Dr. venati sobha
-
బాలింతగా ఉన్నప్పుడు అలా చేయొచ్చా? సలహా ఇవ్వండి..
నేను నెల్లాళ్ల కిందట ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాను. ఇటీవలే డెలివరీ అయి, పాప పుట్టింది. బాలింతగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వివరించగలరు. –శ్రావ్య, నకిరేకల్ బాలింతలు ఎప్పుడైనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు కాని, రెండో డోసు కాని తీసుకోవచ్చు. అందరిలో లాగానే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాలింతల్లో కూడా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలిగా ఉన్నట్లు ఉండటం, ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర కొద్దిగా నొప్పి, వాపు వంటి చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. అలా ఉంటే లక్షణాలను బట్టి పారాసెటిమాల్ మాత్రలు రోజుకు రెండు మూడుసార్లు వేసుకోవచ్చు. ఆ సమయంలో బిడ్డకు మామూలుగానే తల్లిపాలు పట్టించవచ్చు. అంతకంటే పెద్దగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. తల్లి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఏర్పడే యాంటీబాడీస్ తల్లి పాల ద్వారా బిడ్డకు చేరి, బిడ్డకు కరోనా వ్యాధి రాకుండా కాపాడతాయి. కాబట్టి వేరే భయాలేవీ పెట్టుకోకుండా కోవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నా వయసు 23 ఏళ్లు, ఎత్తు 5.2, బరువు 49 కిలోలు. ఏడాది కిందట పెళ్లయింది. ఇప్పుడు నాకు మూడో నెల. ఏ కాస్త తిన్నా వెంటనే వాంతులు అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో ఇదంతా మామూలేనని చెబుతున్నారు. తిన్న ఆహారమేదీ కడుపులో ఇమడకుండా ఉంటే కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – కీర్తి, ఏలూరు గర్భందాల్చిన తర్వాత చాలామందికి మొదటి మూడు నెలల్లో పెరిగే పిండం నుంచి విడుదలయ్యే హెచ్‌సీజీ హార్మోన్ మోతాదును బట్టి, దాని ప్రభావం వల్ల వికారం, నీరసం, వాంతులు వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. చాలామంది తింటే ఎలాగూ వాంతి అయిపోతుందని తినడానికే భయపడతారు. తినకపోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి ఏర్పడి ఇంకా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వాంతులు అయినా ఫర్వాలేదు అనుకుని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అందులో కొద్దిగా అయినా ఆహారం పొట్టలోకి చేరుకుంటుంది. ఆహారంలో భాగంగా ఎక్కువగా కొబ్బరినీళ్లు, ఎలక్ట్రాల్, గ్లూకోన్–డి, మజ్జిగ, పెరుగు లస్సీ, పండ్లరసాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. ఆహారంలో నూనెవస్తువులు, పచ్చళ్లు, కారాలు, మసాలాలు, కాఫీ, టీ, కూల్డ్రింకులు వంటివి తీసుకోకపోవడం మంచిది. గైనకాలజిస్టును సంప్రదించి, వాంతులు తగ్గడానికి డాక్సినేట్, ఓన్‌డన్‌సెట్రాన్ వంటి మందులను తగిన మోతాదులో వాడుకోవడం వల్ల వాంతులు అదుపులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాంతులు ఎక్కువ అయిపోయి మరీ నీరసంగా ఉంటే, అవసరాన్ని బట్టి గ్లూకోజ్ సెలైన్లు పెట్టించుకోవాల్సి రావచ్చు. చాలావరకు మొదటి మూడునెలల్లో ఎక్కువ వాంతుల వల్ల బిడ్డ పెరుగుదలకు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కాబట్టి మీరు కంగారు పడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, గైనకాలజిస్టును సంప్రదించి తగిన మందులు తీసుకోవడం మంచిది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి.. -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 30. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి ఏడేళ్లు. మరొకరికి ఐదేళ్లు. రెండూ మామూలు కాన్పులే. పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ చేయించుకున్నాను. పీరియడ్స్ నెలనెలా కరెక్ట్‌గా వస్తాయి. కానీ బ్లీడింగ్ ఒకరోజు మాత్రమే అవుతుంది. నా సమస్య ఏమిటంటే... నాకు నెల రోజుల నుంచి రొమ్ముల నుంచి కొంచెం నీరులాగా వస్తోంది. రొమ్ములో కంతులు, నొప్పి లాంటివి ఏవీ లేవు. ఇది క్యాన్సర్ లక్షణమేమోనని భయంగా ఉంది. తగిన పరిష్కారం చెప్పండి. - సత్యవతి, తెనాలి రొమ్ము నుంచి నీరు రావడానికి చాలా కారణాలుంటాయి. అంతేగానీ క్యాన్సర్ ఒక్కటే కాదు. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంటే, మెదడులో ఏమైనా కంతుల వల్లగానీ, హైపోథైరా యిడిజమ్ వల్లగానీ, ఎక్కువ మానసిక ఒత్తిడి ఉండటం వల్లగానీ, లోదుస్తులు బాగా బిగుతుగా వేసుకోవడం వల్ల, రొమ్ములో కంతులు ఉన్నా లేదా యాంటీ డిప్రె సెంట్ మందులు వాడటం, మరికొన్ని రకాల మందులు చాలాకాలంగా వాడుతూ ఉండటం, ఆఖరుగా మీరు చెప్పినట్లుగా రొమ్ము క్యాన్సర్‌తో పాటు ఇంకా ఎన్నో ఇతర కారణాల వల్ల కూడా రొమ్ము నుంచి నీరులాగా, పాలలాగా స్రావాలు వస్తుంటాయి. ఈ కండిషన్‌ను గెలాక్టోరియా అంటారు. మీరు అనవసరంగా భయపడ కుండా డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకుని, అలా జరగడానికి అసలు కారణం తెలుసుకోండి. రొమ్ము పరీక్ష చేయించుకున్నప్పుడు ఏవైనా గడ్డలుగానీ, ఇన్ఫెక్షన్ గానీ ఉన్నాయా అని చూసి, అవసరమైతేనే రొమ్ము స్కానింగ్, మామోగ్రఫీ ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, సీబీపీ, ఈఎస్ఆర్ వంటి పరీక్షలు చేయించు కోండి. మీకు ఉన్న సమస్యకు కారణాన్ని తెలుసుకుని, దాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఏవైనా మందులను దీర్ఘకాలికంగా వాడుతుండటం వల్ల ఇలా జరుగుతు న్నట్లు తేలితే... అవసరమైతే వాటిని ఆపడం లేదా మార్చడం వల్ల కూడా ఉపయోగం ఉండవచ్చు. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. లోదుస్తులు కొంచెం వదులుగా వేసుకోవడం కూడా మేలు. మీకు మీరే అన్నీ ఊహించు కోకుండా ఒకసారి మీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ను సంప్రదించండి. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 35. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు.ఈ శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - శారద, శ్రీకాకుళం మీరు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. ఆపరేషన్ అయిన మొదటి వారంలో తేలిగ్గా అరిగే ఆహారం, పండ్లు తగినన్ని తీసుకోవాలి ఆపరేషన్ జరిగిన రెండు లేదా మూడవ రోజు నుంచి డాక్టర్ సూచన మేరకు లేచి కూర్చోవడం, కొంచెం దూరం నడవడం మొదలు పెట్టాలి నెల రోజుల నుంచి చిన్నపాటి పనులు చేసుకోవడంతోపాటు క్రమంగా తిరిగి రొటీన్ వర్క్‌ను దైనందిన కార్యక్రమంలో భాగం చేసుకోవాలి ఈ సమయంలో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్లు, విటమిన్లు తగుపాళ్లలో ఉన్న ఆహారం తీసుకోవాలి ఆరు వారాల వరకు బరువులు ఎత్తకపోవడం, లైంగిక జీవనానికి దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించాలి ఐరన్, క్యాల్షియం, బి-కాంప్లెక్స్ మందులు కాని డాక్టరు సూచించిన మందులను కాని వాడాలి కుట్లు మానిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. 4-6 వారాల మధ్య డాక్టర్ని కలిసి చెక్ అప్ చేయించుకోవాలి ఆపరేషన్ జరిగి రెండు నెలలు నిండినప్పటి నుంచి వాకింగ్, మూడు నెలల నుంచి ఎక్సర్సైజు మొదలు పెట్టాలి. రోజుకు కనీసం 20 - 30 నిమిషాల పాటు వ్యాయామం అవసరం. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
గైనకాలజి కౌన్సెలింగ్
నా వయసు 50. పీరియడ్స్ ఆగిపోయి మూడేళ్లు అయ్యింది. ఆర్నెల్ల నుంచి నాకు కొంచెం కంగారుగా ఉండటం, గుండె దడగా అనిపించడం, జ్వరం వచ్చినట్టు ఉండి, ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మూత్రం కూడా మాటిమాటికీ రావడం, యోనిలోపల మంట ఉంటున్నాయి. నా సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి. - రాజేశ్వరి (పేరు మార్చాం), కర్నూలు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అండాశయాల పనితీరు తగ్గడం వల్ల ఈస్ట్రోజెన హార్మోన్ మెల్లగా తగ్గిపోతుంది. ఇది పీరియడ్స్ ఆగిపోయే మూడేళ్ల ముందు నుంచీ, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత... ఇలా ఎప్పుడైనా జరగవచ్చు. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపించడం వల్ల మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలా శరీరంలోంచి వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించడాన్ని హాట్‌ఫ్లషెస్ అంటారు. ఈస్ట్రోజెన్ లోపం వల్ల మూత్రనాళం, యోనిలోపల ఉన్న పొర పలచబడటం... వీటి ఫలితంగా తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొంతమందిలో మూత్రాశయం కండరాలు బలహీనపడి పటుత్వం కోల్పోవడం వల్ల దగ్గినా, తుమ్మినా మూత్రం పడిపోవడం, మూత్రంపై అదుపులేకపోవడం వంటివీ జరగవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు మిమ్మల్ని పరీక్ష చేసి తగిన చికిత్స చేస్తారు. ఈ లక్షణాలు రుతుక్రమం ఆగడం వల్ల వచ్చినవా లేక ఇతరత్రా ఏవైనా సమస్యల వల్ల వచ్చాయా అని గుర్తించి దాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. లక్షణాల తీవ్రతను బట్టి ఈస్ట్రోజెన్ మాత్రలను డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్రోజెన్ క్రీమ్‌ను మూత్రనాళం దగ్గర, యోని భాగంలో పెట్టుకోవడం వల్ల అక్కడి పొర గట్టిపడి మూత్ర సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అధికరక్తపోటు, గుండెసమస్యలు, రక్తం గడ్డకట్టే సమస్యలు, కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉండేవాళ్లు... ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను అతి తక్కువ మోతాదులో, తక్కువకాలం డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్