరిగా లేకపోవడం వంటివి; ఇంకా తెలియని కారణాల వల్ల జరగకపోవచ్చు. అలాంటప్పుడు కూడా గర్భం రాకపోవచ్చు. ఒకవేళ ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడినా, పిండాన్ని గర్భాశయం స్వీకరించకపోవచ్చు. అలాంటప్పుడు పిండం పెరగలేక నశించిపోయి పీరియడ్ వచ్చేస్తుంది. ఈ సమస్య ఎందువల్ల వచ్చింది అని తెలుసుకోవటానికి పరిశోధనలు ఎన్ని పరీక్షలు చేసినా, కారణం, దాని చికిత్సను పూర్తిగా, సరిగా కనుగొనలేకపోయారు. ఈ రకం సమస్యను అధిగమించడానికి డాక్టర్లు రకరకాల చికిత్స విధానాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిలో భాగంగా ఐయూఐ ఒక్కసారిగా ఆపకుండా కనీసం మూడుసార్ల వరకు ప్రయత్నం చేసి చూడవచ్చు.
అప్పటికి కూడా గర్భం రాకపోతే, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మరలా ఒకసారి విశ్లేషించుకుని, దానికి తగ్గట్లు చికిత్సలో మార్పుచేసి, అవసరమైతే ల్యాపరోస్కోపి చేసుకుని, మరొక మూడుసార్లు ఐయూఐ ద్వారా ప్రయత్నం చేయవచ్చు. దీని ద్వారా 20 నుంచి 30 శాతం గర్భం రావచ్చు. తర్వాత కూడా గర్భం అందకపోతే ఐయూఎఫ్ (టెస్ట్ ట్యూబ్ బేబి) పద్ధతిని అనుసరించవచ్చు. ఐయూఎఫ్‌లో కూడా 40% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. మేనరికం వల్ల కొందరిలో అబార్షన్లు అవ్వడం, పిల్లలలో అవయవ లోపాలు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అంతేకాని మేనరికం వల్ల గర్భం దాల్చటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
3. గతంలో నేను మా ఆయనతో పాటు ఆల్కహాల్ తీసుకునేదాన్ని. అయితే ఆల్కహాల్ తీసుకోవడం మానేసి సంవత్సరం దాటింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ఒకప్పటి బ్యాడ్ హ్యాబిట్ ప్రభావం కడుపులో బిడ్డపై ఉంటుందా? అలా ఉండకుండా ఉండాలంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. –ఎన్.యస్, సికింద్రాబాద్
జవాబు: సాధారణంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే, బిడ్డలో అవయవ లోపాలు, మానసిక శారీరక ఎదుగుదలలో లోపాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఆల్కహాల్ తీసుకోవటం మానేసి సంవత్సరం దాటింది. కాబట్టి ముందు తీసుకున్న ఆల్కహాల్ వల్ల, బిడ్డపై ప్రభావం ఏమి ఉండదు.