నా వయసు 50. పీరియడ్స్ ఆగిపోయి మూడేళ్లు అయ్యింది. ఆర్నెల్ల నుంచి నాకు కొంచెం కంగారుగా ఉండటం, గుండె దడగా అనిపించడం, జ్వరం వచ్చినట్టు ఉండి, ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మూత్రం కూడా మాటిమాటికీ రావడం, యోనిలోపల మంట ఉంటున్నాయి. నా సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి.
- రాజేశ్వరి (పేరు మార్చాం), కర్నూలు
పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అండాశయాల పనితీరు తగ్గడం వల్ల ఈస్ట్రోజెన హార్మోన్ మెల్లగా తగ్గిపోతుంది. ఇది పీరియడ్స్ ఆగిపోయే మూడేళ్ల ముందు నుంచీ, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత... ఇలా ఎప్పుడైనా జరగవచ్చు. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపించడం వల్ల మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలా శరీరంలోంచి వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించడాన్ని హాట్‌ఫ్లషెస్ అంటారు. ఈస్ట్రోజెన్ లోపం వల్ల మూత్రనాళం, యోనిలోపల ఉన్న పొర పలచబడటం... వీటి ఫలితంగా తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొంతమందిలో మూత్రాశయం కండరాలు బలహీనపడి పటుత్వం కోల్పోవడం వల్ల దగ్గినా, తుమ్మినా మూత్రం పడిపోవడం, మూత్రంపై అదుపులేకపోవడం వంటివీ జరగవచ్చు.
మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు మిమ్మల్ని పరీక్ష చేసి తగిన చికిత్స చేస్తారు. ఈ లక్షణాలు రుతుక్రమం ఆగడం వల్ల వచ్చినవా లేక ఇతరత్రా ఏవైనా సమస్యల వల్ల వచ్చాయా అని గుర్తించి దాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. లక్షణాల తీవ్రతను బట్టి ఈస్ట్రోజెన్ మాత్రలను డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్రోజెన్ క్రీమ్‌ను మూత్రనాళం దగ్గర, యోని భాగంలో పెట్టుకోవడం వల్ల అక్కడి పొర గట్టిపడి మూత్ర సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అధికరక్తపోటు, గుండెసమస్యలు, రక్తం గడ్డకట్టే సమస్యలు, కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉండేవాళ్లు... ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను అతి తక్కువ మోతాదులో, తక్కువకాలం డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్
గైనకాలజి కౌన్సెలింగ్
Published Thu, May 7 2015 11:37 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
Advertisement