venati sobha
-
బరువు అదుపు చేయాలంటే...
నా వయసు 48. మెనోపాజ్ దశలో బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమయంలో డైటింగ్ చేయడం మంచిదేనా? ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువును అదుపులో పెట్టుకోవచ్చు అనేది వివరంగా తెలియజేయగలరు. – కె.స్వాతి, నిర్మల్ మెనోపాజ్ దశలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల 5 శాతం వరకు పొట్ట దగ్గర.. పిరుదులు దగ్గర కొవ్వు చేరే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల శరీరం మెటబాలిజం తగ్గి కొవ్వు పెరుగుతుంది. అలాగే ఈ వయసులో పని చెయ్యటం తగ్గుతుంది. దాని వల్ల కూడా కొద్దిగా బరువు పెరుగుతారు. ఈ మార్పులు అందరిలో జరగాలని ఏం లేదు. అవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఈ వయసులో ఉండే కొన్ని బాధ్యతలు, పిల్లలు దూరంగా వెళ్లడం, బందువుల మరణాలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ప్రభావం వల్ల కూడా కొందరు బరువు పెరుగుతారు. డైటింగ్ అంటే తిండి బాగా తగ్గించడం కాదు. మితంగా తీసుకోవడం, ఈ సమయంలో బరువు పెరగకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి, ఆహారంలో అన్నం తక్కువ తీసుకోవడం, నీళ్లు బాగా తాగడం, తృణధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, కొద్దిగా పండ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. మాంసాహారులు అయితే గుడ్లు, చికెన్, మటన్, చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. అలాగే వాకింగ్, ధ్యానం, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఎముకలు దృఢపడతాయి. ఆహారంలో స్వీట్లు, బేకరీ ఐటమ్స్, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ వయసులో కొందరిలో బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి, పైన చెప్పిన ఆహార నియమాలు, వ్యాయామాలు, నీటిని కూడా అదుపులో ఉంచుతాయి. ఆహారం కొద్దిగా కొద్దిగా విభజించుకుని 5–6 సార్లుగా తీసుకోవడం మంచిది. కాఫీ, టీలు కూల్ డ్రింకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మా చెల్లెలికి పిల్లలు లేరు. తన వయసు 36. వైద్యులను సంప్రదిస్తే ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్’ అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది? భవిష్యత్‌లో పిల్లలు కనే అవకాశం ఉండదా? పూర్తి వివరాలను తెలియజేయగలరు. – బి.స్వర్ణలత, హిందూపురం సాధారణంగా ఆడవారు 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల పీరియడ్స్ ఆగిపోయి, మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కొందరిలో అనేక కారణాల వల్ల ఒవరీస్ (అండాశాయాల) పనితీరు ఆగిపోయి) 40 సంవత్సరాల కంటే ముందే పీరియడ్స్ ఆగిపోతాయి. దీనినే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ లేదా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. సాధారణంగా అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవుతుంది. అలానే అండాలు విడుదల అవుతూ ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల స్మోకింగ్, హార్మోన్స్‌లో లోపాలు ఆటోఇమ్యూన్ సమస్యలు, చిన్నతనంలో వైరల్ ఇన్ఫెక్షన్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇంకా ఎన్నో తెలియని కారణాలు వల్ల అండాశయంలోని అండాలు త్వరగా నశించిపోతాయి. అలానే అండాశయాల పనితీరు తగ్గిపోయి, ఈస్టోజన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవటం వల్ల, పీరియడ్స్ కొందరిలో 40 సంవత్సరాల కంటే ముందే ఆగిపోతాయి. మీ చెల్లెలికి ఈ సమస్య వల్ల అండాశయాల నుంచి అండాలు విడుదల అవట్లేదు. కాబట్టి సాధారణంగా పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు లేదు. కాకపోతే, వీరికి హార్మోన్ల పరీక్షలు చేసి వాటి విలువలను బట్టి, ఈవీఎఫ్ చికిత్స ద్వారా అనేకరకాల, ఎక్కువ డోస్ కలిగిన హార్మోన్స్, ఇంజెక్షన్లు, మందుల ద్వారా ప్రయత్నిస్తే.. 5–10 శాతం గర్భం నిలిచే అవకాశాలుంటాయి. అలా ప్రయత్నించినా గర్భం రాకపోతే, దాత నుంచి (డోనర్) తీసిన అండాలను ఉపయోగించి, గర్భం రావడానికి ప్రయత్నించవచ్చు. నా వయసు 29. పెళ్లి అయ్యి ఐదేళ్లు దాటుతోంది. ఇప్పటికింకా పిల్లలు లేరు. సంతానలేమి సమస్యను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ లాంటి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదేనా? ఒకవేళ తీసుకుంటే సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే విషయాలను దయచేసి పూర్తిగా వివరించండి. – ఆర్.నీలిమ, రాజమండ్రి కేవలం ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్య తీరదు. ఫోలిక్‌యాసిడ్ అనేది విటమిన్ బి9. ఇది జన్యువులోని డీఎన్ఏ తయారీకి తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల, అండం నాణ్యతకు, శుక్రకణాల నాణ్యతకు, కదలికలకు దోహదపడుతుంది. తద్వారా పిండం ఆరోగ్యకరంగా తయారుకావడానికి ఉపయోగపడుతుంది. పిండంలో కొన్ని అవయవలోపాలు, వెన్నుపూస, మెదడు లోపాలను చాలా వరకు రాకుండా అడ్డుపడి శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భం కోసం ప్రయత్నించే మూడునెలల ముందు నుంచి, దంపతులు ఇద్దరూ ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది. ఇది నీటిలో కరిగిపోయే విటమిన్. దీనివల్ల ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేవు. -
దానికి నిర్ణీత వయసు ఉంటుందా?
మా అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఈమధ్య రజస్వల అయింది. చిన్న వయసులోనే రజస్వల కావడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని బంధువులు ఒకరు చెప్పారు. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజస్వల కావడానికి నిర్ణీత వయసు అంటూ ఉంటుందా? – జీఎన్, ఖమ్మం సాధారణంగా రజస్వల 12 సంవత్సరాల నుంచి 15–16 సంవత్సరాల లోపల అవుతారు. ఈమధ్య కాలంలో తినే ఆహారంలో మార్పులు, జంక్‌ఫుడ్, అధికబరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక మార్పులు...ఇలా ఎన్నో కారణాల వల్ల కొందరు 10 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. మీ అమ్మాయి 13 సంవత్సరాలకు అయింది. తను కరెక్ట్ వయసుకే అయింది. దీనివల్ల ఇబ్బంది ఏమిలేదు. అంతకంటే ముందే అంటే 10–11 సంవత్సరాలకే అయిన వాళ్ళలో కొందరిలో ముందునుంచే ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవ్వడం వల్ల, ఎముకల పెరుగుదల తొందరగా ఆగిపోయి, ఎప్పుడు ఎత్తు పెరగకుండా ఆగిపోతారు. వీరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, కొందరిలో తర్వాత కాలంలో పిల్లలు పుట్టకపోవడం, అధికబరువు వంటి ఇతర కారణాలు జత కలసినప్పుడు వారికి రక్తపోటు, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి వీరు క్రమంగా వ్యాయామాలు చేస్తూ బరువు పెరగకుండా ఉండటం, అప్పుడప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, రక్తపరీక్షలు, స్కానింగ్ చెయ్యించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు లేదా ముందుగా తెలుసుకుని చికిత్స తీసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్. నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. ‘పొజిషనల్ థెరపీ’ వల్ల గర్భిణులకు చక్కగా నిద్ర పడుతుందని చదివాను. దీని గురించి వివరంగా తెలియజేగలరు. – పి.నీరజ, పొద్దుటూరు గర్భిణి సమయంలో బిడ్డ పెరిగేకొద్ది బరువు నడుము మీద పడడం, పడుకున్నప్పుడు అటూ ఇటూ తిరగడానికి ఇబ్బంది, అసౌకర్యంతో నిద్ర సరిగా పట్టదు. (పెరిగే బిడ్డ బరువు, సాగే గర్భాశయం ఒత్తిడి వెన్నుపూస మీద ఉంటుంది. గర్భవతి వెల్లకిలా పడుకున్నప్పుడు దానివల్ల వెన్నుపూసకు లోపలివైపు గర్భశయానికి మధ్యలో ఉండే ఇన్ఫీరియర్ వీనకేవా (ఐవీసీ) ఆర్టెరీ అనే రక్తనాళం పై పడి తల్లికి, బిడ్డకి రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల, అలాగే వెల్లకిలా పడుకున్నప్పుడు, తల్లికి ముక్కు నుంచి శ్వాస సరిగా అందకపోవడం వల్ల, తల్లికి సరిగా నిద్రపట్టకపోవటం అలాగే బిడ్డకు సరిగ్గా ఆక్సిజన్ అందక బరువు పెరగక పోవడం, కొందరిలో కడుపులో చనిపోయే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి తల్లి ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల రక్తనాళాలపైన ఒత్తిడి తగ్గి, రక్తసరఫరా ఇద్దరికీ సరిగా ఉంటుంది. తల్లి నిద్రపోవడం ఎంత మంచిదో అలాగే సరైన పొజిషన్లో పడుకోవడం కూడా తల్లికి బిడ్డకి చాలామంచిది. అందుకోసం పొజిషనల్ థెరపీని వాడడం మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇందులో నడుంకి ఒక బెల్టులాంటిది కట్టుకొని, దానికి వెనకాల వైపులో తక్కువ బరువు ఉన్న చిన్న బాల్స్‌ని ఉంచడం వల్ల, తల్లి నిద్రలో తెలియకుండ వెల్లకిలా పడుకోడానికి తిరిగినా, బాల్స్ వల్ల కలిగే అసౌకర్యం వల్ల, ఒకవైపుకే (ఎడం వైపు) తిరిగి పడుకోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లికి నిద్ర సరిగా పడుతుంది, అలాగే బిడ్డకి కూడా రక్తప్రసరణ సరిగా ఉంటుంది. మా అమ్మాయి స్వభావరీత్యా చాలా కూల్ అయితే ఈ మధ్య కాస్త ఇబ్బందిగా ప్రవర్తిస్తుంది. అకారణంగా కోపం తెచ్చుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతుంది. ఒక స్నేహితురాలిని సలహా అడిగితే ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ అంటూ ఏదో చెప్పింది. దీని నివారణ చర్యలు ఉంటే తెలియజేయగలరు. – డీఎన్, భువనగిరి కొంతమందిలో హార్మోన్లలో మార్పుల వల్ల పీరియడ్స్ మొదలయ్యే 15 రోజులు ముందు నుంచి టెన్షన్, కోపం, చిరాకు, డిప్రెషన్, శరీరం ఉబ్బడం, అలసట, రొమ్ములు బరువుగా నొప్పిగా ఉండడంలాంటి లక్షణాలు ఉండవచ్చు. దీనినే ‘ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్’ అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మెడిటేషన్, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కొద్దిగా ఉపశమనం దొరకుతుంది. ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవటం, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవటం మంచిది. అలాగే విటమిన్ బి6, ఇ, కాల్షియం, మెగ్నీషియంతో కూడిన విటమిన్ టాబ్లెట్స్ వాడవచ్చు. ప్రిమ్రోజ్ ఆయిల్ క్యాపుల్స్ వాడి చూడవచ్చు. మరీ టెన్షన్, చిరాకు లక్షాణాలు తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీడిప్రెషన్ మందులు వాడొచ్చు. హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? చాలా రిస్క్ అని మా బంధువులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.ప్రీతి పిడుగురాళ్ల గుండెజబ్బులు ఉన్నవాళ్లలో, గుండె పనితీరులో తేడా ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత రక్తం పల్చబడుతుంది. గుండె ఎక్కువ రక్తం సరఫరా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు కొట్టుకోవలసి ఉంటుంది. గుండె మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, బలహీనంగా ఉన్న గుండె పైన ఒత్తిడి పెరగడం వల్ల, ఆయాసం పెరగడం, ఊపిరి ఆడకపోవడం, హర్ట్ ఫెయిల్ అవ్వడం, రక్తం గూడుకట్టడం వంటి ప్రాణాపాయస్థితి కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అబార్షన్లు. శిశువు బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరి గుండె జుబ్బును బట్టి, దాని తీవ్రతను బట్టి గర్భం దాల్చిన తర్వాత సమస్యల తీవ్రత ఉంటుంది. గుండెజబ్బు ఉన్న వాళ్లు గర్భం దాల్చకముందే, డాక్టర్‌ను సంప్రదించి వారి గుండె పనితీరు ఎలా ఉంది, గర్భం దాల్చవచ్చా లేదా గర్భం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ తెలుసుకొని ప్రయత్నం చేయడం మంచిది. ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు గర్భం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. - డా‘‘ వేనాటి శోభ ,బర్త్‌రైట్ బై రెయిన్బో ,హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆ సమయంలో బరువు.. నొప్పి...!
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి తెలియజేయగలరు. అలాగే ఈ కాలంలో ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది? – బి.రుక్మిణి, ఆదిలాబాద్ వర్షాకాలంలో జరిగే మార్పులకు అనుగుణంగా గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దాహం ఎక్కువగా ఉండదు. అయినా కానీ గుర్తుపెట్టుకొని రోజుకి కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల ఫిల్టర్ వాటర్‌ను తాగాలి. అలాగే కొద్దిగా చెమట పట్టడం ఉంటుంది. కాబట్టి లూజుగా ఉండి, బాగా గాలి ఆడే కాటన్ బట్టలు వేసుకోవాలి. పాలిస్టర్, సింథటిక్ లాంటి ఒంటికి అంటుకునే బట్టలు వేసుకోకపోవడం మంచిది. అలాగే జారిపడిపోకుండా ఉండే చెప్పులను వేసుకోవాలి. తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఈ సమయంలో జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే వేరేవాళ్లకి ఉండే జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్స్ తొందరగా సోకే అవకాశాలు ఉన్నాయి. పచ్చి కూరగాయలు, సలాడ్స్ తీసుకోకపోవడం మంచిది. బాగా ఉడకబెట్టిన కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. లేదంటే కూరగాయలపైన ఉన్న క్రిములు, నులిపురుగుల గుడ్లు వంటివి ఒంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మాంసాహారం కూడా బాగా ఉడకబెట్టిన తర్వాతే తీసుకోవాలి. బయటి ఆహారం ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోవడం మంచిది. తాజా పండ్లను గోరువెచ్చని నీటిలో కడిగి తినాలి. పండ్లను ముక్కలుగా చేస్తే మటుకు వెంటనే తినేయాలి. లేకపోతే వాటిపై త్వరగా బ్యాక్టీరియా వంటి క్రిములు చేరే అవకాశాలు ఎక్కువ. గర్భిణీగా ఉన్న సమయంలో రోగనిరోధక శక్తి మిగతా వాళ్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏ రూపంలో అయినా త్వరగా సోకే అవకాశాలు ఉన్నాయి. అలాగే బొద్దింకలు, క్రిములు లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఐరన్ డెఫీషియన్సీ వల్ల‘హెవీ పీరియడ్స్’ సమస్య ఎదురవుతుందని చదివాను. భవిష్యత్‌లో ఈ సమస్య ఎదురుకాకుండా ఉండడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థలుతీసుకోవాలనుకుంటున్నాను.ఏఆహారపదార్థాలలో‘ఐరన్’ఎక్కువగాఉంటుందోతెలియజేయగలరు. - మణి,తిరుపతి హెవీ పీరియడ్స్ అనేది ఐరన్ డెఫీషియన్సీ వల్ల రాదు. హెవీ పీరియడ్స్ వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అయిపోయి, రక్తహీనత ఏర్పడి ఐరన్ డెఫీషియన్సీ ఏర్పడుతుంది. ఐరన్ ఖనిజం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగి శరీరంలో రక్తం పెరుగుతుంది. ఐరన్ ఎక్కువగా పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, పప్పులు, బఠాణీలు, జీడిపప్పు, బాదం, కర్జూరం, అంజీర వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. మాంసం, లివర్, గుడ్లు, చేపలు వంటి మాంసాహారంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఐరన్ రక్తంలోకి తొందరగా, ఎక్కువ మోతాదులో ఇముడుతుంది. కాబట్టి మీరు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, పల్లీపట్టీలు, క్యారెట్, బీట్రూట్, పండ్లు, పండ్ల రసాలు, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల ఐరన్ రక్తంలో కలిసి హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. ఈ ఆహారం తీసుకునేటప్పుడు కాఫీ, టీ వంటివి తీసుకోకుండా ఉండటమే మంచిది. ఇవి ఐరన్‌ను రక్తంలోకి ఇమడకుండా చేస్తాయి. తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే ఐరన్ కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే రక్తంలోకి ఇముడుతుంది. రక్తహీనత కేవలం ఆహారంతో తగ్గాలంటే చాలా నెలలు పడుతుంది. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, వారి సలహా మేరకు ఐరన్ మాత్రలు వాడటం మంచిది. నా వయసు 22 ఏళ్లు. నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తాయి. కానీ ఆ సమయంలో వక్షోజాలు కాస్తంత బరువుగా, నొప్పిగా అనిపిస్తాయి. అలాగే వాటి సైజు కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. దీనికి గల కారణాలను తెలపండి. అలాగే వీటికి ఏదైనా చికిత్స ఉంటుందా? ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తెలియజేయగలరు. – మాధవి, హైదరాబాద్ పీరియడ్స్ టైమ్‌లో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొందరిలో వక్షోజాలంలో నీరు చేరడం జరుగుతుంది. దానివల్ల రొమ్ములు బరువుగా, కొద్దిగా నొప్పిగా, అలాగే వక్షోజాల పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. పీరియడ్స్ అయిపోయిన తర్వాత నీరు తగ్గిపోయి రొమ్ములు మళ్లీ సాధారణ పరిమాణానికి చేరుతాయి. ఇది చాలామందిలో పీరియడ్స్‌కి ముందు, పీరియడ్స్ సమయంలో జరిగే మార్పు. దీనినే"Premenstrual Mastalgia' అంటారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే లక్షణాల తీవ్రత పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తే, డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే మందులు వాడుకోవచ్చు. వీటిలో మొదటిగా విటమిన్–ఇ, మెగ్నీషియం, మల్టీవిటమిన్స్, ప్రిమ్రోజ్ ఆయిల్ వంటివి కలిసి ఉన్న ట్యాబ్లెట్స్ ఆరు నెలల వరకు వాడుకోవచ్చు. ఆ సమయంలో ఆహారం తీసుకునేటప్పుడు తక్కువ మసాలాలు, తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోవాలి. అలాగే కొద్దిగా నడక, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది. - డా‘‘ వేనాటి శోభ ,బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ ,హైదరాబాద్ -
అదంటే చాలా భయం
‘టోకోఫోబియా’ గురించి వివరంగా తెలియజేయగలరు. ఈ ఫోబియా వల్ల ప్రమాదం ఉందా? దీని నుంచి ఎలా బయటపడాలి? అనేది వివరించగలరు. – టీఎల్, ఏలూరు గర్భం దాల్చడం అంటే భయం, అలాగే కాన్పు గురించిన భయం, కాన్పు సమయాల్లో జరిగే మార్పులు, నొప్పుల గురించి విపరీతమైన భయాన్నే టోకోఫోబియా అంటారు. ఇందులో ప్రైమరీ టోకోఫోబియా, సెకండరీ టోకోఫోబియా ఉంటాయి. ఒక్కసారి కూడా గర్భం దాల్చక ముందే .. కాన్పు గురించి విపరీతమైన భయాన్ని ప్రైమరీ టోకోఫోబియా అంటారు. ఇక కాన్పులో వచ్చే నొప్పులు, సమస్యలతో కూడిన చెడు అనుభవం వల్ల మరలా గర్భం దాల్చడానికి కలిగే భయాన్ని సెకండరీ టోకోఫోబియా అంటారు. చిన్నతనంలో లైంగిక వేధింపులు, స్నేహితులు కాన్పు గురించిన విషయాలను చెప్పేది విని, కాన్పు వీడియోలు చూడటం లాంటివి జరిగినప్పుడు వారిలో భయాలు, అపోహలు పెరుగుతాయి. దాంతో గర్భం దాల్చడానికి భయపడి, గర్భం కోసం ప్రయత్నాలు కూడా చేయరు. కొంతమంది భర్తలను దూరం పెడతారు. కొంతమంది గర్భం దాల్చినా సిజేరియన్ చేయమంటారు. దీనికి ప్రధానంగా కౌన్సెలింగ్ చేయడం ఒక్కటే మార్గం. వీరికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. డాక్టర్‌తో మెల్లమెల్లగా ఎక్కువ సెషన్స్‌లో కౌన్సెలింగ్ చేయించుకోవడం ద్వారా వారికి కాన్పు మీద ఉన్న భయం దూరమవుతుంది. అలాగే ధ్యానం, యోగా కూడా ఉపయోగపడతాయి. యాంటీబయోటిక్స్ తీసుకునే గర్భిణులకు ‘బేబీస్ ఇన్ఫెక్షన్ రిస్క్’ ఎక్కువగా ఉంటుందని ఈమధ్య ఎక్కడో చదివాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. – స్వాతి, నకిరెకల్ గర్భిణీలు యాంటీబయోటిక్స్ ఎలా అంటే అలా వాడకూడదు. ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయితేనే వాడాలి. అలాగే యాంటీబయోటిక్స్ వాడకపోతే వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు వాడవలసి ఉంటుంది. గర్భిణీలు వాటిని తరచూ వాడటం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. మంచి బ్యాక్టీరియా అనేది తల్లి నుంచి బిడ్డకు కూడా చేరి వారిలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. రోగకారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడే తెల్లకణాలను వృద్ధి చేస్తాయి. తల్లి యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడితే బిడ్డలో కొన్నిసార్లు రోగనిరోధకశక్తి తగ్గి, పుట్టిన తర్వాత తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి గర్బిణీలు అవసరాన్నిబట్టే యాంటీబయోటిక్స్‌ను డాక్టర్ సలహామేరకు వాడాలి. అలాగని వదిలేస్తే తల్లిలో ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగి, అది బిడ్డకు కూడా సోకి ఇద్దరికీ ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. నా వయసు 25. నాకు పీరియడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తున్నాయి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. మూడు నెలలు మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. మందులు వాడిన మూడు నెలల తరువాత టెస్ట్‌లు చేయించుకుంటే కొన్ని పాయింట్స్ తగ్గాయి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. థైరాయిడ్ వస్తే లైఫ్‌లాంగ్ మెడిసిన్ వాడాలి, పిల్లలు కూడా పుట్టరని తెలిసిన వారు అంటున్నారు. నాకు భయంగా ఉంది. – ఏఎన్, గుంటూరు థైరాయిడ్ గ్రంథి మెదడు ముందు భాగంలో ఉంటుంది. దీని నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ హార్మోన్ (టీ3, టీ4) ప్రతి ఒక్కరిలోని అనేక జీవప్రక్రియలకు ఎంతో అవసరం. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే టీఎస్‌హెచ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి టీ3, టీ4 హార్మోన్లను విడుదల అయ్యేటట్లు చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు టీఎస్‌హెచ్, టీ3, టీ4 హార్మోన్లు సక్రమంగా విడుదల కావు. అలాంటప్పుడు పీరియడ్స్ సరిగా రాకపోవడం, బ్లీడింగ్ ఎక్కువ, తక్కువ కావడం వంటి ఇబ్బందులు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఏర్పడతాయి. అలాంటప్పుడు థైరాయిడ్ సమస్యకు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ సక్రమంగా మందులు వాడాలి. థైరాయిడ్ హార్మోన్ అదుపులో ఉంటే ఇంకా ఇతర హార్మోన్లు, అండాశయాలు, గర్భాశయంలో సమస్యలు ఏమీ లేకపోతే, గర్భం రావటానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. థైరాయిడ్ మాత్రలు ఎప్పటికీ వాడాలా వద్దా అనేది, ఒక్కొక్కరి థైరాయిడ్ హార్మోన్ లోపం యొక్క తీవ్రతను బట్టి బరువు వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. బరువు మరీ ఎక్కువగా ఉన్నవారు... బరువు బాగా తగ్గితే, కొందరిలో హార్మోన్ లెవల్నిబట్టి హార్మోన్ మోతాదును మెల్లగా తగ్గిస్తూ రావచ్చు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు కొందరిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కావచ్చు. కాకపోతే డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లు చేయించుకుంటూ థైరాయిడ్ మందులు సరిగా వాడుతుంటే... థైరాయిడ్ హార్మోన్ అదుపులో ఉండి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి మీరు అనవసరంగా భయపడకుండా మందులు సక్రమంగా వేసుకుంటూ, పీరియడ్స్ ఇరెగ్యులర్‌గా రావడానికి గర్భాశయంలో కానీ అండాశయంలో కానీ వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
సందేహం: ఆ ప్రభావం బిడ్డపై ఉంటుందా ?
1. నా వయసు 20 సంవత్సరాలు. నెలసరి సమయంలో నాకు నొప్పి వచ్చి జ్వరం వచ్చినట్లు అవుతుంది. రక్తస్రావం అవుతుంది. చాలా నీరసంగా ఉంటుంది. ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుంది? పరీక్షలు ఏమైనా చేయించుకోవాలా? –కె.కె., నంద్యాల జవాబు: పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఆ సమయంలో ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అనేక రకాల లక్షణాలు రకరకాల తీవ్రతలో కనిపిస్తుంటాయి. ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి విడుదలయ్యే మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. కొంతమందిలో ఆ సమయంలో పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, నడుంనొప్పి, తలనొప్పి వంటి అనేక లక్షణాలు ఉండవచ్చు. సక్రమంగా వాకింగ్, వ్యాయామాలు, యోగ, మెడిటేషన్ వంటివి చెయ్యడం వల్ల చాలామటుకు పైన చెప్పిన లక్షణాల తీవ్రత తక్కువగా అనిపిస్తుంది. లేకపోతే ఆ రెండు మూడు రోజులకు ప్రతి నెలా నొప్పి నివారణ మాత్రలు, వాంతులకు మాత్రలు వాడి చూడవచ్చు. కొందరిలో గర్భాశయంలో కంతులు, వాపు, ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలు వంటివి ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి, బ్లీడింగ్, ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. వీటి నిర్ధారణకు పెల్విక్ స్కానింగ్ చెయ్యించుకుని, సమస్య ఏమన్నా ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకొని చూడవచ్చు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఒంట్లో రక్తం తగ్గి రక్తహీనత ఏర్పడి తొందరగా నీరసపడటం, అలసిపోవటం ఉంటుంది. ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) పరీక్ష చెయ్యించుకుని, రక్తహీనత ఉంటే, ఐరన్ మాత్రలు, విటమిన్ మాత్రలు వాడటం వల్ల నీరసం తగ్గుతుంది. 2. నా వయసు 24 సంవత్సరాలు. నాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతుంది. మూడో తరం మేనరికం మాది. మాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. వైజాగ్‌లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐయూఐ టెస్ట్ చేసి నాకు ఓకే అన్నారు. మా ఆయనకి కూడా స్పెర్మ్ కౌంట్ సరిపోయింది అన్నారు. అయినప్పటికీ ఇంకా మాకు పిల్లలు పుట్టడం లేదు. దీనికి కారణం మేకరికమేనా? లేదా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యామ్నాయ పరిష్కారం ఏదైనా ఉందా? దయచేసి తెలియజేయగలరు. –లక్ష్మీ, శ్రీకాకుళం జవాబు: గర్భం నిలబడాలంటే అండం విడుదల, స్పెర్మ్ కౌంట్ సరిగా ఉండటంతో పాటు, హార్మోన్ల సమతుల్యత, గర్భాశయం సరిగా ఉండటం వంటి ఎన్నో అంశాలు సరిగా ఉండాలి. మీకు అన్నీ పరీక్షలు సరిగా ఉన్నా, గర్భం నిలబడట్లేదు. కొందరిలో ఐయూఐ టెస్ట్‌లో శుక్ర కణాలను నేరుగా గర్భాశయం లోపలి పొరలోకి చిన్న ప్లాస్టిక్ సిరెంజ్ ద్వారా ప్రవేశపెట్టడం... ఇలా చేసినా కూడా శుక్రకణాలు, ట్యూబ్‌లోకి ప్రవేశించి, వాటంతట అవే అండంలోకి ప్రవేశించి, ఫలదీకరణ జరపవలసి ఉంటుంది. తద్వారా పిండం ఏర్పడుతుంది. కొందరిలో ఈ ఫలదీకరణ ప్రక్రియ, అండం లేక శుక్ర కణం నాణ్యత సరిగా లేకపోవడం వంటివి; ఇంకా తెలియని కారణాల వల్ల జరగకపోవచ్చు. అలాంటప్పుడు కూడా గర్భం రాకపోవచ్చు. ఒకవేళ ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడినా, పిండాన్ని గర్భాశయం స్వీకరించకపోవచ్చు. అలాంటప్పుడు పిండం పెరగలేక నశించిపోయి పీరియడ్ వచ్చేస్తుంది. ఈ సమస్య ఎందువల్ల వచ్చింది అని తెలుసుకోవటానికి పరిశోధనలు ఎన్ని పరీక్షలు చేసినా, కారణం, దాని చికిత్సను పూర్తిగా, సరిగా కనుగొనలేకపోయారు. ఈ రకం సమస్యను అధిగమించడానికి డాక్టర్లు రకరకాల చికిత్స విధానాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిలో భాగంగా ఐయూఐ ఒక్కసారిగా ఆపకుండా కనీసం మూడుసార్ల వరకు ప్రయత్నం చేసి చూడవచ్చు. అప్పటికి కూడా గర్భం రాకపోతే, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మరలా ఒకసారి విశ్లేషించుకుని, దానికి తగ్గట్లు చికిత్సలో మార్పుచేసి, అవసరమైతే ల్యాపరోస్కోపి చేసుకుని, మరొక మూడుసార్లు ఐయూఐ ద్వారా ప్రయత్నం చేయవచ్చు. దీని ద్వారా 20 నుంచి 30 శాతం గర్భం రావచ్చు. తర్వాత కూడా గర్భం అందకపోతే ఐయూఎఫ్ (టెస్ట్ ట్యూబ్ బేబి) పద్ధతిని అనుసరించవచ్చు. ఐయూఎఫ్లో కూడా 40% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. మేనరికం వల్ల కొందరిలో అబార్షన్లు అవ్వడం, పిల్లలలో అవయవ లోపాలు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అంతేకాని మేనరికం వల్ల గర్భం దాల్చటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. 3. గతంలో నేను మా ఆయనతో పాటు ఆల్కహాల్ తీసుకునేదాన్ని. అయితే ఆల్కహాల్ తీసుకోవడం మానేసి సంవత్సరం దాటింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ఒకప్పటి బ్యాడ్ హ్యాబిట్ ప్రభావం కడుపులో బిడ్డపై ఉంటుందా? అలా ఉండకుండా ఉండాలంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. –ఎన్.యస్, సికింద్రాబాద్ జవాబు: సాధారణంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే, బిడ్డలో అవయవ లోపాలు, మానసిక శారీరక ఎదుగుదలలో లోపాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఆల్కహాల్ తీసుకోవటం మానేసి సంవత్సరం దాటింది. కాబట్టి ముందు తీసుకున్న ఆల్కహాల్ వల్ల, బిడ్డపై ప్రభావం ఏమి ఉండదు. -
చాకొలెట్ సిస్టులు అంటే..?
పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుంది. ఈ సమస్య గురించి మా బంధువు ఒకరితో చెబితే...‘చాకొలెట్ సిస్టులు ఉండొచ్చు’ అన్నారు. అసలు ‘చాకొలెట్ సిస్టులు’ అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? మందులతో తగ్గిపోతాయా? – డి.పరమేశ్వరి, డోర్నకల్ పీరియడ్స్ సమయంలో గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొర చిన్న చిన్న ముక్కలుగా బ్లీడింగ్ ద్వారా యోని నుంచి బయటకు వచ్చేస్తుంది. కొందరిలో ఎండోమెట్రియమ్ పొర గర్భాశయంలో నుంచి, ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. కొందరిలో మెల్లగా అదే కరిగిపోతుంది. కాని కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి, అనేక రకాల తెలియని కారణాల వల్ల ఎండోమెట్రియమ్ పొర ముక్కలు కరిగిపోకుండా హార్మోన్ల ప్రభావం వల్ల ప్రేరేపితమై, ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులోని ఎండోమెట్రియమ్ పొరలో కూడా కొద్ది కొద్దిగా బ్లీడింగ్ అయ్యి, అక్కడ రక్తం గూడు కట్టడం జరుగుతుంది. దీనినే ఎండోమెట్రియేసిస్ అంటారు. ఈ పొర పొత్తికడుపులో గర్భాశయం వెనుక భాగం పైన, ప్రేగుల పైన, మూత్రాశయం పైన, అండాశయాల పైన... ఇంకా ఇతర భాగాలపైన అతుక్కుని పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండాశయం పైన అతుక్కున్న ఎండోమెట్రియల్ పొరలో నెలనెలా బ్లీడింగ్ అయ్యి అందులో రక్తం కొద్దికొద్దిగా చేరి గూడు కడుతూ, రక్తం, చాక్లెట్ రంగులో మారి గడ్డలాగా మారుతుంది. దీనినే చాక్లెట్ సిస్ట్ అంటారు. ఈ సిస్ట్లు ఒకటి రెండు సెంటీమీటర్లు మొదలుకొని 10 సెంటీమీటర్ల పైన పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు లేవు. అవి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్ల ప్రభావాన్ని బట్టి, గర్భాశయం లోని కొన్ని రకాల లోపాల వల్ల రావచ్చు. వీటి వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి, పరిమాణం బట్టి సంతానం కలగడంలో ఇబ్బంది వంటి ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. ఇవి 3 సెం.మీ. కంటే సైజు తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోన్ల మాత్రలు, ఇంజెక్షన్ల ద్వారా కొందరిలో తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే పరిమాణం పెద్దగా ఉండి, ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆపరేషన్ ద్వారా తొలగించవలసి ఉంటుంది. కొందరిలో ఆపరేషన్ చేసి తొలగించినా, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి మరలా చాక్లెట్ సిస్ట్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నేను చాలా సన్నగా ఉంటాను. ప్రెగ్నెంట్‌ని. ‘ఇప్పుడు కూడా ఇలా ఉంటే ఎలా? బాగా తినాలి. నీతో పాటు... కడుపులో ఉన్న నీ బిడ్డ కోసం కూడా తినాలి. నువ్వు ఎంత ఎక్కువ తింటే కడుపులో ఉన్న బిడ్డకు అంత ఆరోగ్యం’ అని చెబుతున్నారు. నాకేమో పరిమితికి మించి తినే అలవాటు లేదు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎక్కువ తినాలి అనే దాంట్లో ఎంత వాస్తవం ఉంది? నిజానికి గర్భిణులు ఎలాంటి పోషకాహరం తీసుకోవాలి? చెప్పగలరు. – జి.కవిత, విజయవాడ గర్భం దాల్చినంత మాత్రాన, ఎంత ఎక్కువ అంటే అంత తినాలని ఏమీ లేదు. 9 నెలలపాటు గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగడానికి, మామూలుగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. అంతేగాని, రెండింతలు తీసుకోవాలని లేదు. మాంసాహారులు అయితే గుడ్లు, మితంగా మాంసాహారం, చేపలు వంటివి తీసుకోవచ్చు. నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి పైన చెప్పిన పౌష్టికాహారంతో పాటు, రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. ఒకేసారి ఎక్కువగా తినడం ఇబ్బంది కాబట్టి, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు అంటే రెండు మూడు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ ఉండవచ్చు. సాధారణ బరువు ఉండి, గర్భవతులైనవారు మామూలు పౌష్టికాహారం తీసుకొని 9 నెలల్లో 8 నుంచి 11 కేజీల వరకు బరువు పెరగవచ్చు. అధిక బరువు ఉన్నవారు 5 నుంచి 8 కేజీలు బరువు పెరిగితే సరిపోతుంది. ఈ సమయంలో అధిక బరువు పెరగడం వల్ల బీపీ, షుగర్, ఆయాసం వంటి సమస్యలు, కాన్పు సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ‘గర్భిణులు వాడే మాత్రలతో శిశువులకు ముప్పు’ అనే వార్తను ఈమధ్య ఎక్కడో చదివాను. అయితే అందులో... ‘గుండెలో మంట సమస్యకు వేసుకునే మాత్రల వల్ల శిశువుకు ఆస్థమా వచ్చే అవకాశం ఉంది’ అని ఒకటీ అరా వివరాలు మాత్రమే ఉన్నాయి. మాత్రలంటే ఏ రకమైన మాత్రలు అనే వివరాలు లేవు. గర్భిణిగా ఉన్నవారు జలుబు, తలనొప్పి మాత్రలు... ఇలాంటివి వేసుకుంటే శిశువు మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? – బి.స్వప్న, అనంతపురం గర్భిణిలకు మొదటి మూడు నెలల సమయంలో శిశువులో దాదాపుగా అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కొన్ని రకాల మందులు వాడటం వలన శిశువు మీద ప్రభావం పడి, అవయవాలు సరిగా ఏర్పడకపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. ప్రెగ్నెన్సీలో వాడే మందులు వాటి దుష్ప్రభావాలను బట్టి ఎ, బి, సి, ఎక్స్ అనే కేటగిరీలుగా విభజించబడటం జరిగింది. ఎ, బి కేటగిరీకి చెందిన మందులను ప్రెగ్నెన్సీలో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. సి కేటగిరీ మందులను, అవి వాడకపోవడం వల్ల వచ్చే దుష్ఫలితం, వాడటం వల్ల వచ్చే రిస్క్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఎక్స్ కేటగిరీ మందులు ఎట్టి పరిస్థితుల్లోను వాడకూడదు. జ్వరానికి, తలనొప్పి వంటి నొప్పులకు పారసెటమాల్ మాత్ర వాడుకోవచ్చు. జలుబు, దగ్గుకి మిగతా సమస్యలకు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకోవాలి. సొంతగా మందుల షాపులో తీసుకుని వాడరాదు. నొప్పి నివారణ మాత్రలు అంటే డైక్లోఫినాక్, వొవెరాన్ వంటివి గర్భిణీలు వాడటం వల్ల శిశువు, కిడ్నీలు దెబ్బతినటం, ఉమ్మనీరు తగ్గిపోవటం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసిడిటీకి మందులు డాక్టర్ పర్యవేక్షణలో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. వీటివల్ల శిశువులో సమస్యలు ఏర్పడినట్లు పరిశోధనలలో ఎక్కువగా తేలలేదు. డా‘‘ వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్