చాకొలెట్‌ సిస్టులు అంటే..? | sakshi health counseling | Sakshi
Sakshi News home page

చాకొలెట్‌ సిస్టులు అంటే..?

Published Sat, Feb 11 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

చాకొలెట్‌ సిస్టులు అంటే..?

చాకొలెట్‌ సిస్టులు అంటే..?

పీరియడ్స్‌ సమయంలో నొప్పి వస్తుంది. ఈ సమస్య గురించి మా బంధువు ఒకరితో చెబితే...‘చాకొలెట్‌ సిస్టులు ఉండొచ్చు’ అన్నారు. అసలు ‘చాకొలెట్‌ సిస్టులు’ అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? మందులతో తగ్గిపోతాయా?
– డి.పరమేశ్వరి, డోర్నకల్‌

పీరియడ్స్‌ సమయంలో గర్భాశయంలోని ఎండోమెట్రియమ్‌ పొర చిన్న చిన్న ముక్కలుగా బ్లీడింగ్‌ ద్వారా యోని నుంచి బయటకు వచ్చేస్తుంది. కొందరిలో ఎండోమెట్రియమ్‌ పొర గర్భాశయంలో నుంచి, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. కొందరిలో మెల్లగా అదే కరిగిపోతుంది. కాని కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి, అనేక రకాల తెలియని కారణాల వల్ల ఎండోమెట్రియమ్‌ పొర ముక్కలు కరిగిపోకుండా హార్మోన్ల ప్రభావం వల్ల ప్రేరేపితమై, ప్రతి నెలా పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపులోని ఎండోమెట్రియమ్‌ పొరలో కూడా కొద్ది కొద్దిగా బ్లీడింగ్‌ అయ్యి, అక్కడ రక్తం గూడు కట్టడం జరుగుతుంది. దీనినే ఎండోమెట్రియేసిస్‌ అంటారు. ఈ పొర పొత్తికడుపులో గర్భాశయం వెనుక భాగం పైన, ప్రేగుల పైన, మూత్రాశయం పైన, అండాశయాల పైన... ఇంకా ఇతర భాగాలపైన అతుక్కుని పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండాశయం పైన అతుక్కున్న ఎండోమెట్రియల్‌ పొరలో నెలనెలా బ్లీడింగ్‌ అయ్యి అందులో రక్తం కొద్దికొద్దిగా చేరి గూడు కడుతూ, రక్తం, చాక్లెట్‌ రంగులో మారి గడ్డలాగా మారుతుంది. దీనినే చాక్లెట్‌ సిస్ట్‌ అంటారు. ఈ సిస్ట్‌లు ఒకటి రెండు సెంటీమీటర్లు మొదలుకొని 10 సెంటీమీటర్ల పైన పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు లేవు. అవి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్ల ప్రభావాన్ని బట్టి, గర్భాశయం లోని కొన్ని రకాల లోపాల వల్ల రావచ్చు. వీటి వల్ల పీరియడ్స్‌ సమయంలో నొప్పి, పరిమాణం బట్టి సంతానం కలగడంలో ఇబ్బంది వంటి ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. ఇవి 3 సెం.మీ. కంటే సైజు తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోన్ల మాత్రలు, ఇంజెక్షన్ల ద్వారా కొందరిలో తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే పరిమాణం పెద్దగా ఉండి, ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆపరేషన్‌ ద్వారా తొలగించవలసి ఉంటుంది. కొందరిలో ఆపరేషన్‌ చేసి తొలగించినా, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి మరలా చాక్లెట్‌ సిస్ట్‌లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

నేను చాలా సన్నగా ఉంటాను. ప్రెగ్నెంట్‌ని. ‘ఇప్పుడు కూడా ఇలా ఉంటే ఎలా? బాగా తినాలి. నీతో పాటు... కడుపులో ఉన్న నీ బిడ్డ కోసం కూడా తినాలి. నువ్వు ఎంత ఎక్కువ తింటే కడుపులో ఉన్న బిడ్డకు అంత ఆరోగ్యం’ అని చెబుతున్నారు. నాకేమో పరిమితికి మించి తినే అలవాటు లేదు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎక్కువ తినాలి అనే దాంట్లో  ఎంత వాస్తవం ఉంది? నిజానికి గర్భిణులు ఎలాంటి పోషకాహరం తీసుకోవాలి? చెప్పగలరు.
– జి.కవిత, విజయవాడ

గర్భం దాల్చినంత మాత్రాన, ఎంత ఎక్కువ అంటే అంత తినాలని ఏమీ లేదు. 9 నెలలపాటు గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగడానికి, మామూలుగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. అంతేగాని, రెండింతలు తీసుకోవాలని లేదు. మాంసాహారులు అయితే గుడ్లు, మితంగా మాంసాహారం, చేపలు వంటివి తీసుకోవచ్చు. నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి పైన చెప్పిన పౌష్టికాహారంతో పాటు, రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ తినవచ్చు. ఒకేసారి ఎక్కువగా తినడం ఇబ్బంది కాబట్టి, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు అంటే రెండు మూడు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ ఉండవచ్చు. సాధారణ బరువు ఉండి, గర్భవతులైనవారు మామూలు పౌష్టికాహారం తీసుకొని 9 నెలల్లో 8 నుంచి 11 కేజీల వరకు బరువు పెరగవచ్చు. అధిక బరువు ఉన్నవారు 5 నుంచి 8 కేజీలు బరువు పెరిగితే సరిపోతుంది. ఈ సమయంలో అధిక బరువు పెరగడం వల్ల బీపీ, షుగర్, ఆయాసం వంటి సమస్యలు, కాన్పు సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

‘గర్భిణులు వాడే మాత్రలతో శిశువులకు ముప్పు’ అనే వార్తను ఈమధ్య ఎక్కడో చదివాను. అయితే అందులో... ‘గుండెలో మంట సమస్యకు వేసుకునే మాత్రల వల్ల శిశువుకు ఆస్థమా వచ్చే అవకాశం ఉంది’ అని ఒకటీ అరా వివరాలు మాత్రమే ఉన్నాయి. మాత్రలంటే ఏ రకమైన  మాత్రలు అనే వివరాలు లేవు. గర్భిణిగా ఉన్నవారు జలుబు, తలనొప్పి మాత్రలు... ఇలాంటివి వేసుకుంటే శిశువు మీద ఏమైనా  ప్రభావం ఉంటుందా?
– బి.స్వప్న, అనంతపురం

గర్భిణిలకు మొదటి మూడు నెలల సమయంలో శిశువులో దాదాపుగా అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కొన్ని రకాల మందులు వాడటం వలన శిశువు మీద ప్రభావం పడి, అవయవాలు సరిగా ఏర్పడకపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. ప్రెగ్నెన్సీలో వాడే మందులు వాటి దుష్ప్రభావాలను బట్టి ఎ, బి, సి, ఎక్స్‌ అనే కేటగిరీలుగా విభజించబడటం జరిగింది. ఎ, బి కేటగిరీకి చెందిన మందులను ప్రెగ్నెన్సీలో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. సి కేటగిరీ మందులను, అవి వాడకపోవడం వల్ల వచ్చే దుష్ఫలితం, వాడటం వల్ల వచ్చే రిస్క్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఎక్స్‌ కేటగిరీ మందులు ఎట్టి పరిస్థితుల్లోను వాడకూడదు. జ్వరానికి, తలనొప్పి వంటి నొప్పులకు పారసెటమాల్‌ మాత్ర వాడుకోవచ్చు. జలుబు, దగ్గుకి మిగతా సమస్యలకు డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడుకోవాలి. సొంతగా మందుల షాపులో తీసుకుని వాడరాదు. నొప్పి నివారణ మాత్రలు అంటే డైక్లోఫినాక్, వొవెరాన్‌ వంటివి గర్భిణీలు వాడటం వల్ల శిశువు, కిడ్నీలు దెబ్బతినటం, ఉమ్మనీరు తగ్గిపోవటం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసిడిటీకి మందులు డాక్టర్‌ పర్యవేక్షణలో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. వీటివల్ల శిశువులో సమస్యలు ఏర్పడినట్లు పరిశోధనలలో ఎక్కువగా తేలలేదు.

డా‘‘ వేనాటి శోభ
లీలా హాస్పిటల్‌
మోతీనగర్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement