నా వయసు 22. ఎత్తు ఐదడుగుల ఐదంగుళాలు. బరువు 75 కిలోలు. నాలుగేళ్లుగా పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. 2 -3 నెలలకోసారి వచ్చి బ్లీడింగ్ ఒక్కరోజు మాత్రమే అవుతోంది. డాక్టర్‌ని సంప్రదిస్తే స్కానింగ్ చేసి అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. నాకు పీరియడ్స్ సక్రమంగా రావాలంటే ఏం చేయాలి?
- సాయిలక్ష్మి, గుంటూరు
మీ ఎత్తుకు 60 - 65 కిలోల బరువు మాత్రమే ఉండాలి. మీరు ఉండాల్సినదానికంటే 10 కేజీలు అధికంగా బరువు ఉన్నారు. ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఇంకా కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి, అండాశయాలలో నీటి బుడగలు అంటే పాలీసిస్టిక్ ఓవరీస్ (పీసీఓ) ఏర్పడతాయి. మీరు క్రమంగా వ్యాయామాలు, డైటింగ్ చేస్తూ బరువు తగ్గడం వల్ల చాలావరకు హార్మోన్స్ సక్రమంగా విడుదలై పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలుంటాయి. అంతేగాక డాక్టర్‌ను సంప్రదించి, వారి పర్యవేక్షణలో అవసరమైన హార్మోన్ మాత్రలూ, ఇతరత్రా మందులు వాడాల్సి ఉంటుంది.
నాకిప్పుడు ఆరోనెల. భోజనం చేశాక గుండెలో మంటగా, ఛాతీపై బరువు పెట్టినట్లుగా ఉంటోంది. నా ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - సంధ్యారాణి, శ్రీకాకుళం
గర్భవతుల్లో సాధారణంగా 28 వారాల సమయంలో మీరు చెప్పిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పైకి ఎగదన్నడమే దీనికి కారణం. గర్భవతుల్లో కండరాలను వదులుగా అయ్యేలా చేయడానికి ప్లాసెంటా నుంచి ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ హార్మోన్ ఇతర కండరాలు అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం-అన్నవాహిక మధ్యన ఉండే కవాటం వంటి స్ఫింక్టర్ మొదలైన వాటి మీద కూడా తన ప్రభావం చూపి వాటిని వదులు చేయడం వల్ల తిన్న పదార్థం, దానితో పాటు జఠరరసం వంటివి జీర్ణాశయం నుంచి అన్నవాహికలోకి పైకి ఎగజిమ్ముతాయి. చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం, తినగానే పడుకోకుండా కాస్త వాకింగ్ చేయడం, పడుకున్నప్పుడు తలగడ పెట్టుకోవడం, ఆహారంలో కారం, వేపుళ్లు, మసాలాలు తక్కువ తీసుకోని, మజ్జిగలాంటి తీసుకోవడం వల్ల ఈ సమస్య తీరుతుంది. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని యాంటాసిడ్స్ వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్