Period Leave Policy in India: Funday Cover Story on Period Leave In Telugu - Sakshi
Sakshi News home page

Period Leave: లోలోపల మెలిపెట్టే బాధ.. సెలవు బలహీనతేనా.. కానేకాదు!

Published Mon, May 30 2022 10:13 AM | Last Updated on Mon, May 30 2022 12:59 PM

Funday Cover Story On Period Leave How Women Face Discrimination - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శరీరమంతా ఒక చోటే గడ్డకట్టినప్పుడు ఒక వైయక్తిక పర్వతం విస్ఫోటం చెందినప్పుడు నేను బాధని అరచేతిలో పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటాను అంటూ కె. గీత అనే కవయిత్రి మహిళల రుతుక్రమ బాధను వర్ణించారు. స్త్రీలకు మాత్రమే అర్థమయ్యే ఈ బాధ, ఇబ్బందికి కాస్త విశ్రాంతితో ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చు.

గృహిణులకు కొంచెం ఆ వెసులుబాటు ఉండొచ్చేమో కానీ కుటుంబం కోసం ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్న మహిళలకు ఆ విశ్రాంతి ఎలా దొరకుతుంది? సెలవు పెట్టాలంటే జీతం (ఆ రోజులకు) నష్టపోవాలి. పోనీ దానికీ సిద్ధపడి.. ‘నెలసరి వచ్చింది.. సెలవు కావాలి’ అని అడగడానికి ఏదో జంకు.. బిడియం.. భయం.. అర్థం చేసుకుంటారా? వెకిలిగా చూస్తే? కామెంట్‌ విసిరితే?

ఇన్ని సంకోచాల మధ్య సెలవు అడిగే బదులు ఎలాగోలా కొలువుకు రావడమే నయమనే నిస్సహాయ సర్దుబాటు. సగటు మహిళా ఉద్యోగి ప్రతినెలా ఎదుర్కొనే సున్నితమైన సమస్య ఇది. ఇలాంటి స్థితిలో ఆఫీస్‌ యాజమాన్యాలే అర్థం చేసుకొని  నెలసరిలో విశ్రాంతి తీసుకోమని అధికారికంగా ఒక రూల్‌ పాస్‌ చేస్తే ఎంత హ్యాపీ!  బహిష్టు సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటోంది సమాజం.

ఆ క్రమంలోనే పీరియడ్‌ లీవును మంజూరు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.. సిక్‌ లీవ్, మెటర్నిటీ లీవ్‌ తరహాలో! అయితే ఈ సెలవు మహిళల అవకాశాలను గండికొట్టడానికే తప్ప ఆమె సామర్థ్యానికి విలువనిచ్చేది కాదు అనే వాదన.. దీని వల్ల మహిళలు తాము శారీరకంగా బలహీనుమలని ఒప్పుకుంటున్నట్టే అనే అసంతృప్తి ఓ చర్చగా మారింది సర్వత్రా! ఆ చర్చనీయాంశాన్ని ఫన్‌డే కవర్‌ స్టొరీగా మీముందుకు తెచ్చాం! 

జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కాలు బెణికింది, బ్యాక్‌ పెయిన్‌ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు లేదనకుండా లీవ్‌ ఇస్తారు. ఇంట్లో పెద్దలు, పిల్లల అనారోగ్యాలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పిక్నిక్‌లు,  వ్రతాలు, యాత్రలు ఇలా సెలవు ఇవ్వడానికి అన్నీ సకారణాలే. కానీ పీరియడ్స్‌ను మాత్రం ‘సెలవు తీసుకోవడానికి ఓ వంకలా వాడుకుంటున్నారు మహిళలు’ అన్నట్టుగా చూస్తారు.. ‘అదేమైనా రోగమా రొష్టా సెలవు తీసుకోవడానికి’ అనీ అనుకుంటారు కొందరు మగబాసులు.

దీనికి ప్రధాన కారణం శారీరకంగా స్త్రీ, పురుషుల్లో భేదమే. ఇది ప్రతి నెల స్త్రీలకి తప్పనిసరి వ్యవహారం. సృష్టికి ప్రతిసృష్టిని అందించే అమ్మతనానికి ఇదే మూలం. ఒకప్పుడు నెలసరి వచ్చిందంటే అమ్మాయిలు ఓ మూల కూర్చోవాలి. ఎవరినీ ముట్టుకోకూడదు. ఎటూ తిరగకూడదు. నలుగురిలో కలవకూడదు. గుళ్లు, గోపురాలకు వెళ్లకూడదు. ప్రకృతి సహజంగా స్త్రీకి వచ్చే శారీరక మార్పులకు ఇన్ని ఆంక్షలు విధించడం కచ్చితంగా ఆమెపై చూపించే వివక్షే.

కానీ అందులో అంతర్లీనంగా బహిష్టు సమయంలో మహిళ శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, అందుకే ఈ సంప్రదాయాలు వచ్చాయని వాదించే వారు ఉన్నారు. రోజూ ఇంట్లో గొడ్డు చాకిరి చేసే మహిళకి ఆ మూడు రోజులే విశ్రాంతి దొరికేది. అలా ఎవరికీ కనిపించకుండా మూల కూర్చొనే స్థాయి నుంచి మహిళలు మగవారితో దీటుగా పనిచేయగల సమర్థతను సాధించడం వెనుక ఎంతో పోరాటం ఉంది.

మహిళల పట్ల సానుభూతితో కాకుండా ఆ సమయంలో వారిలో కలిగే నొప్పిని, బాధను, మానసికంగా పడే ఆవేదనను కొందరైనా అర్థం చేసుకుంటున్నారు. అయినా మన దేశంలో కేవలం 15 కంపెనీలు మాత్రమే పీరియడ్‌ లీవ్‌ మంజూరు చేస్తున్నాయి.

ఆ బాధ వర్ణనాతీతం
కౌమరంలోకి అడుగు పెట్టి రజస్వల అనే దశను మొదలు కొని అయిదు పదుల వయసులో ఏర్పడే మెనోపాజ్‌ వరకూ ప్రతి అమ్మాయి, ప్రతి మహిళా నెల నెల క్రమం తప్పకుండా ఎదుర్కోవలసిన  స్థితి నెలసరి.

కొంత మంది మహిళల్లో నెలసరి అనేది వారి శరీర తత్వాన్ని బట్టి ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా గడిచిపోతుంది. కానీ ఎక్కువ మంది మహిళల్లో పొత్తి కడుపులో తెరలు తెరలుగా నొప్పి వస్తుంది. మరికొందరిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో నరాల్లో రక్తమంతా ఆవిరైపోతున్నట్టు శరీరం వశం తప్పుతూ ఉంటుంది. కాళ్లల్లో సత్తువ ఉండదు. నిల్చోలేరు. కూర్చోలేరు. పడుకోలేరు. ఏమీ తినాలనిపించదు, తాగాలనిపించదు. ఆలోచనలు కుదురుగా ఉండవు. మూడ్‌ స్వింగ్స్‌ అసాధారణంగా ఉంటాయి.

లోలోపల మెలిపెట్టే బాధని దాచుకునే పరిస్థితులతో అసహనం కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, మూడీగా ఉండడం చూస్తుంటాం. ఆ సమయంలో ఆఫీసుకి వెళ్లాలంటే ప్రాణం పోతున్నంత పని అవుతుంది. అధిక రక్త స్రావంతో మరకలు అంటుకుంటే ఎలాగన్న భయం, పదే పదే శానిటరీ ప్యాడ్‌ మార్చుకోవడానికి వాష్‌ రూమ్‌కు పరిగెత్తాలంటే ఓ జంకు, నొప్పులు వేధిస్తున్నా పని మీద దృష్టి నిలపలేని నిస్సహాయత ఇవన్నీ మహిళల్ని కుంగదీస్తున్నాయి. 

దీనికీ వెస్టే ఫస్ట్‌ 
పీరియడ్స్‌ టైమ్‌లో మహిళలకు సెలవు ఇవ్వాలన్న ఆలోచన పాశ్చాత్య దేశాల్లోనే ముందు మొదలైంది. సంప్రదాయాలకు, హిందూ జీవన విధానాలకు నెలవైన మన దేశంలో ఇలాంటి ఆలోచన చేయడం ఆలస్యంగా మొదలైంది. వందేళ్ల క్రితం 1920–30ల్లో మొట్టమొదటిసారి సోవియట్‌ రష్యా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడడం కోసం ఈ సెలవు ఇవ్వాలన్న ఆలోచన చేసింది.

మహిళలకు బహిష్టు సెలవు ఇవ్వాలని కార్మిక సంస్థలకు సిఫారసు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌.. మహిళల పీరియడ్‌ లీవ్‌కి ప్రాచుర్యాన్ని కల్పించింది. 1947లో దీనిపై చట్టం చేసింది. దక్షిణ కొరియా 1953లో ఒక్క రోజు పీరియడ్‌ లీవ్‌ ఇస్తూ చట్టం చేసింది. ఇండోనేసియాలో రెండు రోజులు, జాంబియాలో ఒక్క రోజు, తైవాన్‌లో ఏడాదికి మూడు రోజుల సెలవుతోపాటు ఆ సమయంలో అధికంగా మరో అరగంట బ్రేక్‌ ఇస్తోంది. ఇటీవల స్పెయిన్‌ కూడా మూడు రోజుల పాటు సెలవు ఇవ్వడానికి ఆమోదించింది. 

భారత్‌లో ఇలా.. 
మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బిహార్‌. కానీ మహిళల అంశంలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడింది. మహిళలకి ప్రతినెల రెండు రోజుల పీరియడ్‌ లీవ్‌ మంజూరు చేస్తూ 1992లోనే చట్టం చేసింది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు నినోంగ్‌ ఎరింగ్‌ మహిళలకు పీరియడ్‌ లీవ్‌ ఇవ్వాలంటూ 2017 నవంబర్‌లో ఒక ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

స్కూలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు, ఆఫీసుల్లో పని చేసే మహిళలకు టాయిలెట్‌ సౌకర్యాలు సరిగా లేవని, అవసరమైతే కాసేపు విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదని, అందుకే వారికి సెలవు మంజూరు చేస్తూ ఒక చట్టం చేయాలని ఆ బిల్లులో కోరారు. అయిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఆ బిల్లుపై కనీసం చర్చ కూడా జరగలేదు. 

సెలవు తీసుకుంటే వెనుకబడిపోతారా ?   
సమానత్వం కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న మహిళలు ఇప్పుడిప్పుడే ఆర్థికవృద్ధిలోనూ తమ వాటా ఉందని నినదిస్తున్నారు. మన దేశంలో దాదాపుగా 43.2 కోట్ల మంది స్త్రీలు ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో పని చేస్తూ ఆర్థిక వ్యవస్థకి వెనుదన్నుగా నిలుస్తున్నారు. దేశ జీడీపీలో 18% వాటాను మహిళలే అందిస్తున్నారు. మగవారితో సమానంగా మహిళలకూ అవకాశాలు లభిస్తే 2025 నాటికి దేశ జీడీపీలో 58 లక్షల కోట్ల రూపాయలు  మహిళల వాటాయే అవుతుందని మెకిన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ అంచనా వేసింది.

ఇలా మహిళలు ఎదుగుతున్న వేళ పీరియడ్స్‌లో మహిళలు విశ్రాంతి కోరుకొని సెలవు తీసుకున్నా ఇంట్లో విశ్రాంతి లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంటి పనుల భారం, బాధ్యత మహిళలే తీసుకోవాలి కాబట్టి అక్కడ పని చేయడం ఎలాగూ తప్పదు. ఇప్పటికే రకరకాల కారణాలతో ఆఫీసుల్లోకి మహిళా ఉద్యోగుల్ని తీసుకోవడం లేదు. తీసుకున్నా ఆడవారిపై వివక్ష కొనసాగు తూనే ఉంది. ఈ మధ్య విడుదలైన జాతీయ కుటుంబ సర్వే ప్రకారం గత అయిదేళ్లలోనే రెండు కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు వదులుకున్నారు. ఇప్పుడు పీరియడ్‌ లీవ్‌ ఇస్తే కంపెనీలు మహిళా ఉద్యోగులను వద్దనుకోవడానికి ఇదీ ఓ కారణం అవుతుందని వాదించేవారూ ఉన్నారు. 

ఆ వాతావరణమే లేదు 
21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇంకా మహిళలు స్వేచ్ఛగా ఈ అంశంపై మాట్లాడే వాతావరణమే మన దగ్గర లేదు. ఇదే అంశంపై ప్రజాభిప్రాయం కోరినప్పుడు సామాన్య మహిళలే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మాట్లాడేందుకు కాస్త తటపటాయించడం, మొహమాటపడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రతినెల అవసరమయ్యే శానిటరీ నాప్‌కిన్స్‌ కొనుగోలు చేసినప్పుడు ఎవరికీ కనిపించకుండా నల్ల క్యారీబ్యాగ్‌లలో ఇస్తూ అదేదో ఎవ్వరికీ తెలియకూడని బ్రహ్మపదార్థంలా దాచేస్తున్నారు.

స్త్రీలు తమ శరీరంలో సహజసిద్ధంగా జరిగే మార్పులపై చర్చించడం, మనసు విప్పి మాట్లాడ్డంలో తప్పులేదు. ఇది స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీనిని బలాలు, బలహీనతలు, సమర్థత, అసమర్థత అన్న కోణంలోంచి చూడలేం. మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంతో ఉంటేనే సమాజ పురోగతి సాధ్యమవుతుంది లేదంటే అభివృద్ధి గతి తప్పుతుంది.

అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇది అక్షర సత్యం. నెలసరి సమయాల్లో మహిళలకి విశ్రాంతి కల్పించడానికి ఇంటా, బయటా వారి చుట్టూ ఉండే మగవాళ్లు సహకారం అందివ్వాలి. ఇలా చేయడం మహిళలకి చేసే అదనపు సాయం కానేకాదు. ఇది అందరి బాగుకోసమే అన్న అవగాహన పెరగాలి. మహిళలు బహిరంగంగా డిమాండ్‌ చేసినా చేయకపోయినా పీరియడ్‌ లీవ్‌ ఇస్తే లాభమే తప్ప నష్టం లేదు.

ఆఫీసుకు వచ్చి కూడా సిగరెట్‌ బ్రేక్‌ అని, కాఫీ బ్రేక్‌ అని, ఇతరులతో పిచ్చాపాటి పేరు చెప్పుకొని మగవారు పని గంటల్ని వృథా చేస్తూనే ఉంటారు. వారు చేసే వృథాతో పోల్చి చూస్తే మహిళలకు ఇచ్చే సెలవు ఏమంత విషయం కాదు. బాధ్యత కలిగిన ప్రజా నాయకులందరూ ఈ దిశగా ఆలోచించాలి. ఎన్నో దేశాలు పీరియడ్‌ లీవ్‌ ఇస్తూ ఉంటే మన దేశంలో అది ప్రైవేటు బిల్లు స్థాయిలోనే ఉండడం, దానిపై చర్చ జరగకుండా డర్టీ థింగ్‌ అంటూ కొందరు పురుష ఎంపీలు అడ్డుతగలడం అత్యంత విషాదం.

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగినప్పుడే వారి సమస్యలను అర్థం చేసుకుని తదనుగుణంగా చట్టాలు రూపొందించుకోగలుగుతాం. ఇక పీరియడ్‌ సెలవు వినియోగించుకోవాలా, వద్దా అనేది పూర్తిగా ఆమె ఇష్టం. ఆ స్వేచ్ఛ ఆమెకి అవసరం. మహిళల పడే రుతుక్రమం బాధలపై తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, తోడబుట్టిన సోదరుడు కావొచ్చు. కన్న కొడుకే కావచ్చు.. ఆ మహిళతో కలిసి జీవన ప్రయాణం సాగించే ప్రతీ మగవాడు అర్థం చేసుకొని, వారికి అండగా ఉన్నప్పుడే మనందరం కలలు కనే జెండర్‌ సెన్సిటివిటీ సాకారం కావడానికి ఒక అడుగైనా ముందుకు పడుతుంది. 

ఎందుకీ నొప్పి వస్తుంది ? 
డిస్మెనోరియా అంటే తీవ్రమైన నొప్పితో కూడిన రుతుక్రమం. మనలో 30 శాతం మంది మహిళలను సాధారణ స్థాయి నుంచి తీవ్రమైన నొప్పి వేధిస్తూనే ఉంటుంది. 10 నుంచి 15 శాతం మందిని అధిక రక్తస్రావం బాధిస్తుంది. చాలామంది మహిళలు రుతుక్రమానికి ముందు శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారు. 5 నుంచి 10 శాతం మందిలో కుంగుబాటు, మూడ్‌ స్వింగ్స్, కడుపులో సూదులతో గుచ్చుతున్నట్టుగా, కండరాలు మెలిపెడుతున్నట్లు విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు.

వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి, ఇంకొన్ని జీవన శైలిలో మార్పుల కారణంగా వచ్చేవి. మరికొన్ని పర్యావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలు. అధిక బరువు (ఒబేసిటీ) కారణంగా హార్మోన్ల అసమతుల్యత, హైపో థైరాయిడిజం, అనీమియా (రక్త హీనత), తీవ్రమైన ఒత్తిడి కారణంగా పీరియడ్స్‌లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. పై లక్షణాలన్నింటికీ ఫలానా కారణమని చెప్పలేం.

కొందరికే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయన్నదానికీ సమాధానం దొరకదు. వారి వారి శారీరక ధర్మాలను అనుసరించి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన  శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల అసమతుల్యత కూడా రుతుక్రమంలో నొప్పికి కారణం కావచ్చు. చాలా మంది మహిళల్లో తొలి ప్రసవం తర్వాత ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. ఎండోమెట్రియాసిస్‌ లేదా ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా బహిష్టు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది.

అధిక రక్త స్రావంతో బాధపడేవారు, ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (నెలసరికి ముందు వచ్చే ఇబ్బందులు)తో బాధ పడేవారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆధునిక జీవన శైలిలో భాగమైన రాత్రివేళ ఎక్కువ సమయాలు మేల్కొని ఉండటం, చదువు వల్ల ఒత్తిడి, ఆఫీస్‌ పని భారం వంటి సమస్యలు నెలసరిలో ఇబ్బందులకి కారణాలుగా చెప్పవచ్చు. 
– డాక్టర్‌ వాణి చెరుకూరి, గైనకాలజిస్ట్, ఇవా వుమెన్‌ కేర్‌ క్లినిక్‌ 

పీరియడ్స్‌తో యుద్ధం కవరేజీ : బర్ఖాదత్‌ 
2020లో జొమాటో  సంస్థ పీరియడ్‌ లీవ్‌ ప్రకటించినప్పుడు ప్రముఖ మహిళా జర్నలిస్టు బర్ఖాదత్‌ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్థ సదుద్దేశంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ మహిళలు శారీరకంగా బలహీనులనే వాదనకు బలం చేకూరుతందని ఆమె అభిప్రాయడ్డారు. సైన్యంలో చేరాలని, కదనరంగం కవరేజీ ఇవ్వాలని, యుద్ధ విమానాలు నడపాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకుంటూ ఇంకోవైపు పీరియడ్‌ లీవ్‌ అడగడం ఎంతవరకు సమర్థనీయమని ఆమె ప్రశ్నించారు.

అంతేకాదు తాను కార్గిల్‌ యుద్ధం కవరేజీకి వెళ్లినప్పుడు పీరియడ్స్‌లో ఉన్నానని , నొప్పికి మాత్రలు వేసుకుంటూ, శానిటరీ నాప్‌కిన్స్‌ అందుబాటులో లేకపోతే టాయిలెట్‌ పేపర్లు వాడుతూ యుద్ధ వార్తల్ని ప్రపంచానికి వెల్లడించానన్నారు. బర్ఖా అప్పట్లో చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతు పలికిన వారి కంటే వ్యతిరేకించినవారే అధికంగా ఉన్నారు.

ఆడవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది 
ఉరుకుల పరుగుల జీవితంలో మగవారితో సమానంగా పోటీపడి పనిచేస్తున్న మహిళలకు సహజసిద్ధమైన ప్రకృతి నియమం పీరియడ్స్‌. వృత్తి రీత్యా మహిళా కానిస్టేబుల్స్, కండక్టర్లు మొదలు ఇలా ఎక్కువ సమయం విధుల్లో గడిపేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అయినప్పటికీ ఆ సమయంలో కూడా వారికి పని చేయక తప్పనిసరి పరిస్థితి ఇంటా బయటా ఉంటుంది. మెటర్నటీ లీవ్‌ ఎలా ఇస్తారో అదే విధంగా మహిళలకు పీరియడ్‌ లీవ్‌ ఇవ్వడంలో తప్పులేదు. అందరిలోనూ ఈ బాధ ఒకే రకంగా ఉండదు కాబట్టి  ప్రతినెల కాకుండా, ఏడాదికి కొన్ని రోజులు సెలవు కేటాయించడం మంచి పని. ఇక ఆ సెలవు తీసుకోవాలా, వద్దా అన్నది మహిళల చాయిస్‌. 
– సుమతి, తెలంగాణ డీఐజీ

ఆహ్వానించాల్సిన అంశం
నెలసరి వచ్చినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. ఆ సమయంలో విశ్రాంతి అవసరం. ఎన్నో ఆఫీసుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు లేవు. కొన్ని స్కూళ్లల్లో టాయిలెట్స్‌ లేక శానటరీ ప్యాడ్స్‌ మార్చుకునే వీలు ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడో దూరంగా బాత్‌రూమ్స్‌ ఉంటాయి. తలుపులు కూడా సరిగా ఉండవు.

అలాంటి చోట్ల మహిళలు చాలా ఇబ్బంది పడాలి. అందుకే పీరియడ్‌ లీవ్‌ ఇవ్వాలన్న ఆలోచన ఆహ్వానించాల్సిన అంశం. ఆ సమయంలో సెలవు తీసుకున్నంత మాత్రానా మహిళలు శారీరకంగా బలహీనులమని అంగీకరించినట్లన్న వాదన అర్థరహితం. 
– కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త 

ఇప్పటికీ చాలెంజే!
ఇప్పుడంటే ఆఫీసులు.. వాటిల్లో టాయ్‌లెట్స్‌.. కారవాన్స్‌ వచ్చాయి  కానీ నేను యాంకరింగ్‌కు వచ్చిన కొత్తల్లో అంటే 1991 ఆ టైమ్‌లో ఊళ్లకు వెళ్లి షూటింగ్స్‌ చేయాల్సి వచ్చినప్పడు టాయ్‌లెట్‌కైనా పీరియడ్స్‌ టైమ్‌లో ప్యాడ్స్‌ చేంజ్‌ చేసుకోవాలన్నాæ.. చెట్టు.. పుట్ట.. గట్టే గతి. వాటి చాటుకు వెళ్లి చేంజ్‌ చేసుకోవడమే. కానీ గంటలు గంటలు నిలబడి చేసే ప్రీరిలీజ్‌ ఫంక్షన్స్‌ ఇప్పటికీ చాలెంజే పీరియడ్స్‌ టైమ్‌లో.

ప్యాడ్స్‌ చేంజ్‌ చేసుకునే వీలే ఉండదు. కాస్ట్యూమ్స్‌ కూడా నా సౌకర్యం కోసం డార్క్‌ కలర్స్‌లో ఇవ్వమని అడగడానికి ఉండదు. ఒక్కోసారి లైట్‌ కలర్స్‌లో ఇస్తారు. అట్లాంటప్పుడు నేను తీసుకునే జాగ్రత్త ఒక్కటే ఎవ్రీ థింగ్‌ ఈజ్‌ ఇన్‌ ప్రాపర్‌ ప్లేస్‌ ఉండేట్టు చూసుకోవడమే. పాడ్‌ మీద పాడ్‌ .. పాడ్‌ మీద పాడ్‌ పెట్టుకుని వెళ్లిన సందర్భాలు, క్లాట్స్, క్రాంప్స్‌తో విలవిల్లాడిన సందర్భాలూ ఉన్నాయి. 
– యాంకర్‌ సుమ ఒక ఇంటర్వ్యూలో

బలహీనతగానే పరిగణించాలి
పురుషులతో సమానంగా పోటీపడుతున్నప్పుడు మహిళలు పీరియడ్‌ లీవ్‌ తీసుకుంటే వారి బలహీనతగానే పరిగణించాలి. ఈ ఆధునిక ప్రపంచంలో నెలసరి బాధల నుంచి బయట పడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. మందులు, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వాటితో ఈ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. సెలవు కోసం చట్టం చేయడానికి ముందుకొస్తే అందరితోనూ చర్చించి చేయాలి  – సంగీత వర్మ, విద్యావేత్త 

ఎన్నటికీ బలహీన పరచదు
ఈ లీవ్‌ మహిళల్ని ఎన్నటికీ బలహీన పరచదు. మగవారి కంటే మహిళలే అన్ని పనులు బాధ్యతతో చేస్తారు. ఆ సమయంలో విశ్రాంతి దొరికితే ఆ మర్నాడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. – కవిత రాజేశ్, ఎంట్రప్రెన్యూర్‌

స్వాగతించాలి తప్ప..
నెలసరి సమయంలో మహిళలకు ఎన్నో ఇబ్బందులుంటాయి. అందరిలోనూ ఒకేలా ఉండవు. ప్రభుత్వం వాటిని గుర్తించి సెలవు మంజూరు చేస్తే స్వాగతించాలి. అంతే తప్ప అది మహిళల అసమర్థతగా చూడకూడదు. అయితే ఈ పీరియడ్‌ లీవ్‌ను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించాలి.  – పి. సౌదామిని, డైరెక్టర్, సీఓడబ్ల్యూఈ, ఇండియా

స్విగ్గీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వరకు 
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థలోని డెలివరీ గర్ల్స్‌కి నెలకి రెండు రోజులు పీరియడ్‌ లీవ్‌ ఇస్తోంది. మహిళల హైజీన్‌ కోసం ఉత్పత్తుల్ని తయారు చేసే వెట్‌ అండ్‌ డ్రై కంపెనీ తమ కంపెనీలో పని చేసే మహిళలకు రెండు రోజులు అదనంగా సెలవు ఇస్తోంది. 

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ ఇండస్ట్రీ ఆర్క్‌ తమ సెలవుల్లో పీరియడ్‌ లీవ్‌ను కూడా చేర్చింది. ఒకటి, లేదా రెండు రోజులు ఆఫ్‌ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. 
మలయాళంలో మాతృభూమి పత్రిక నెలకి ఒక రోజు సెలవు ఇస్తోంది.
చెన్నైకి చెందిన డిజిటల్‌ మ్యాగజైన్‌ మ్యాగ్టర్‌ నెలకి ఒక రోజు లీవ్‌ ప్రకటించింది.
జొమాటో సంస్థ అమ్మాయిలకు ఏడాదికి అదనంగా 10 రోజుల సెలవు కల్పించింది. అవసరమైన వారు ఆ సెలవు వినియోగించుకుంటారని అలా ఇచ్చింది. 
ముంబైకి చెందిన డిజిటల్‌ మీడియా కంపెనీ కల్చర్‌ మిషన్‌ తమ సంస్థలో మహిళా ఉద్యోగులు వేతనంతో కూడిన ఒక్క రోజు సెలవు తీసుకోవడానికి అనుమతించింది. 
 బెంగుళూరుకు చెందిన స్టార్టప్‌ హార్సెస్‌ స్టేబుల్‌ న్యూస్‌ ఉద్యోగుల్లో 60 శాతం మహిళలే. ఈ సంస్థ నెలకు రెండు రోజులు పీరియడ్‌ లీవ్‌ మంజూరు చేసింది. 
  ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ తమ కంపెనీలోని మహిళా ఉద్యోగుల కోసం నెలకు ఒక్క రోజు పీరియడ్‌ లీవ్‌ ఇచ్చింది. 
కరోనా తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ పెరగడంతో ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు మహిళలకు నెలసరి సమయంలో ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

చదవండి: Russia- Ukraine: మూడో ముప్పు.. అసలు భయం అదే.. భారీ జనహనన ఆయుధాల వల్ల!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement