న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ముందస్తు రజస్వల అవడానికి కూడా దారి తీస్తోందన్న దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా బయట పడింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాలికల్లో ఈ కేసులు పెరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది. సాధారణంగా బాలికలు 13 నుంచి 16 ఏళ్ల వయసులో రజస్వల అవుతుంటారు. కానీ, 8 ఏళ్ల బాలికలు సైతం ఉదంతాలు బయటపడ్డాయి. ‘‘ఒకమ్మాయి నా దగ్గరికొచ్చింది.
ఆమె వయసు ఎనిమిదేళ్ల తొమ్మిది నెలలు. అప్పుడే íపీరియడ్స్ మొదలయ్యాయి’’ అని ఢిల్లీలోని ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మన్‌ప్రీత్ సేథీ చెప్పారు. కరోనాకు ముందు ఎర్లీ ప్యూబర్టీ కేసులు నెలకు 10 వరకూ వచ్చేవని, ఇప్పుడు 30 దాటుతున్నాయని వెల్లడించారు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి.
కారణమేమిటి?: ముందస్తు రజస్వలకు ప్రధాన కారణం కోవిడ్–19 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితయ్యారు. విద్యార్థులకు ఆటపాటలు కూడా లేవు. నెలల తరబడి ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఫలితంగా వారిలో జీవక్రియలు(మెటబాలిజం) ప్రభావితమయ్యాయి. మన మెదడు మన శరీరం ఎత్తును పరిగణనలోకి తీసుకోదు.
బరువును మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒక స్థాయి బరువుకు చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబర్టీని ప్రేరేపిస్తుంది. ఫలితంగా బాలికల్లో పిరియడ్స్ ప్రారంభమవుతాయి. ఇందులో హార్మోన్ల స్థాయి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే బరువును నియంత్రణలో ఉంచుకుంటే ముందుస్తు రజస్వలను అరికట్టవచ్చని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment