ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. గర్భిణీ స్త్రీలు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి తెలియజేయగలరు. అలాగే ఈ కాలంలో ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది? – బి.రుక్మిణి, ఆదిలాబాద్
వర్షాకాలంలో జరిగే మార్పులకు అనుగుణంగా గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దాహం ఎక్కువగా ఉండదు. అయినా కానీ గుర్తుపెట్టుకొని రోజుకి కనీసం రెండు నుంచి రెండున్నర లీటర్ల ఫిల్టర్ వాటర్‌ను తాగాలి. అలాగే కొద్దిగా చెమట పట్టడం ఉంటుంది. కాబట్టి లూజుగా ఉండి, బాగా గాలి ఆడే కాటన్ బట్టలు వేసుకోవాలి. పాలిస్టర్, సింథటిక్ లాంటి ఒంటికి అంటుకునే బట్టలు వేసుకోకపోవడం మంచిది.
అలాగే జారిపడిపోకుండా ఉండే చెప్పులను వేసుకోవాలి. తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఈ సమయంలో జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే వేరేవాళ్లకి ఉండే జలుబు, దగ్గు, ఇతర ఇన్‌ఫెక్షన్స్ తొందరగా సోకే అవకాశాలు ఉన్నాయి. పచ్చి కూరగాయలు, సలాడ్స్ తీసుకోకపోవడం మంచిది. బాగా ఉడకబెట్టిన కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. లేదంటే కూరగాయలపైన ఉన్న క్రిములు, నులిపురుగుల గుడ్లు వంటివి ఒంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మాంసాహారం కూడా బాగా ఉడకబెట్టిన తర్వాతే తీసుకోవాలి.
బయటి ఆహారం ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకోవడం మంచిది. తాజా పండ్లను గోరువెచ్చని నీటిలో కడిగి తినాలి. పండ్లను ముక్కలుగా చేస్తే మటుకు వెంటనే తినేయాలి. లేకపోతే వాటిపై త్వరగా బ్యాక్టీరియా వంటి క్రిములు చేరే అవకాశాలు ఎక్కువ. గర్భిణీగా ఉన్న సమయంలో రోగనిరోధక శక్తి మిగతా వాళ్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్స్ ఏ రూపంలో అయినా త్వరగా సోకే అవకాశాలు ఉన్నాయి. అలాగే బొద్దింకలు, క్రిములు లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఐరన్ డెఫీషియన్సీ వల్ల‘హెవీ పీరియడ్స్’ సమస్య ఎదురవుతుందని చదివాను. భవిష్యత్‌లో ఈ సమస్య ఎదురుకాకుండా ఉండడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థలుతీసుకోవాలనుకుంటున్నాను.ఏఆహారపదార్థాలలో‘ఐరన్’ఎక్కువగాఉంటుందోతెలియజేయగలరు. - మణి,తిరుపతి
హెవీ పీరియడ్స్ అనేది ఐరన్ డెఫీషియన్సీ వల్ల రాదు. హెవీ పీరియడ్స్ వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అయిపోయి, రక్తహీనత ఏర్పడి ఐరన్ డెఫీషియన్సీ ఏర్పడుతుంది. ఐరన్ ఖనిజం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగి శరీరంలో రక్తం పెరుగుతుంది. ఐరన్ ఎక్కువగా పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్, బీట్‌రూట్, పప్పులు, బఠాణీలు, జీడిపప్పు, బాదం, కర్జూరం, అంజీర వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. మాంసం, లివర్, గుడ్లు, చేపలు వంటి మాంసాహారంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా ఈ ఐరన్ రక్తంలోకి తొందరగా, ఎక్కువ మోతాదులో ఇముడుతుంది. కాబట్టి మీరు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, పల్లీపట్టీలు, క్యారెట్, బీట్‌రూట్, పండ్లు, పండ్ల రసాలు, మాంసాహారం వంటివి తీసుకోవడం వల్ల ఐరన్ రక్తంలో కలిసి హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. ఈ ఆహారం తీసుకునేటప్పుడు కాఫీ, టీ వంటివి తీసుకోకుండా ఉండటమే మంచిది.
ఇవి ఐరన్‌ను రక్తంలోకి ఇమడకుండా చేస్తాయి. తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే ఐరన్ కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే రక్తంలోకి ఇముడుతుంది. రక్తహీనత కేవలం ఆహారంతో తగ్గాలంటే చాలా నెలలు పడుతుంది. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, వారి సలహా మేరకు ఐరన్ మాత్రలు వాడటం మంచిది.
నా వయసు 22 ఏళ్లు. నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తాయి. కానీ ఆ సమయంలో వక్షోజాలు కాస్తంత బరువుగా, నొప్పిగా అనిపిస్తాయి. అలాగే వాటి సైజు కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. దీనికి గల కారణాలను తెలపండి. అలాగే వీటికి ఏదైనా చికిత్స ఉంటుందా? ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తెలియజేయగలరు. – మాధవి, హైదరాబాద్
పీరియడ్స్ టైమ్‌లో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొందరిలో వక్షోజాలంలో నీరు చేరడం జరుగుతుంది. దానివల్ల రొమ్ములు బరువుగా, కొద్దిగా నొప్పిగా, అలాగే వక్షోజాల పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. పీరియడ్స్ అయిపోయిన తర్వాత నీరు తగ్గిపోయి రొమ్ములు మళ్లీ సాధారణ పరిమాణానికి చేరుతాయి. ఇది చాలామందిలో పీరియడ్స్‌కి ముందు, పీరియడ్స్ సమయంలో జరిగే మార్పు.
దీనినే"Premenstrual Mastalgia' అంటారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే లక్షణాల తీవ్రత పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తే, డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే మందులు వాడుకోవచ్చు. వీటిలో మొదటిగా విటమిన్–ఇ, మెగ్నీషియం, మల్టీవిటమిన్స్, ప్రిమ్‌రోజ్ ఆయిల్ వంటివి కలిసి ఉన్న ట్యాబ్లెట్స్ ఆరు నెలల వరకు వాడుకోవచ్చు. ఆ సమయంలో ఆహారం తీసుకునేటప్పుడు తక్కువ మసాలాలు, తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోవాలి. అలాగే కొద్దిగా నడక, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం మంచిది.
- డా‘‘ వేనాటి శోభ ,బర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్ ,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment