నా వయసు 48. మెనోపాజ్ దశలో బరువు పెరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సమయంలో డైటింగ్ చేయడం మంచిదేనా? ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువును అదుపులో పెట్టుకోవచ్చు అనేది వివరంగా తెలియజేయగలరు.
– కె.స్వాతి, నిర్మల్
మెనోపాజ్ దశలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల 5 శాతం వరకు పొట్ట దగ్గర.. పిరుదులు దగ్గర కొవ్వు చేరే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల శరీరం మెటబాలిజం తగ్గి కొవ్వు పెరుగుతుంది. అలాగే ఈ వయసులో పని చెయ్యటం తగ్గుతుంది. దాని వల్ల కూడా కొద్దిగా బరువు పెరుగుతారు. ఈ మార్పులు అందరిలో జరగాలని ఏం లేదు. అవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారు చేసే పనులను బట్టి ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఈ వయసులో ఉండే కొన్ని బాధ్యతలు, పిల్లలు దూరంగా వెళ్లడం, బందువుల మరణాలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ప్రభావం వల్ల కూడా కొందరు బరువు పెరుగుతారు. డైటింగ్ అంటే తిండి బాగా తగ్గించడం కాదు. మితంగా తీసుకోవడం, ఈ సమయంలో బరువు పెరగకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి, ఆహారంలో అన్నం తక్కువ తీసుకోవడం, నీళ్లు బాగా తాగడం, తృణధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, కొద్దిగా పండ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. మాంసాహారులు అయితే గుడ్లు, చికెన్, మటన్, చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. అలాగే వాకింగ్, ధ్యానం, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఎముకలు దృఢపడతాయి. ఆహారంలో స్వీట్లు, బేకరీ ఐటమ్స్, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ వయసులో కొందరిలో బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి, పైన చెప్పిన ఆహార నియమాలు, వ్యాయామాలు, నీటిని కూడా అదుపులో ఉంచుతాయి. ఆహారం కొద్దిగా కొద్దిగా విభజించుకుని 5–6 సార్లుగా తీసుకోవడం మంచిది. కాఫీ, టీలు కూల్ డ్రింకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మా చెల్లెలికి పిల్లలు లేరు. తన వయసు 36. వైద్యులను సంప్రదిస్తే ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్’ అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది? భవిష్యత్‌లో పిల్లలు కనే అవకాశం ఉండదా? పూర్తి వివరాలను తెలియజేయగలరు.
– బి.స్వర్ణలత, హిందూపురం
సాధారణంగా ఆడవారు 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపల పీరియడ్స్ ఆగిపోయి, మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కొందరిలో అనేక కారణాల వల్ల ఒవరీస్ (అండాశాయాల) పనితీరు ఆగిపోయి) 40 సంవత్సరాల కంటే ముందే పీరియడ్స్ ఆగిపోతాయి. దీనినే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ లేదా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. సాధారణంగా అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవుతుంది. అలానే అండాలు విడుదల అవుతూ ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల స్మోకింగ్, హార్మోన్స్‌లో లోపాలు ఆటోఇమ్యూన్ సమస్యలు, చిన్నతనంలో వైరల్ ఇన్‌ఫెక్షన్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇంకా ఎన్నో తెలియని కారణాలు వల్ల అండాశయంలోని అండాలు త్వరగా నశించిపోతాయి. అలానే అండాశయాల పనితీరు తగ్గిపోయి, ఈస్టోజన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవటం వల్ల, పీరియడ్స్ కొందరిలో 40 సంవత్సరాల కంటే ముందే ఆగిపోతాయి. మీ చెల్లెలికి ఈ సమస్య వల్ల అండాశయాల నుంచి అండాలు విడుదల అవట్లేదు. కాబట్టి సాధారణంగా పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు లేదు. కాకపోతే, వీరికి హార్మోన్ల పరీక్షలు చేసి వాటి విలువలను బట్టి, ఈవీఎఫ్ చికిత్స ద్వారా అనేకరకాల, ఎక్కువ డోస్ కలిగిన హార్మోన్స్, ఇంజెక్షన్లు, మందుల ద్వారా ప్రయత్నిస్తే.. 5–10 శాతం గర్భం నిలిచే అవకాశాలుంటాయి. అలా ప్రయత్నించినా గర్భం రాకపోతే, దాత నుంచి (డోనర్) తీసిన అండాలను ఉపయోగించి, గర్భం రావడానికి ప్రయత్నించవచ్చు.
నా వయసు 29. పెళ్లి అయ్యి ఐదేళ్లు దాటుతోంది. ఇప్పటికింకా పిల్లలు లేరు. సంతానలేమి సమస్యను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ లాంటి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదేనా? ఒకవేళ తీసుకుంటే సైడ్‌ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే విషయాలను దయచేసి పూర్తిగా వివరించండి.
– ఆర్.నీలిమ, రాజమండ్రి
కేవలం ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్య తీరదు. ఫోలిక్‌యాసిడ్ అనేది విటమిన్ బి9. ఇది జన్యువులోని డీఎన్‌ఏ తయారీకి తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల, అండం నాణ్యతకు, శుక్రకణాల నాణ్యతకు, కదలికలకు దోహదపడుతుంది. తద్వారా పిండం ఆరోగ్యకరంగా తయారుకావడానికి ఉపయోగపడుతుంది. పిండంలో కొన్ని అవయవలోపాలు, వెన్నుపూస, మెదడు లోపాలను చాలా వరకు రాకుండా అడ్డుపడి శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భం కోసం ప్రయత్నించే మూడునెలల ముందు నుంచి, దంపతులు ఇద్దరూ ఫోలిక్ యాసిడ్ మాత్ర రోజుకొకటి చొప్పున తీసుకోవడం మంచిది. ఇది నీటిలో కరిగిపోయే విటమిన్. దీనివల్ల ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేవు.
Comments
Please login to add a commentAdd a comment